Leading News Portal in Telugu

Gidugu Rudraraju: వైసీపీ ఎమ్మెల్యేలు, మాజీలు మాతో టచ్‌లో ఉన్నారు..!


Gidugu Rudraraju: వైసీపీ ఎమ్మెల్యేలు, మాజీలు మాతో టచ్‌లో ఉన్నారు..!

Gidugu Rudraraju: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేలు, మాజీలు మాతో టచ్ లో ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు.. విజయవాడలో జరుగుతోన్న కాంగ్రెస్‌ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. ఏపీలో పొలిటికల్ వేక్యూమ్ ఉందన్నారు. 2014 నుంచి రెండు ప్రభుత్వాలు ఏపీ హక్కులు, విభజన హామీల కోసం పని చేయలేదన్న ఆయన.. ప్రాంతీయ పార్టీలు పూర్తిగా ఫెయిల్ అయ్యాయి… ఏపీలో కాంగ్రెస్ పార్టీకి కచ్చితంగా స్ధానం ఉందన్నారు. ఇప్పటికే, పలు రాష్ట్రాలలో కాంగ్రెస్ గెలవడంతో ఏపీ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు.. జిల్లాల వారీగా యాక్షన్ ప్లాన్‌లు సిద్ధం చేస్తున్నాం అన్నారు. ఈ నెల 21 మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ కాంగ్రెస్ వ్యవహారాలపై స్ట్రాటజీ సమావేశం ఢిల్లీలో జరుగుతుంది.. మేనిఫెస్టో, ఏపీసీసీ ఆశించే అంశాలు, ఏపీకి ఏం చేయాలనే అంశాలు స్ట్రాటజీ సమావేశంలో నిర్ణయిస్తారు.. మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో స్ట్రాటజీ సమావేశం జరుగుతుందని వెల్లడించారు.

ఇక, కాంగ్రెస్ పార్టీలో విద్యాభ్యాసం చేసిన మంత్రి ఒకరు కామెంట్ చేస్తున్నారు.. చంద్రబాబు, జగన్, ఇలా చాలా మందికి కాంగ్రెస్ మాతృ సంస్ధ అనే విషయాన్ని మర్చిపోవద్దు అన్నారు గిడుగు రుద్రరాజు.. ఒకచోట పనిచేయని వ్యక్తి రెండో చోట వైసీపీకి ఎలా పనికొస్తారు? అని ప్రశ్నించారు. వైసీపీ మార్చిన సీట్లన్నీ దళిత, బలహీన వర్గాల‌ సీట్లే అని దుయ్యబట్టారు. సీఎం జగన్‌ పనితనం మీద ప్రజలు జడ్జిమెంట్ ఇస్తారు.. కేసీఆర్‌ చేసింది చాలు అని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు.. ఏపీలో ఎమ్మెల్యేలను మార్చినంత మాత్రాన ఒరిగేది ఏమీ లేదన్నారు. ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ తెస్తున్నారు.. కొత్త సీసాలో పాత సారాయి లాగా అంటూ దుయ్యబట్టారు.

మరోవైపు, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకుంటుందన్నారు గిడుగు రుద్రరాజు. భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి పనిచేస్తామన్న ఆయన… సీపీఐ, సీపీఎం నేతలతో కలిసి మాట్లాడాం.. పేకమేడలా అధికారం కూలిపోతే.. కాంగ్రెస్ కు ఆటోమేటిగ్గా వచ్చి చేరతారని జోస్యం చెప్పారు. వైసీపీలో ఒక బలమైన నియోజకవర్గం నుంచి ఓ వ్యక్తి మాతో మాట్లాడారు.. వైఎస్ఆర్, కాంగ్రెస్.. రెండూ మా పేర్లే.. వైసీపీ ఒరిజినల్ కాదు.. డూప్లికేట్ కాంగ్రెస్ అని ప్రజలు గుర్తించారంటూ ఆసక్తికర వ్యాఖ్యలుచేశారు ఏపీ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు.