posted on Dec 14, 2023 11:32AM
విశాఖపట్నంలోని జగదాంబ జంక్షన్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. జంక్షన్ లోని ఇండస్ ఆసుపత్రిలో గురువారం ఉదయం మంటలు చెలరేగాయి. ఆసుపత్రి రెండో అంతస్తులో ఈ ప్రమాదం జరిగింది. పలువురు రోగులు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. వారిని కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఎమర్జెన్సీ మార్గం గుండా పలువురు రోగులను బయటకు తీసుకొచ్చారు.ప్రమాదం జరిగిన సమయంలో ఆస్పత్రిలో పెద్ద సంఖ్యలో రోగులు ఉన్నట్టు తెలుస్తోంది. ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్లో మొదట మంటలు చెలరేగాయి. క్షణాల్లో ఆస్పత్రి మొత్తం మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ఆస్పత్రి భవనంలో ఉన్న రోగులను ఇతర ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో మొత్తం 52మంది రోగులు ఉన్నట్లు గుర్తించారు.ఆపరేషన్ థియేటర్లలో ఉన్న నైట్రస్ ఆక్సైడ్ పేలుళ్లు జరగడంతో భవనం మొత్తం మంటలు వ్యాపించాయి. ఐసీయూలలో ఉన్న వారిని సురక్షితంగా బయటకు తరలించారు. ఫైర్, డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది వేగంగా స్పందించడంతో భవనంలో ఉన్న వారిని కాపాడారు. విశాఖ పోలీస్ కమిషనర్ రవి శంకర్ అయ్యన్నార్ స్వయంగా సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మూడో అంతస్తులో ఉన్నవారిని కూడా ఫైర్ సిబ్బంది తరలించారు. రెండో అంతస్తులో మంటలు అదుపు రాలేదని, మొదటి, మూడో అంతస్తులో ఉన్న రోగులను కాపాడినట్లు పోలీసులు తెలిపారు.