Leading News Portal in Telugu

Mohammed Shami: నమాజ్ చేయాలనుకుంటే నన్ను ఎవడు ఆపుతాడు.. మహమ్మద్ షమీ ఫైర్!


Mohammed Shami: నమాజ్ చేయాలనుకుంటే నన్ను ఎవడు ఆపుతాడు.. మహమ్మద్ షమీ ఫైర్!

Mohammed Shami React on Trolls over Namaz in World Cup 2023: మైదానంలో నమాజ్ చేశానని తనపై వస్తున్న విమర్శలపై టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను నమాజ్ చేయాలనుకుంటే.. అడ్డుకునేవాడు ఎవడు? అని ప్రశ్నించాడు. తాను గర్వించదగిన భారతీయుడిని, గర్వించదగిన ముస్లింనని షమీ పేర్కొన్నాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా శ్రీలంకతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఐదు వికెట్స్ తీసిన అనంతరం షమీ మోకాళ్లపై కూర్చొని.. రెండు చేతులతో నేలను టచ్ చేశాడు. ఈ సంబరాలను కొంతమంది అభిమానులు, నెటిజన్స్ తప్పుబట్టారు. మైదానంలో షమీ నమాజ్ చేశాడని విమర్శలు గుప్పించారు. ఈ విషయంపై షమీ ఘాటుగా స్పందించాడు.

బుధవారం ఆజ్ తక్‌తో మహమ్మద్ షమీ మాట్లాడుతూ… ‘నేను నమాజ్ చేయాలనుకుంటే.. నన్ను ఎవరు ఆపుతారు?. నేను ఎవరినీ ప్రేయర్ చేయకుండా ఆపను. నేను నమాజ్ చేయాలనుకుంటే చేస్తా. ఇందులో సమస్య ఏముంది. నేను ముస్లింనని గర్వంగా చెబుతాను. నేను భారతీయుడిని అని గర్వంగా చెబుతా. అందులో ఏముంది ప్రాబ్లమ్?. నమాజ్ చేయడానికి ఎవరి వద్దైనా పర్మిషన్ అడగాలంటే.. నేను ఈ దేశంలో ఎందుకు ఉండాలి?. ఇంతకుముందు 5 వికెట్లు తీసిన తర్వాత నేను ఎప్పుడైనా నమాజ్ చేశానా?. నేను చాలాసార్లు ఐదు వికెట్లు తీశాను. నేడు ఎక్కడ నమాజ్ చేయాలో చెప్పండి, అక్కడికి వెళ్లి చేస్తా’ అని ఘాటుగా స్పందించాడు.

‘ఇలాంటి విమర్శలు చేసే వ్యక్తులు ఎవరివైపు ఉండరు. కేవలం వివాదాలు సృష్టించాలనుకుంటారు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో నేను 200 శాతం ఎఫర్ట్ పెట్టి బౌలింగ్ చేశా. మూడు వికెట్లు తీసిన తర్వాత ఐదు వికెట్స్ తీయాలనే ఆలోచన వచ్చింది. అయితే చాలా సమయం వరకు వికెట్ దక్కలేదు. బంతులు బ్యాటర్స్ ఎడ్జ్ తీసుకున్నాయి. వికెట్ పడకపోవడంతో విసిగిపోయాను. చివరికి ఐదో వికెట్ పడగానే మోకాళ్లపై కూర్చునా. దీనిని ప్రజలు వేరేగా అర్ధం చేసుకున్నారు. పనిపాట లేని వారే తప్పుడు ఉద్దేశాలతో ఇలా చేశారు’ అని మహమ్మద్ షమీ వివరించాడు. ప్రపంచకప్‌ 2023లో షమీ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. కేవలం 7 మ్యాచ్‌ల్లో 24 వికెట్లు పడగొట్టాడు. ఇందులో మూడు సార్లు ఐదు వికెట్ల ఘనత ఉంది.