
Cockroach: బొద్దింకలు ఇంట్లో చిరాకుగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలు వీటిని పారదోలేందుకు చేయని ప్రయత్నాలు ఉండవు. స్ప్రేలు, ఇతర రసాయనాలను వాడుతుంటారు. కానీ జపాన్‌లో మాత్రం ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఓ వ్యక్తి బొద్దింకను చంపేందుకు ప్రయత్నిస్తూ తన సొంత అపార్ట్‌మెంట్‌ని తగలబెట్టుకున్నాడు.
డిసెంబర్ 10న కుమాహోటోలోని చువో వార్డులోని తన అపార్ట్మెంట్లో సదరు వ్యక్తి బొద్దింకను గుర్తించాడు. దీనిని చంపడానికి పెద్ద మొత్తంలో పురుగుల మందును స్ప్రే చేశాడు. దీని కారణంగానే ఇంట్లో మంటలు చెలరేగాయి. పురుగుల మందును స్ప్రే చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించిందని జపనీస్ వార్తా పత్రిక మైనిచి షిబున్ తన నివేదికలో పేర్కొంది.
Read Also: Maldives: నీటి సర్వేపై భారత్‌తో ఒప్పందాన్ని పునరుద్ధరించుకోం.. మాల్దీవుల ప్రకటన..
డిసెంబర్ 10 అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. 54 ఏళ్ల వ్యక్తి బొద్దింకను చంపేందుకు ప్రయత్నించి, పెద్ద మొత్తంలో పురుగుల మందు పిచికారీ చేశాడు. దీంతో పేలుడు సంభవించి బాల్కానీ కిటికి ఊడిపోవడంతో అతనికి స్వల్ప గాయాలయ్యాయి. విచారణలో హీటింగ్ టేబుల్ వద్ద కాలిన గుర్తులు ఉన్నట్లు తేలింది. ఎలక్ట్రిక్ వస్తువులు, అవుట్‌లెట్స్ వద్ద పురుగుల మందు పిచికారీ చేయడం వల్ల పేలుడు సంఘటలను జరుగుతున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. క్రిమిసంహారక మందుల్లో ఆల్కాహాల్లో సహా మండే పదార్థాలు ప్రొపేన్, బ్యూటేన్ వంటి ప్రొపెల్లెంట్స్ ఉంటాయి. ఈ ప్రొపెల్లెంట్స్, ఖచ్చితమైన ఆక్సిజన్‌తో కలిస్తే పేలుడు సంభవించవచ్చని తెలిపాయి.