Leading News Portal in Telugu

Mohammed Shami: నా కంటే ఏ క్రికెటర్ ఎక్కువ బరువు ఎత్తలేడు.. కానీ చెప్పుకోను: మహమ్మద్ షమీ


Mohammed Shami: నా కంటే ఏ క్రికెటర్ ఎక్కువ బరువు ఎత్తలేడు.. కానీ చెప్పుకోను: మహమ్మద్ షమీ

Mohammed Shami Said Iam Strongest Cricketer In The World: జిమ్‌లో తన కంటే ఎక్కువ బరువును ఏ క్రికెటర్ ఎత్తలేడని టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ తెలిపాడు. ప్రపంచ క్రికెట్‌లో అత్యంత బలమైన ఆటగాడని తానే అని పేర్కొన్నాడు. లెగ్ ప్రెస్ ఎక్సర్‌సైజ్‌లో 750 కిలోల వరకు బరువు ఎత్తగలనని షమీ చెప్పాడు. దీని గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తనకు ఇష్టం లేదని, అందుకే ప్రజలకు ఈ విషయం తెలియదని షమీ చెప్పుకొచ్చాడు. లెగ్ ప్రెస్ ఎక్సర్‌సైజ్‌లో బాడీబిల్డర్ పాల్ మీకర్‌ 1,367 కిలోల బరువును ఎత్తాడు. ఇప్పటివరకు ఇదే ప్రపంచ రికార్డు.

వన్డే ప్రపంచకప్ 2023 అనంతరం మహమ్మద్ షమీ విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌లకు దూరంగా ఉన్నాడు. మరికొన్ని రోజుల్లో దక్షిణాఫ్రికాతో జరగనున్న టెస్టు సిరీస్ కోసం సఫారీ గడ్డకు షమీ బయలుదేరనున్నాడు. ప్రపంచకప్ 2023లో 7 మ్యాచ్‌ల్లోనే 24 వికెట్లు తీసి అత్యధిక వికెట్ల తీసిన బౌలర్‌గా నిలిచిన షమీ.. తాజాగా ఓ ఇంటర్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పలు విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.

ఆధునిక క్రికెట్‌లో క్రికెటర్‌లకు ఫిట్‌నెస్ తప్పనిసరి అయింది. ప్రతిఒక్కరు ఫిట్‌గా ఉండటానికి ఎంతో శ్రమిస్తున్నారు. మహమ్మద్ షమీ ఫిట్‌గా ఉండటానికి జిమ్‌లో ఎంత కష్టపడుతున్నాడో వెల్లడించాడు. ‘జిమ్‌లో నా కంటే ఎక్కువ బరువును మరే క్రికెటర్ ఎత్తడు. నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి ఇష్టపడను కాబట్టి ప్రజలకు ఈ విషయం తెలియదు. నేను 750 కిలోల లెగ్ ప్రెస్ చేయగలను’ అని ఆజ్ తక్‌తో షమీ చెప్పాడు. గతంలో షమీ చిన్ననాటి కోచ్ బద్రుద్దీన్ సిద్ధిఖీ.. టీమిండియా పేసర్ ఫిట్‌నెస్ ప్రయాణం గురించి మాట్లాడాడు. ఫిట్‌నెస్‌ను మెరుగుపరచుకోవడానికి షమీ తన ఫామ్‌హౌస్‌లో ఎంత కష్టపడతాడు అని వెల్లడించాడు.