Leading News Portal in Telugu

Swiggy: దేశంలో ప్రతీ సెకన్‌కి 2.5 బిర్యానీ ఆర్డర్లు.. తగ్గేది లేదంటున్న హైదరాబాదీలు..


Swiggy: దేశంలో ప్రతీ సెకన్‌కి 2.5 బిర్యానీ ఆర్డర్లు.. తగ్గేది లేదంటున్న హైదరాబాదీలు..

Swiggy: బిర్యానీ అంటే ఒక్క హైదరాబాద్ లోనే కాదు దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉందని స్విగ్గీ తన వార్షిక అమ్మకాల నివేదికలో తెలిపింది. 2023లో దేశవ్యాప్తంగా ప్రతీ సెకనుకు 2.5 బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్లు తెలిపింది. ప్రతీ 5.5 చికెన్ బిర్యానీలకు ఒక వెజ్ బిర్యానీ ఉందని తెలిపింది. ఇక హైదరాబాదీలు బిర్యానీ ఆర్డర్లలో తగ్గేదే లేదంటున్నారు. భాగ్యనగరంతో పాటు చెన్నై, ఢిల్లీల్లో ఎక్కువగా చికెన్ బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్లు స్విగ్గీ తెలిపింది. ఈ మూడు నగరాల్లో 10,000 కంటే ఎక్కువ ఆర్డర్లు చేసిన వినియోగదారులు ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. మొత్తంగా 2023లో ఎక్కువగా వచ్చిన ఆర్డర్లలో బిర్యానీనే టాప్ ప్లేసులో ఉన్నట్లు చెప్పింది.

ప్రతీ 6 ఆర్డర్లలో ఒక ఆర్డర్ హైదరాబాద్ నుంచే వచ్చినట్లు తెలిపింది. హైదరాబాద్‌కి చెందిన ఓ వ్యక్తి ఏడాది పొడవున 1633 బిర్యానీలు ఆర్డర్ చేసి ‘బిర్యానీ బ్రిగేడ్’ విజేతగా నిలిచారని చెప్పింది. ఈ లెక్కన రోజుకు అతను 4 బిర్యానీలను ఆర్డర్ చేశాడు. దీంతో పాటు ముంబైకి చెందిన ఓ వ్యక్తి రూ. 42.3 లక్షల విలువైన ఆర్డర్స్ చేశారని వెల్లడించింది. ప్రతీ ఏడాది జనవరి-నవంబర్ మధ్య అమ్మకాల స్విగ్గీ ప్లాట్‌ఫారమ్‌లో ఫుడ్ ఆర్డర్‌లు డేటా ఆధారంగా ఈ నివేదికను విడుదల చేసింది. జనవరి 1 ఒక్క రోజునే ఏకంగా 4,30,000 బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్లు తెలిపింది. వరసగా 8వ సంవత్సరం కూడా బిర్యానీనే ఆర్డర్లలో తొలిస్థానంలో నిలిచింది.

పండగ సమయాల్లో ఆర్డర్ల విషయానికి వస్తే.. దుర్గాపూజ సమయంలో ఎక్కువగా గులాబ్ జామూన్ ఆర్డర్లు వచ్చాయని, ఆ సమయంలో 7.7 మిలియన్ల ఆర్డర్లతో రసగుల్లాను మించిపోయాయని తెలిపింది. నవరాత్రి సమయంలోని తొమ్మిది రోజుల్లో వెజ్ ఆర్డర్లలో మసాలా దోశ అత్యధిక ఆర్డర్లు వచ్చినట్లు స్విగ్గీ తెలిపింది. బెంగళూర్ నగరాన్ని ‘‘కేక్ క్యాపిటల్’’ గా అభివర్ణించింది, ఈ నగరంలో నుంచి చాక్లెట్ కేక్ కోసం 8.5 మిలియన్ల ఆర్డర్లు వచ్చాయని స్విగ్గీ తెలిపింది. 2023, వాలెంటైన్స్ డే సమయంలో భారతదేశంలో నిమిషానికి 271 కేకుల ఆర్డర్లు వచ్చినట్లు తెలిపింది. నాగ్‌పూర్ కి చెందిన ఒక వినియోగదారుడు ఒకే రోజులో 92 కేకుల్ని ఆర్డర్ చేశాని తెలిపింది.