Leading News Portal in Telugu

Nadendla Manohar: ఏపీ ప్రభుత్వ నిర్ణయాలతో.. 85,350 మంది విద్యార్థుల భవిష్యత్‌ నాశనం..!


Nadendla Manohar: ఏపీ ప్రభుత్వ నిర్ణయాలతో.. 85,350 మంది విద్యార్థుల భవిష్యత్‌ నాశనం..!

Nadendla Manohar: ప్రభుత్వ నిర్ణయాల వల్ల 85,350 మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతోందంటూ ఫైర్‌ అయ్యారు జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌.. సీబీఎస్ఈ విద్యార్థుల భవితవ్యంపై నాదెండ్ల సీరియస్ కామెంట్లు చేశారు.. ప్రభుత్వ తప్పిదాల వల్ల 85 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాయలేకపోతున్నారని మండిపడ్డారు.. సీబీఎస్ఈ స్కూళ్లల్లో చదువుతున్న విద్యార్థుల పరీక్షల నిమిత్తం ప్రభుత్వం కట్టాల్సిన ఎగ్జామినేషన్ ఫీజు ఇప్పటి వరకు కట్టలేదన్న ఆయన.. ఈ మొత్తం సుమారుగా రూ. 2 కోట్లకు పైగా ఉంటుంది. ఈ 85 వేల మంది విద్యార్ధులు పరీక్షలు రాయలేకపోతే.. వారి పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. విద్యార్థులను గ్లోబల్ సిటిజన్స్‌గా మారుస్తున్నామంటూ వారిని జీవితాలను నిర్వీర్యం చేస్తోందన్నారు. అయితే, ఈ పాపంలో మంత్రి బొత్స సత్యనారాయణ తప్పేం లేదు.. కానీ, జగన్ మామ చేసిన పాపం విద్యార్థులకు శాపంగా మారిందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని 44,639 పాఠశాలల్ని 2024 నాటికి సీబీఎస్ఈ కిందకు తెస్తామని జగన్ సర్కార్ చెప్పింది.. కానీ, కేవలం 1000 స్కూళ్లకే సీబీఎస్ఈ అఫిలియేషన్ తీసుకురాగలిగారని.. ఆ వేయి పాఠశాలల్లో కూడా విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల్లేవు అని దుయ్యబట్టారు నాదెండ్ల.. పరీక్షలు నిర్వహించడానికి వీల్లేని పరిస్థితుల్లో వేయి సీబీఎస్ఈ పాఠశాలలు ఉన్నాయి. వేయి పాఠశాలల్లో సైన్స్ లాబరేటరీలు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. కేవలం 700కు పైగా పాఠశాలల్లో మాత్రమే ఏర్పాటు చేశారు. అలాగే, లైబ్రరీలు, కంప్యూటర్ ల్యాబ్‌లు కూడా ఏర్పాటు చేయలేదు. 40 వేలకు పైగా కంప్యూటర్లు కొనుగోలు చేయాల్సి ఉండగా.. కేవలం 12 వేల కంప్యూటర్లు మాత్రమే ఏర్పాటు చేశారు. ఈ వసతులు లేనిదే సీబీఎస్ఈ పరీక్షలు రాయడం కుదరదు. ఈ విద్యార్థులు సీబీఎస్ఈ పరీక్షలు రాయాలా..? స్టేట్ సిలబస్ పరీక్షలు రాయాలా..? బిడ్డల భవిష్యత్తును ఇంత దారుణంగా నాశనం చేస్తారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

బిడ్డల భవిష్యత్తును నాశనం చేస్తున్నందుకు జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు నాదెండ్ల మనోహర్‌.. సీబీఎస్ఈనే అమలు చేయలేని వారు.. ఐబీ సిలబస్ ఎలా అమలు చేస్తారు..? మరో రెండు నెలల్లో పరీక్షలు రాయాల్సి ఉండగా 85 వేల విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటారా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మార్చి నెలలో జరిగే పరీక్షల్లో వీరికి ఇబ్బంది లేకుండా చేయాలని మేం డిమాండ్ చేస్తున్నాం. మేం అన్ని ఆధారాలతోనే వరుస ప్రెస్ కాన్ఫరెన్స్‌లు పెడుతున్నాం అన్నారు. మేం మీడియాతో మాట్లాడితే ఏదో విమర్శించేసి వెళ్లిపోవడం సరైన విధానం కాదు. నియోజన్ సంస్థ కోర్టుకెళ్తే.. ప్రభుత్వం అర్బిట్రేషన్ చేయాల్సిన అవసరమేంటి..? నియోజన్ సంస్థ ఇచ్చిన డీపీఆర్ ఏంటో మంత్రి అమర్నాథ్‌ విడుదల చేయగలరా? అని నిలదీశారు జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌..