Leading News Portal in Telugu

KL Rahul: ఆటను ఆస్వాదించండి.. అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వండి: భారత్ కెప్టెన్


KL Rahul: ఆటను ఆస్వాదించండి.. అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వండి: భారత్ కెప్టెన్

KL Rahul Says Sanju Samson Played Really Well Today: ఆటను ఆస్వాదించండి, అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికే ప్రయత్నించండని తాను యువ క్రికెటర్లకు చెప్పానని టీమిండియా తాత్కాలిక కెప్టెన్ లోకేష్ రాహుల్ చెప్పాడు. ప్రస్తుత జట్టులో కొందరికి అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడిన అనుభవం లేకపోయినా.. వందశాతం తమ ప్రదర్శనను ఇవ్వడానికే ప్రయత్నించారన్నాడు. ఐపీఎల్‌లో సంజూ శాంసన్‌ అద్భుతమైన ఆటగాడు అని రాహుల్ పేర్కొన్నాడు. గురువారం జరిగిన ఆఖరి వన్డేలో భారత్ 78 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై గెలిచింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను రాహుల్ సేన 2-1 తేడాతో సొంతం చేసుకుంది.

మ్యాచ్ అనంతరం లోకేష్ రాహుల్ మాట్లాడుతూ… ‘కుర్రాళ్లతో కలిసి ఆడటం ఎప్పుడూ కూడా చాలా బాగుంటుంది. వన్డే ప్రపంచకప్‌ 2023 ఫైనల్‌ ఓటమి తర్వాత తొలిసారి మైదానంలోకి అడుగు పెట్టా. దక్షిణాఫ్రికాపై వన్డే సిరీస్‌ గెలవడం ఆనందంగా ఉంది. ప్రస్తుత జట్టులోని ఆటగాళ్లతో ఐపీఎల్‌లో చాలా మ్యాచ్‌లు ఆడాను. యువ క్రికెటర్లకు ఒకేటే చెపుతున్నా.. మీ ఆటను ఆస్వాదించండి. అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికే ప్రయత్నించండి. మిగతా వాటి గురించి ఆందోళన చెందొద్దు. వన్డే సిరీస్‌ సందర్భంగా జట్టులో వారి పాత్రను గుర్తు చేశాను’ అని తెలిపాడు.

‘ప్రస్తుత జట్టులో మంచి ఆటగాళ్లు ఉన్నారు. కొందరికి అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడిన అనుభవం లేకపోయినా.. వందశాతం ప్రదర్శనను ఇవ్వడానికే ప్రయత్నించారు. ఐపీఎల్‌లో సంజూ శాంసన్‌ అద్భుతమైన ఆటగాడు. కానీ జాతీయ జట్టుకు వచ్చేసరికి.. కొన్ని కారణాల వల్ల టాప్‌ ఆర్డర్‌లో ఎక్కువగా అవకాశాలు దక్కడం లేదు. ఈరోజు తన సత్తా ఏంటో చూపించాడు. మంచి షాట్లు ఆడుతూ పరుగులు చేశాడు. ఇలాంటి ఇన్నింగ్స్ సంజూ నుంచి ఆశించాం’ అని లోకేష్ రాహుల్ చెప్పుకొచ్చాడు. ఈ వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 296 పరుగులు చేసింది. సంజూ శాంసన్‌ (108; 114 బంతుల్లో 6×4, 3×6) సెంచరీ బాదాడు. ఆపై 97 పరుగుల లక్ష్య ఛేదనలో సఫారీ జట్టు 45.5 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది.