
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ వార్ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. హమాస్ ఉగ్రసంస్థను నేలమట్టం చేసేదాకా యుద్ధాన్ని ఆపేది లేదని ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రపంచదేశాల నుంచి వస్తున్న ఒత్తిడిని సైతం లెక్క చేయకుండా హమాస్‌పై పోరుసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే గాజాలోని హమాస్ కీలక టన్నెల్ వ్యవస్థనున కుప్పకూల్చేందుకు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) పనిచేస్తున్నాయి. ఇప్పటికే ఆ టన్నెల్స్‌ని సముద్ర నీరుతో ముంచేయాలని ప్లాన్ చేసింది.
హమాస్ ఈ టన్నెల్స్‌ని కమాండ్ సెంటర్లుగా వాడుకుంటుందని ఇజ్రాయిల్ బలగాలు ప్రపంచం ముందు సాక్ష్యాలను చూపించాయి. గాజా నగరంలోని ప్రముఖ ఆస్పత్రుల కింద ఈ టన్నెల్ వ్యవస్థ ఉండటాన్ని కూడా ఇజ్రాయిల్ గుర్తించింది. ఈ టన్నెల్స్ లోనే ఇజ్రాయిలీ బందీలను హమాస్ ఉంది. తాజాగా ఇజ్రాయిల్ బలగాలు ఐదుగురు ఇజ్రాయిలీ బందీల మృతదేహాలను సొరంగాల్లో గుర్తించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయిలీ మిలటరీ చెప్పింది.
ఇదిలా ఉంటే గాజా స్ట్రిప్ మధ్య భాగంలోని మాఘాజీ శరణార్థి శిబిరంపై ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడిలో 70 మంది మరణించారని పాలస్తీనా ఆరోగ్యమంత్రిత్వ శాఖ అధికారి ఆదివారం తెలిపారు. దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్‌లో మరో వైమానిక దాడిలో 8 మంది మరణించినట్లు వైద్యులు తెలిపారు. గాజాపై ఆదివారం రాత్రి నుంచి ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేస్తోంది. సోమవారం ఉదయం వరకు ఈ దాడులు కొనసాగాయి. సెంట్రల్ గాజాలోని అల్-బురీజ్ పై దాడి చేసింది. ఇజ్రాయిల్ వైమానిక దాడిని భయంకరమైన ఊచకోతగా హమాస్ అభివర్ణించింది. గతంలో గాజా ఉత్తర ప్రాంతాన్ని మాత్రమే టార్గెట్ చేసిన ఇజ్రాయిల్ ప్రస్తుతం, దక్షిణ భాగంతో పాటు వెస్ట్ బ్యాంకులో కూడా దాడులు చేస్తోంది.
అక్టోబర్7న హమాస్, ఇజ్రాయిల్‌పై దాడులు చేసి 1200 మందిని ఊచకోత కోసింది. పిల్లలు, పెద్దలు, మహిళలు అని చూడకుండా దొరికిన వాళ్లను దొరికినట్లుగా చంపేసింది. మరో 240 మందిని బందీలుగా చేసుకుంది. అయితే ఇటీవల ఇజ్రాయిల్-హమాస్ సంధి ఒప్పందంలో 105 మంది బందీలను హమాస్ విడుదల చేసింది. ఇందుకు ప్రతిగా ఇజ్రాయిల్ తమ జైళ్లలో ఉన్న 200 మంది పాలస్తీనా ఖైదీలను వదిలేసింది. మరోవైపు ఇజ్రాయిల్ జరుపుతున్న దాడుల్లో 20,400 మంది పాలస్తీనియన్లు మరణించారు.