Leading News Portal in Telugu

కడప కోటపై టీడీపీ జెండా? | tdp targets kadapa| assembly| loksabha| win| blow


posted on Dec 13, 2023 1:13PM

కడప జిల్లా అంటేనే వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట. కడప పార్లమెంట్ నియోజకవర్గం నుండి.. దాని పరిధిలోని అసెంబ్లీ స్థానాలలోనూ ఇప్పటి వరకూ వైఎస్ ఫ్యామిలీ ఆడిందే ఆట.. పాడిందే పాట. అయితే, ఇప్పుడు ఈ పరిస్థితి మారిందా? కడప కోటపై తెలుగుదేశం జెండా రెపరెపలాడబోతుందా? తెలుగుదేశం అధినేత చంద్రబాబు కడప అసెంబ్లీతో పాటు పార్లమెంట్ స్థానంపైనా గురిపెట్టారా?  సీఎం జగన్ కంచుకోటను తెలుగుదేశం ఈసారి బద్దలు కొట్టడం ఖాయమా? కడప పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలలో ఓడించి వైసీపీకి కోలుకోలేని దెబ్బ కొట్టేందుకు టీడీపీ ప్రణాళికలు సిద్ధం చేసిందా అంటే రాజకీయ పరిశీలకులు అవుననే అంటున్నారు. 

కడప పార్లమెంట్ నియోజకవర్గం విషయానికి వస్తే.. ఈ నియోజకవర్గం పుట్టిన దగ్గరి నుండి ఇప్పటి వరకూ ఒక్కసారి మాత్రమే తెలుగుదేశం ఇక్కడ గెలిచింది. నియోజకవర్గం ఏర్పడిన మొదట్లో కమ్యూనిస్టు అభ్యర్ధి వై.ఈశ్వరరెడ్డి నాలుగు సార్లు గెలవగా.. ఆ తర్వాత కాంగ్రెస్ అభ్యర్ధులు వీ.రామిరెడ్డి, కందుల ఓబుల్ రెడ్డి మూడేసి సార్లు గెలిచారు. ఆ తర్వాత 1984లో తొలిసారి టీడీపీ అభ్యర్ధిగా డీఎన్ రెడ్డి గెలిచారు. తర్వాత నుండి వైఎస్ రాజశేఖరరెడ్డి నాలుగుసార్లు, ఆయన సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి రెండుసార్లు, ఆ తర్వాత రెండుసార్లు జగన్మోహన్ రెడ్డి గెలిచారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత కూడా జగన్ ఒకసారి, గడిచిన రెండు ఎన్నికల్లో వైఎస్ అవినాష్ రెడ్డే గెలిచారు. దాంతో కడప లోక్ సభ అంటే వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటగా మారిపోయింది. అయితే, ఇప్పుడు ఎలాగైనా ఈ కంచుకోటను బద్దలు కొట్టి మరోసారి టీడీపీ జెండా ఎగరేయాలని టీడీపీ పట్టుదలగా ఉంది. ఈ సారి వైఎస్ ఫ్యామిలీకి కడపలో భంగపాటు ఎదురయ్యే అవకాశలు అవకాశాలు ఉన్నాయనే పరిశీలకులు కూడా విశ్లేషిస్తున్నారు.

ఇక్కడ ప్రస్తుతం ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. సీఎం చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి  కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సీబీఐ కూడా అవినాష్ ను నిందితుడిగా చెబుతోంది. అయితే, ఈ కేసులో ఇంకా న్యాయ విచారణ పూర్తి కాలేదు. తీర్పు రాలేదు. కానీ  స్థానికంగా మాత్రం ఈ హత్య ఎవరు చేశారు? ఎలా చేశారు? ఇప్పుడు అవినాష్ ను ఎవరు కాపాడుతున్నారు అన్న విషయంలో  అందరికీ స్పష్టత ఉంది. ఇక్కడ బహిరంగంగానే రచ్చబండలపై కూడా ప్రజలు దోషులు ఎవరో తేల్చి చెప్పేస్తున్నారు. వివేకా కుమార్తె సునీత, జగన్ సోదరి షర్మిల కూడా ఇది తమ వారు  చేసిన హత్య అని ఓపెన్ గానే చెప్పేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇక్కడ ప్రజలలో అవినాష్ పై తీవ్ర వ్యతిరేకత ఉందని పరిశీలకులు అంటున్నారు. 

మరోవైపు సీఎం సొంత నియోజకవర్గమైనా ఇక్కడ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. కనీసం సాగు, తాగు నీటి కష్టాలు కూడా తీరలేదు. దీనిపై ప్రజలలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. పైగా జిల్లా వైసీపీలో కుమ్ములాటలు పెరిగిపోయి ఎవరికి వారే కుట్రలు పన్నుతున్నారు. ఇవన్నీ కడప పార్లమెంటు నియోజకవర్గంలో తెలుగుదేశంకు  కలిసొచ్చే అంశాలే. ఈ అంశాలపైనే ఫోకస్ పెట్టేలా టీడీపీ కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నది. స్థానిక తెలుగుదేశం నేతలు కూడా చాప కింద నీరులా అధిష్టానం ప్రణాళికలు అమలు చేస్తూ వెళ్తున్నారు. ఇప్పటికే ఇక్కడ జరిగిన నారా లోకేష్ యువగళం పాదయాత్ర, చంద్రబాబు ప్రాజెక్టుల పరిశీలనకు విశేష ఆదరణ లభించింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఈ రెండు కార్యక్రమాలూ ఇక్కడ ఊహించిన దానికంటే ఎక్కువే సక్సెస్ అయ్యాయి.

ఇదే ఊపులో  తెలుగుదేశం కడప అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలపై గురిపెట్టింది. ఇక్కడ ప్రస్తుతం కడప పార్లమెంటు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాసులరెడ్డినే కడప పార్లమెంట్ స్థానం నుండి పోటీచేయించాలని భావిస్తుండగా.. ఆయన భార్య మాధవీరెడ్డిని జగన్ పై కడప అసెంబ్లీకి పోటీచేయించే అవకాశాలున్నాయని తెలుగుదేశం శ్రేణులు చెబుతున్నాయి. కడప అసెంబ్లీలో జగన్ ను ఓడించినా, లేక మెజారిటీ భారీగా దక్కకుండా అడ్డుకున్నా కడప పార్లమెంటును దక్కించుకోవడం సులభమవుతుంది. ఈ పార్లమెంట్ స్థానాన్ని ప్రభావితం చేయగలిగితే దీని పరిధిలోని మిగతా అసెంబ్లీ స్థానాలు కూడా ప్రభావితమవుతాయి. ఫలితంగా మొత్తం జిల్లాలో ఈ ప్రభావం కనిపిస్తుంది. అందుకే ఇప్పుడు తెలుగుదేశం కడప పార్లెమెంటు స్థానం టార్గెట్ గా సీఎం సొంత జిల్లాలో  విజయానికి బాటలు వేస్తూ ముందుకు సాగుతోంది.