Leading News Portal in Telugu

Holding Sneeze: తుమ్మును ఆపుకోవాలని చూస్తే ప్రమాదమే.. ఏకంగా శ్వాసనాళం పగిలిపోయింది..


Holding Sneeze: తుమ్మును ఆపుకోవాలని చూస్తే ప్రమాదమే.. ఏకంగా శ్వాసనాళం పగిలిపోయింది..

Holding Sneeze: తుమ్ములు వస్తే ఆగవు, అయితే కొన్ని సందర్భాల్లో ముక్కు నలవడం ద్వారా ఆపుకునేందుకు ప్రయత్నిస్తారు. అయితే ఓ కేసులో మాత్రం తుమ్ముని ఆపుకోవడం ఏకంగా ప్రాణాలనే ప్రమాదంలోకి నెట్టింది. తుమ్మును అదిమిపెట్టడంతో ఒక్కసారిగా అతని శ్వాసనాళంపై ఒత్తడి పెరిగి పగిలిపోయింది. అత్యంత అరుదుగా మాత్రమే ఇలా జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.

ప్రపంచంలోనే ఇలాంటి కేసు ఇదే మొదటిసారని నిపుణులు చెబుతున్నారు. లైవ్ సైన్స్‌లో ఒక నివేదిక ఈ కేసును ప్రస్తావించింది. వివరాల్లోకి వెళితే సదరు వ్యక్తి కారు నడుపుతున్న సమయంలో తుమ్ము రావడంతో దానిని ఆపుకునేందుకు ప్రయత్నించారు. మామూలుగా తుమ్ములు వచ్చిన సమయంలో ముక్కు నలవడం చేయడం ద్వారా అడ్డుకుంటాము. అయితే ఈ ఘటనలో మాత్రం ముక్కును, నోటిని పూర్తిగా మూసేశాడు. దీంతో అతనికి ఇదే ప్రాణాంతకంగా మారింది. తుమ్మును ఆపుకోవడంతో ఒక్కసారిగా దాని శక్తి అతని శ్వాసనాళంపై పడింది. దీంతో 2 మిల్లీ మీటర్ల మేర శ్వాసనాళం పగిలిపోయి రంధ్రం పడింది. వాయునాళం మూసేయడం ద్వారా ఒత్తిడి పెరిగి, సాధారణంగా 20 రెట్ల కంటే ఎక్కువ బలంగా ఉండే తమ్మును ప్రేరేపించింది. దీని వల్ల భయంకరమైన నష్టం జరిగింది. దీంతో 0.08 ఇంచుల మేర వాయునాళం చింపేయబడింది.

దీంతో భరించలేని నొప్పి, మెడ రెండు వైపుల వాచి ఉండటంతో డాక్టర్‌ని సంప్రదించాడు. వైద్యుడు పరిశీలించగా.. చిన్నపాటి చప్పుడు వినిపించింది. అయితే ఆహారం తీసుకోవడం, మాట్లాడటానికి ఎలాంటి ఇబ్బంది ఎదుర్కోలేదు. వ్యక్తికి సర్జికల్ ఎంఫిసెమా ఉందని ఎక్స్-రే రిపోర్ట్ ద్వారా వెల్లడైంది. ఈ వ్యాధిలో చర్మం లోతైన కణజాల పొరల్లో గాలి చిక్కుకుపోతుంది. సీటీ స్కాన్ తర్వాత అతని మెడలో మూడు, నాలుగో వెన్నుపూసల మధ్య చీలిక ఉన్నట్లు తేలింది. ముక్కు, నోరు మూసుకుని తుమ్మును ఆపుకునేందుకు ప్రయత్నించడంతో శ్వాసనాళంలో ఒత్తిడి పెరిగి ఈ నష్ట జరిగినట్లు వైద్యులు నిర్థారించారు.

ప్రస్తుతం సదరు వ్యక్తికి శస్త్రచికిత్స అవసరం లేదని వైద్యులు తెలిపారు. అయినా కూడా అన్ని శరీర ప్రక్రియలు సరిగా ఉన్నాయనే విషయాన్ని నిర్థారించుకునేందుకు రెండు రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉంచి పరీక్షించారు. డిశ్చార్జ్ సమయంలో వైద్యులు నొప్పి, హే ఫివర్ మందులు ఇచ్చారు. రెండు రోజుల పాటు శారీరక శ్రమకు దూరంగా ఉండాలని సూచించారు. ఐదు వారాల తర్వాత సీటీ స్కాన్ చేయగా.. చిరిగిన భాగం పూర్తిగా నయమైనట్లు తేలింది. నోరు, ముక్కు మూసుకుని తుమ్మును ఆపొద్దని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. శ్వాస నాళం దెబ్బతినడం చాలా అరుదు, కానీ పూర్తిగా అసాధ్యం మాత్రం కాదని వైద్యులు తెలిపారు.