షర్మిల ఎంట్రీతో ఏపీలో కాంగ్రెస్ కు ఊపు! | josh in ap congress| sharmila| entry| state| bifurgation| promises| full
posted on Dec 13, 2023 1:36PM
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ గాలి వీచింది. దీంతో తెలంగాణలో పోలిటికల్ ఈక్వేషన్స్ ఆటోమెటిక్‌గా మారిపోయాయి. ఆ క్రమంలో ఇటీవల తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో హస్తం పార్టీ స్పష్టమైన ఆధిక్యతను కనబరిచింది. అయితే ఆ పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో సైతం అధికారాన్ని హస్తగతం చేసుకొనేందుకు కాంగ్రెస్ అధిష్టానం పావులు కదుపుతోందా? అందుకోసం సదరు పార్టీ అధిష్టానం వ్యూహాత్మకంగా అడుగులు వేసేందుకు.. ప్రణాళికలు సిద్దం చేసుకొంటున్నదా?, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటు చేసుకొంటున్న వరుస పరిణామాలను ఆ పార్టీ అధిష్టానం నిశితంగా గమనిస్తోందా? అంటే రాజకీయ విశ్లేషకులు ఔననే చెబుతున్నారు.
దక్షిణాదిలో ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని కొల్లగొట్టిన హస్తం పార్టీ.. ముచ్చటగా మూడో రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్‌లో సైతం అధికారాన్ని హస్తగతం చేసుకుని అటు బీజేపీకి.. ఇటు ఏపీలో అధికారంలో ఉన్న జగన్ పార్టీకీ గట్టి ఝలక్ ఇచ్చేందుకు కార్యచరణను సిద్దం చేస్తోందని చెబుతున్నారు. అందుకే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత సోదరి షర్మిలను.. రంగంలోకి దింపాలని హస్తం పార్టీ అధిష్టానం ఆలోచన చేస్తున్నదపి అంటున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పగ్గాలు షర్మిలకు అప్పగిస్తే.. పార్టీకి పూర్వ వైభవం వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని కాంగ్రెస్ హైకమాండ్ గట్టిగా భావిస్తోందంటున్నారు. అదీకాక రాష్ట్రంలో అధికార వైసీపీకి చెందిన ప్రజా ప్రతినిధుల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్న సంగతి అందరికీ తెలిసిందేనని… అందుకు తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆ పార్టీ సభ్యత్వంతోపాటు ఎమ్మెల్యే పదవికీ సైతం రాజీనామా చేయడమే ఉదాహరణ అంటున్నారు. ఇక ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే జగన్ పై తీవ్ర అసంతృప్తితో కుతకుతలాడిపోతున్నారన్న సంగతి తెలిసిందే. అలా జగన్ పై అసంతృప్తి, ఆగ్రహంతో రగిలిపోతున్న వారు అనంతపురం జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు ఉన్నారనీ, వారంతా సమయం, సందర్భం కోసం వేచి చూస్తున్నారని… అలాంటి వేళ.. అసమ్మతి వాదులను అనునయించి, బుజ్జగించి, పార్టీలోకి తీసుకు రావడం.. అలాగే కర్ణాటక, తెలంగాణలలో ఎన్నికల వేళ ప్రకటించిన తాయిలాలతోపాటు విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇస్తామని…. అదీ కూడా అయిదు, పది కాదు.. ఏకంగా 20 ఏళ్లు ఇస్తామని ప్రకటిస్తే.. హస్తం పార్టీ చేతికి పక్కాగా అధికార అందలం దక్కుతుందని కాంగ్రెస్ భావిస్తోంది.
మరోవైపు దివంగత ముఖ్యమంత్రి, వైయస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డగా ఆయన కుమారుడిగా ప్రచారం చేసుకొని.. గత ఎన్నికల్లో గద్దెనెక్కిన వైయస్ జగన్ పాలన అన్ని రంగాల్లో విఫలమైందని.. ఈ నేపథ్యంలో ఆయనపై ఏపీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని.. అలాగే రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు కావస్తున్నా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం… ఆంధ్రప్రదేశ్ విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తుందో ఇప్పటికే అందరికి పక్కా క్లారిటీగా అర్థమైందని.. అలాంటి సమయంలో.. కొద్దిగా ఒప్పిక.. మరికొ ద్దిగా సమయస్పూర్తితో వ్యవహరిస్తే రాష్ట్రంలో హస్తం పార్టీకి పూర్వ వైభవం దక్కుతుందంటున్నారు.
అదీకాక.. రాజశేఖరరెడ్డిలో ఉన్న నాయకత్వ లక్షణాలన్నీ వైయస్ షర్మిల పుణికి పుచ్చుకున్నారని… అందుకు ఆమె తెలంగాణలో చేసిన రాజకీయమే నిదర్శనమని.. ఇంకా సోదాహరణగా వివరించాలంటే.. తెలంగాణలో రాజకీయంగా వైయస్ షర్మిల.. సక్సెస్ కాకపోవచ్చు.. కానీ నిరుద్యోగులు, రైతుల కోసం ఆందోళనలు, పాదయాత్ర, ఇక కేసీఆర్ క్యాంప్ కార్యాలయానికి… ఆమె నేరుగా కారు నడుపు కొంటూ వెళ్లే ప్రయత్నం చేయడం.. ఆ క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలు.. అలాగే ఆ సందర్భంగా షర్మిలకు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పోన్ చేసి.. ఆరా తీయడం.. వగైరా వగైరా.. వైయస్ షర్మిలలో దాగి ఉన్న పోరాట పటిమను బహిర్గతం చేశాయని.. అలాగే గతంలో.. జగనన్న వదిలిన బాణమంటూ ఇదే వైయస్ షర్మిల పాదయాత్ర సైతం చేసి.. ప్రజల్లోకి చొచ్చుకొని వెళ్లిందని.. అలాంటి చురుకైన వాళ్లే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయల్లో చక్రం తిప్పుతారనే ఓ అభిప్రాయం సైతం హస్తం పార్టీ అధిష్టానం నుంచి వ్యక్తమవుతున్నదని అంటున్నారు.
అదీకాక తెలంగాణలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండనే ఉన్నారు.. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొని ఉన్న విభజన సమస్యలు ఒక కొలిక్కి తీసుకు వస్తామంటూ ప్రజల్లో ఒక చిన్నపాటి భరోసా కల్పిస్తే.. జనం నమ్మి ఆదరిస్తారనీ పార్టీ హై కమాండ్ నమ్ముతోంది.
హస్తం పార్టీ అధికారంలోకి వస్తే… రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని.. ఈ ప్రత్యేక హోదా ద్వారా రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు హోరెత్తుతాయని.. దీంతో రాష్ట్రంలోని యువత.. ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లనవసరం లేదని.. అలాగే ఇతర రాష్ట్రాల ప్రజలు, పరిశ్రమలు సైతం ఆంధ్రప్రదేశ్ వైపు దృష్టి సారిస్తాయని ఓ చిక్కనైన భరోసా ప్రజల్లో కల్పిస్తే మాత్రం.. పక్కాగా వచ్చే ఎన్నికల్లో హస్తం పార్టీ హల్‌చల్ చేయడం ఖాయమని వారు అభిప్రాయపడుతున్నారు.
అంతే కాదు షర్మిల వల్ల.. కేంద్రంలోని కమలనాధులకే కాదు.. రాష్ట్రంలోని ఫ్యాన్ పార్టీ నేతలకు సైతం దెబ్బ తప్పదని.. అది ఎలాగంటే.. ఒక దెబ్బకు రెండు పిట్టలు చందంగా ఆ రెండు పార్టీలు.. ఆంధ్రప్రదేశ్‌లో నేలరాలుతాయని.. తద్వారా.. షర్మిల కన్న కలలు సాకరమవుతాయని.. రాజకీయ విశ్లేషకులు గట్టిగా చెబుతున్నారు.