
R Ashwin Predicts Costliest Players for IPL 2024 Auction: క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ 2024 వేలంకు సమయం దగ్గరపడుతోంది. డిసెంబర్ 19న దుబాయ్‌లోని కొక కోలా అరెనాలో ఈ మినీ వేలం జరగనుంది. 10 ప్రాంఛైజీలు ఏ ఆటగాడిని కొనుగోలు చేయాలనే దానిపై కసరత్తు చేస్తున్నాయి. ఇటీవల భారత గడ్డపై ముగిసిన వన్డే ప్రపంచకప్ 2023లో సత్తాచాటిన ఆటగాళ్లకు భారీ ధర పలికే ఛాన్స్ ఉంది. ఇదే విషయాన్ని టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చెప్పాడు. ప్రపంచకప్ 2023లో రాణించిన కొందరు ఆటగాళ్లపై కోట్లు కురువనున్నాయని పేర్కొన్నాడు.
ఆస్ట్రేలియా ప్రపంచకప్ హీరో ట్రావిస్ హెడ్, న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర, కివీస్ బ్యాటర్ డారిల్ మిచెల్, ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్, ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ సహా వానిందు హసరంగా, గెరాల్డ్ కోయిట్జీ, హర్షల్ పటేల్, శార్దూల్ ఠాకూర్, షారూఖ్ ఖాన్‌లు భారీ ధర పలుకుతారని ఆర్ అశ్విన్ అంచనా వేశాడు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా యాష్ ఓ వీడియోను షేర్ చేశాడు. నా అంచనా నిజం అవుతుందా? అని క్యాప్షన్ ఇచ్చాడు. అశ్విన్ చెప్పినట్లు హెడ్, రవీంద్రలపై కాసుల వర్షం కురువనుంది.
రవిచంద్రన్ అశ్విన్ ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు యాష్ ఆడాడు. చాలా సంవత్సరాలు చెన్నై అశ్విన్ ఆడిన విషయం తెలిసిందే. ఐపీఎల్ ప్రదర్శనతోనే యాష్ భారత జట్టులోకి వచ్చాడు. ఇక ఐపీఎల్ 2024 వేలానికి మొత్తం 333 మంది ఆటగాళ్లను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ షార్ట్ లిస్ట్ చేసింది. ఇందులో 214 మంది భారత ఆటగాళ్లతో పాటు 119 మంది విదేశీయులు, ఇద్దరు అసోసియేట్స్ ఉన్నారు.