Womens Cricket: భారత్ లో ఇంగ్లండ్ మహిళల టీమ్ తో జరుగుతున్న ఏకైర టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా మహిళా బ్యాటర్లు రెచ్చిపోతున్నారు. తొలి రోజు టీమిండియా బ్యాటర్లు ప్రత్యర్థి బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చలాయించారు. తొలి రోజే ఆట ముగిసే సమయానికి భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 410 పరుగులు (94 ఓవర్లలో) చేసింది. అయితే, ఓపెనర్లు స్మృతి మంధన ( 17), షఫాలీ వర్మ ( 19) నిరాశ పర్చినప్పటికీ ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బ్యాటర్లందరూ తమ హవా చూపించారు. శుభ సతీశ్ (69), జెమీమా రోడ్రిగెజ్ (68), యస్తికా భాటియా (66), దీప్తి శర్మ (60 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రెచ్చిపోయి బ్యాటింగ్ చేశారు. ఇక, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (49), స్నేహ్ రాణా (30) సైతం పర్వాలేదనిపించారు.
ఇక, తొలి రోజు ఆట ముగిసే సమయానికి దీప్తి శర్మకు జోడిగా పూజా వస్త్రాకర్ (4) క్రీజ్‌లో కొనసాగుతుంది. ఇంగ్లండ్ బౌలర్లలో లారెన్ బెల్ రెండు వికెట్లు తీసుకోగా.. కేట్ క్రాస్, నాట్ సీవర్ బ్రంట్, చార్లెట్ డీన్, సోఫీ ఎక్లెస్టోన్ తలో వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ తీసుకుంది. ఈ టెస్ట్ మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్.. భారత్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడింది. అయితే, తొలి రెండు టీ20లు గెలిచిన ఇంగ్లీష్ జట్టు సిరీస్ కైవసం చేసుకుంది. నామమాత్రపు చివరి టీ20లో టీమిండియా విజయం సాధించింది. దీంతో ఈ ఏకైక టెస్ట్ మ్యాచ్ ను గెలవాలని టీమిండియా మహిళల జట్టు చూస్తుంది.