Leading News Portal in Telugu

9 శాతం పడిపోయిన వైసీపీ గ్రాఫ్!.. చాణక్య స్ట్రాటజీస్ సర్వే | ycp graph 9 percentage down| chanakya| strategies| survey| tdp| janasena


posted on Dec 24, 2023 3:13PM

రెండు నెలలలో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల అధికారులు   ఎన్నికల ఏర్పాట్లపై పూర్తి స్థాయి దృష్టి పెట్టారు. ఫిబ్రవరిలో నోటిఫికేషన్, మార్చిలో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి.  ఏపీలో వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన విజయం పక్కా అని పలు సర్వేలు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో  సర్వే   కూడా ఇదే విషయాన్ని తేటతెల్లం చేసింది.  తెలుగుదేశం ఒంటరిగా పోటీ చేసినా గెలుస్తుందన్న అంచనాలు ఉండగా,   తెలుగుదేశం, జనసేన కలిస్తే క్లీన్ స్వీప్  గ్యారంటీ అని ఆ సర్వే పేర్కొంది. ఈ మధ్య కాలంలో ఏపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ప్రజలకు తెలుగుదేశం పార్టీని మరింత దగ్గర చేసాయని తమ సర్వేలో తేలినట్లు చాణ‌క్య స్ట్రాట‌జీస్ స‌ర్వే వెల్లడించింది. వైసీపీపై ప్రజా వ్యతిరేకత పెరిగి పరిస్థితులన్నీ తెలుగుదేశంకు అనుకూలంగా మారుతున్నట్లు ఈ సర్వే నివేదిక పేర్కొంది. 

2019 ఎన్నికలలో  వైసీపీ అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. 175 అసెంబ్లీ స్థానాలకు గాను 151 స్థానాల్లో విజయం సాధించి వైసీపీ విజయదుందుభి మోగించింది. టీడీపీ కేవలం 23 స్థానాలతో  ఓటమి చవిచూసింది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అయితే ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది. మొత్తం పోలైన ఓట్లలో 50 శాతం ఓట్లను వైసీపీ సొంతం చేసుకుంది. వైసీపీ అధికారంలోకి వచ్చి సీఎంగా జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తరువాత తొలి ఆరు నెలలలోనే ప్రజలలో అసంతృప్తి మొదలైంది. అది కాస్త నాలుగేళ్ళ కాలం తిరిగేసరికి ప్రజలలో తీవ్ర వ్యతిరేకతగా మారింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి ఘోర పరాజయం తప్పదని ఇప్పటికే ఎన్నో సంస్థలు తమ సర్వేల ఫలితాలను వెల్లడించగా.. తాజాగా చాణ‌క్య స్ట్రాట‌జీస్ కూడా ఏపీలో ఈసారి తెలుగుదేశం, జనసేన కూటమిదే విజయం అని తేల్చి చెప్పింది.  

చాణ‌క్య స్ట్రాట‌జీస్ స‌ర్వే రాష్ట్రంలో ప‌ర్య‌టించి వివ‌రాలు సేక‌రించింది.  దీని ప్ర‌కారం.. అధికార వైసీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ, జ‌న‌సేన స‌హా ఇత‌ర పార్టీల ప‌రిస్థితిని అంచనా వేసింది. ఈ స‌ర్వే వివ‌రాల‌ను తాజాగా వెల్ల‌డించింది. ఈ సర్వే ప్రకారం గ‌డిచిన నాలుగేళ్ళలో తెలుగుదేశం  పుంజుకుంది. అదేస‌మ‌యంలో అధికార పార్టీ వైసీపీ గ్రాఫ్ ప‌డిపోయింది. ఇక‌, జ‌న‌సేన స‌హా ఇత‌ర పార్టీల గ్రాఫ్ కూడా కొంత మేర‌కు పెరిగిన‌ట్టు తెలుస్తోంది. 2019 ఎన్నిక‌లలో తెలుగుదేశంకు    39 శాతం ఓట్లు రాగా  ప్ర‌స్తుతం ఇది 4 శాతం పెరిగి 43 శాతానికి చేరినట్లు చాణక్య  వెల్లడించింది. అలాగే వైసీపీకి 2019 ఎన్నిక‌లలో 50 శాతం ఓటింగ్ గ్రాఫ్ దక్కించుకోగా.. ప్ర‌స్తుతం అది ఏకంగా 9 శాతం దిగజారిపోయి 41 శాతానికి పడిపోయిందని వెల్లడించింది. అలాగే 2019 ఎన్నిక‌లలో 6 శాతం ఓటింగ్ తో ఉన్న జనసేన పార్టీ ప్ర‌స్తుతం 4 శాతం పెరిగి 10 శాతానికి చేరిందని, ఇక ఇత‌ర పార్టీలు 2019 ఎన్నిక‌లలో 5 శాతం ఓటింగ్ పొందగా.. ఇప్పుడు ఒక శాతం పెరిగి 6 శాతానికి చేరిందని తెలిపారు.

ప్ర‌స్తుతం ఉన్న ఈ గ్రాఫ్‌లు ఎన్నిక‌ల స‌మ‌యానికి మ‌రింత పెర‌గ‌డ‌మో, త‌గ్గ‌డ‌మో జ‌రుగుతుంద‌ని స‌ర్వే   వెల్ల‌డించగా.. టీడీపీ, జనసేన కూటమి  గ్రాఫ్ మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని పేర్కొంది. ఈ సర్వే  ప్రకారం చూస్తే జనసేన లేకుండా టీడీపీ 43 శాతం ఓటింగ్ దక్కించుకోనుండగా.. వైసీపీకి 41 శాతం మాత్రమే దక్కనున్నాయి. జనసేన కలిస్తే ఇది 51 శాతానికి చేరి కనీవినీ ఎరుగని విజయం దక్కించుకోనుంది. సామాజిక వర్గాలు, పేద, మధ్యతరగతి ప్రజలను విభజించి వారి  శాంపిల్స్ సేకరించిన ఈ చాణక్య  స్ట్రాటజీస్ సర్వే ప్రకారం.. ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలతో పాటు నిరుద్యోగులు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్లు తేలింది. అటు అర్బన్ ఓటర్ల నుండి గ్రామీణ ఓటర్ల వరకూ ఎటు చూసినా వైసీపీపై వ్యతిరేకత కనిపిస్తున్నట్లు ఈ సర్వే పేర్కొంది. మొత్తంగా ఈ సర్వేప్రకారం తెలుగుదేశం, జనసేన కూటమి వచ్చే ఎన్నికలలో అద్భుత విజయం సాధించడం ఖాయం.