Leading News Portal in Telugu

జగన్ లో ఓటమి భయం.. సిట్టింగులను మార్చేస్తే పోతుందా?! | defeat fear in jagan| change| sitting| mlas| over| come| dont


posted on Dec 14, 2023 8:12AM

ఏపీలో అధికార పార్టీ ఇప్పుడు ఓటమి భయంతో వణికిపోతోంది. అంతో ఇంతో అభివృద్ధి, సంక్షేమం అమలు చేసిన మరో తెలుగు రాష్ట్రం తెలంగాణలో ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సాగనంపి ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వగా.. అసలు అభివృద్ధి అన్నది బూతద్దం పెట్టి వెతికినా కనిపించని ఏపీలో జగన్ ప్రభుత్వానికి ఓటమి తప్ప మరో మార్గమే లేదని  రాజకీయ పరిశీలకులు ఎప్పుడో తేల్చేశారు. వ్యూహకర్తలుగా ఉన్న ఐ ప్యాక్ లాంటి సంస్థ కూడా జరగాల్సిన నష్టం జరిగిపోయిందనీ, ఇక ఇప్పుడు ఏం చేసినా ఫలితం లేదనీ తేల్చేసినట్లు కూడా రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతున్నది. దీంతో ఇప్పుడు వైసీపీ పెద్దలకు ఏం చేయాలో తోచని పరిస్థితి. అయితే కనీసం డిపాజిట్లు అయినా దక్కించుకోవాలనే ఉద్దేశమో లేక దింపుడు కళ్ళం ఆశల భ్రమలో కానీ.. రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే రానున్న ఎన్నికల కోసం సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చేసే పని మొదలు పెట్టింది. ఇప్పటికే 11 నియోజకవర్గాలలో ఈ జంబ్లింగ్ ఆట మొదలు పెట్టిన వైసీపీ.. మొత్తంగా 90కి పైగా స్థానాలలో ఈ స్దాన భ్రంశం స్కీమ్ అమలు చేయనున్నట్లు తెలుస్తున్నది.

ఉరుములు లేకుండానే  పిడుగులు పడ్డట్లు ఉన్నపళంగా తాజాగా వైసీపీ 11మంది అసెంబ్లీ అభ్యర్థులను మార్చి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి ఇష్టుడైన నాయకుడిని కూడా జగన్ నిర్ధాక్షణ్యంగా వదులుకున్నారు. ఇప్పటికే వచ్చే ఎన్నికలే టార్గెట్ గా తమ తమ నియోజకవర్గాలలో పని మొదలు పెట్టిన నేతలను కూడా మార్చేశారు. అయితే ఇది శాంపిల్ మాత్రమేననీ,  త్వరలోనే ఇది పూర్తిస్థాయి కార్యాచరణ కాబోతున్నట్లు పార్టీ వర్గాలలో చర్చ జరుగుతోంది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 90కి పైగా సీట్లలో సిట్టింగులను మార్చనున్నట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఈ 90 మందిలో మాజీ మంత్రులు, మంత్రులు, మహా మహా సీనియర్ నేతలు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ఎక్కడికక్కడ అసంతృప్తి ఎక్కువగా ఉన్న స్థానాలలో ప్రజలకు ఫ్రెష్ పేస్ కనిపించేలా ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెబుతున్నారు. శ్రీకాకుళం నుండి అనంతపురం జిల్లా వరకూ.. చిత్తూరు నుండి కృష్ణ జిల్లా వరకూ ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థుల మార్పుపై కసరత్తులు జరుగుతున్నట్లు తెలుస్తున్నది.

కాగా, జిల్లాల వారీగా వైసీపీలో మారనున్న స్థానాలివేనంటూ ఓ జాబితా  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ జాబితా ప్రకారం చూస్తే.. ఏలూరు జిల్లా పరిధిలో చింతలపూడి, పోలవరం, ఉంగటూరు.. మచిలీపట్నం జిల్లాలో అవనిగడ్డ, పెడన.. ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ, తిరువూరు, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, జగ్గయ్యపేటలో అభ్యర్థుల మార్పు ఉంటుందని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.   గుంటూరు జిల్లాలో తాడికొండ, ప్రత్తిపాడు, పొన్నూరు, గుంటూరు వెస్ట్, మంగళగిరి, గుంటూరు ఈస్ట్.. పల్నాడు జిల్లాలో సత్తెనపల్లి, చిలకలూరిపేట.. బాపట్ల జిల్లాలో రేపల్లె, వేమూరు, సంతనూతలపాడు, అద్దంకి, పర్చూరు స్థానాలలో మార్పు తప్పదని చెప్తున్నారు. అలాగే కాకినాడ జిల్లాలో ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం, అమలాపురం జిల్లాలో అమలాపురం, రాజోలు, రామచంద్రపురం, పి.గన్నవరం, రాజమండ్రి సిటీ, నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో తాడేపల్లిగూడెం, ఉండి స్థానాల అభ్యర్థులను మార్చనున్నారని తెలుస్తోంది. 

 ప్రకాశం జిల్లాకు వస్తే దర్శి, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కొండేపి, మార్కాపురం.. నెల్లూరు జిల్లాలో నెల్లూరు సిటీ, కావలి, కందుకూరు సీట్లలో మార్పులు ఖాయమని తేలుతోంది. ఆ తర్వాత తిరుపతి జిల్లాలో గూడూరు, సూళ్లూరుపేట, సత్యవేడు.. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు, పూతలపట్టు, చిత్తూరు.. రాజంపేట జిల్లాలో మదనపల్లె, తంబళ్లపల్లె, రాజంపేట.. కడప జిల్లాలో జమ్మలమడుగు, కమలాపురం.. కర్నూలు జిల్లాలో కోడుమూరు, కర్నూలు, ఎమ్మిగనూరు, పత్తికొండ.. నంద్యాల జిల్లాలో నందికొట్కూరు.. సత్యసాయి జిల్లాలో హిందూపురం, పుట్టపర్తి, పెనుకొండ, మడకశిర, కదిరి.. అనంతపురం జిల్లా సింగనమల, గుంతకల్లు, కళ్యాణదుర్గం, రాయదుర్గం అసెంబ్లీ స్థానాల్లో  అభ్యర్థుల మార్పు ఖాయమని చెబుతున్నారు.  ఇక ఉత్తరాంధ్రకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లాలో ఆమదాలవలస, పాతపట్నం, టెక్కలి, ఇచ్చాపురం, ఎచ్చెర్ల.. విజయనగరంలో రాజాం, బొబ్బిలి.. విశాఖ జిల్లాలో గాజువాక, విశాఖ సౌత్.. అనకాపల్లి జిల్లాలో పెందుర్తి, పాయకరావుపేట, చోడవరం, అనకాపల్లి, అరకు జిల్లాలో అరకు, పాడేరులో అభ్యర్థులను మార్చనున్నట్లు తెలుస్తుంది. ఇవి కాకుండా మరో పాతికకు పైగా స్థానాల మార్పుపై కసరత్తులు జరుగుతున్నాయట. చిత్తూరు జిల్లా నగరిలో రోజాకు కూడా పార్టీ టికెట్ ఇచ్చే అవకాశాలు లేవనీ, ఆమెకు పార్టీలో ఏదో ఒక గౌరవ ప్రదమైన హోదా కల్పించేందుకు ఆమెకు హామీ ఇచ్చినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద జగన్ ఓటమి భయం నుంచి బయటపడేందుకు సిట్టింగుల మార్పుతో  నేలవిడిచి సాము చేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.