
Xi Jinping: చైనా అధ్యక్షుడు, కమ్యూనిస్ట్ పార్టీ అధినేత షి జిన్‌పింగ్, పార్టీ నాయకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అధికార కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నేతలు వ్యక్తిగత చిత్తశుద్ధిని కాపాడుకోవాలని, బంధువులను అవినీతికి దూరంగా ఉండాలని హెచ్చరించారు. సిపిసి (కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా) సెంట్రల్ కమిటీ యొక్క పొలిటికల్ బ్యూరో సభ్యులు మార్క్సిస్ట్ మేధావుల ప్రమాణాలను పాటించాలని, మొత్తం పార్టీ వ్యక్తిగత సమగ్రతకు, క్షమశిక్షణకు ఉదాహరణగా నిలుస్తారని అన్నారు. డిసెంబర్ 22న కీలక పార్టీ సమావేశంలో జిన్‌పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: CM Mohan Yadav: “ఉజ్జయిని ప్రైమ్ మెరిడియన్”.. ప్రపంచం మొత్తం టైమ్ మార్చుకోవాలి..
అవినీతికి వ్యతిరేకంగా పార్టీ నేతలు తమ కుటుంబ సభ్యులు, బంధువులు, వారి చుట్టూ ఉండే కార్యకర్తలు నిబంధనలు ఏర్పాటు చేసుకోవాలని జిన్‌పింగ్ సూచించారు. పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ తర్వాత చైనాలో ఎక్కువ కాలం అధికారంలో ఉన్న నేతగా జిన్ పింగ్ నిలిచారు. ఆయన వరసగా మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవితో పాటు సీపీసీ, మిలిటరీకి నాయకత్వం వహిస్తున్నాడు.
జిన్ పింగ్ 2012లో అధ్యక్ష పదవిని చేపట్టినప్పటి నుంచి అవినీతికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. చైనాలో అవినీతికి పాల్పడిన సైనిక జనరల్స్‌తో పాటు చాలా మందిని శిక్షించారు. డిసెంబర్ 4న సీపీసీ అవినీతి నిరోధక విభాగం సెంట్రల్ కమిషన్ ఫర్ డిసిప్లైన్ ఇన్స్పెక్షన్ (CCDI) అవినీతికి వ్యతిరేకంగా అణిచివేత ప్రారంభిస్తామని ప్రకటించింది. గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ప్రభుత్వంలోని కీలక మంత్రులు కనిపించకుండా పోయారు. వీరిని అక్కడి ప్రభుత్వం అరెస్ట్ చేసినట్లు వార్తలు కూడా వచ్చాయి.