Leading News Portal in Telugu

Nadendla Manohar: జగన్ క్లియరెన్స్ సేల్స్ మొదలు పెట్టారు.. జనసేన ఘాటు వ్యాఖ్యలు


Nadendla Manohar: జగన్ క్లియరెన్స్ సేల్స్ మొదలు పెట్టారు.. జనసేన ఘాటు వ్యాఖ్యలు

Nadendla Manohar: సీఎం వైఎస్‌ జగన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్.. గత నెల నవంబర్‌మూడో తేదీన జరిగిన కేబినెట్ భేటీలో కొన్ని కంపెనీలకు విచిత్రమైన ప్యాకేజీలు ప్రకటించారు. దుకాణం మూసేసే ముందు క్లియరెన్స్ సేల్స్ పెట్టినట్టు.. వైఎస్‌ జగన్ కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాల పేరుతో జగన్ క్లియరెన్స్ సేల్స్ మొదలు పెట్టారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. కృష్ణపట్నం అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టును మేం కట్టలేమని అనిల్ అంబానీకి చెందిన రిలయెన్స్ సంస్థ ప్రతినిధులు లేఖ రాశారు. 2600 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పజెప్పేస్తామని అనిల్ అంబానీ సంస్థ చెప్పేసింది. కానీ, సడెన్‌గా అదే అనిల్ అంబానీ సంస్థకు ఆ భూములని కట్టబెట్టారు. ఏం క్విడ్ ప్రో కో జరిగిందని ఈ భూములను తిరిగి అనిల్ అంబానీకి కట్టబెట్టారు..? అని ప్రశ్నించారు.

ఇక, నియోజన్ ప్రాపర్టీ సంస్థ అపెరల్ పార్కు ఏర్పాటు చేస్తామంటే సుమారు 300 ఎకరాల్లో వైఎస్ భూములు కేటాయించారు అని గుర్తుచేశారు నాదెండ్ల.. ఈ భూములు తిరిగి ఇచ్చేయమని వైఎస్‌ జగన్ వెంటపడ్డారు.. వాళ్లు కోర్టుకెళ్లారు. అపెరల్ పార్క్‌గా కాకుండా ఇతర జనరల్ ఇంజనీరింగ్ అవసరాల కోసం కేటాయించాలని అదే సంస్థ కోరింది. అపెరల్ పార్క్‌ అయితే చాలా మంది మహిళలకు ఉపాధి లభించేది. జనరల్ ఇంజనీరింగ్ అనే పేరుతో భూములు కేటాయించడం వల్ల ఉపాధి అవకాశాలు చాలా వరకు తగ్గుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ, జగన్ అవేవీ పట్టించుకోకుండా భూములను కట్టబెట్టేస్తున్నారని మండిపడ్డారు. ఎస్ఐపీసీ ఒప్పుకోకున్నా.. తిరస్కరించినా.. సీఎం నేతృత్వంలోని ఎస్ఐపీబీ మాత్రం ఆమోదించింది. అప్పటి భూమి విలువ ఎంతుంది..? ఇప్పుడు భూముల విలువ ఎంతుంది..? ఈ రెండు సంస్థలకు భూములను అప్పగిస్తూ సేల్ డీడ్ చేయడం వెనుకున్న మతలబేంటీ..? అని నిలదీశారు.. ఇదే సమయంలో మేం ప్రభుత్వంలోకి రాగానే వీటిని పరిశీలిస్తాం అని ప్రకటించారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని సీఎం వైఎస్‌ జగన్‌ చెప్పుకుంటూ వచ్చారు. పరిశ్రమల కోసం వైఎస్ నాడు ఎస్ఈజెడ్ లు ఏర్పాటు చేశారు. పెట్టుబడులను వైఎస్సార్ ప్రొత్సహించారు. కానీ, వైఎస్ తనయుడైన జగన్ ఆ భూముల విషయంలో కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్.