
Lucknow Super Giants To Replace Gautam Gambhir With Suresh Raina As Mentor: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్లో టీమిండియా మాజీ ఆటగాడు, మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో చేరనున్నాడు. రైనాను మెంటార్‌గా నియమించేందుకు లక్నో ప్రాంచైజీ సిద్దమైనట్లు సమాచారం. ఇప్పటికే రైనాతో లక్నో ఫ్రాంచైజీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా మిస్టర్ ఐపీఎల్ చేసిన ట్వీట్ ఈ వార్తలకు మరింత ఊతమిస్తోంది.
‘లక్నో సూపర్ జెయింట్స్‌తో సురేష్ రైనా ఒప్పందం కుదర్చుకోలేదు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలు అన్ని అవాస్తవం’ ఓ జర్నలిస్ట్ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్‌కు రైనా స్పందించాడు. ‘ఆ వార్తలు ఎందుకు నిజం కాకూడదు?’ అని రిప్లే ఇచ్చాడు. దీంతో రైనాను లక్నో జట్టులో చేరడం ఖాయమని ఫాన్స్ ఫిక్స్ అయిపోయారు. గత రెండు సీజన్లగా మెంటార్‌గా ఉన్న టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్‌ను ఐపీఎల్ 2024 వేలానికి ముందు లక్నో విడిచిపెట్టింది. గంభీర్ స్ధానాన్ని రైనాతో భర్తీ చేసేందుకు లక్నో యాజమాన్యం సిద్దమైంది.
ఐపీఎల్లో సురేష్ రైనాకు అద్భుత రికార్డు ఉంది. మిస్టర్ ఐపీఎల్‌గా పేరొందిన రైనా.. 205 మ్యాచ్‌లు ఆడి 5,528 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ నాలుగుసార్లు ఛాంపియన్‌గా నిలవడంలో రైనా కీలక పాత్ర పోషించాడు. 2020 వరకు బాగా ఆడిన రైనా.. ఆ తర్వాతి రెండు సీజన్లు పెద్దగా ప్రభావం చూపలేదు. దాంతో రైనాను చెన్నై వేలంలోకి విడిచిపెట్టింది. 2023లో రైనాను ఏ ప్రాంచైజీ కొనుగోలు చేయలేదు. ప్రస్తుతం మిస్టర్ ఐపీఎల్ వ్యాఖ్యాతగా కొనసాగుతున్నాడు.