నగరి నుంచి వైసీపీ అభ్యర్థి ఎవరంటే.. రోజాను పక్కన పెట్టేసిన జగన్!? | roja kept aside| jagan| reject| party| ticket| nagari
posted on Dec 26, 2023 8:42AM
మంత్రి రోజాకు ఈ సారి వైసీపీ టికెట్ ఇచ్చే అవకాశాలు ఇసుమంతైనా లేవా? అంటే వైసీపీ వర్గాల నుంచి ఔననే సమాధానమే వస్తోంది. రోజాకు నగరి నుంచి పోటీకి అవకాశం లేదని పార్టీ అధినేత జగన్ ఇప్పటికే చెప్పేశారని కూడా అంటున్నారు. నగరి నుంచి వైసీపీ అభ్యర్థిగా శ్రీశైలం దేవస్థానం పాలక మండలి ఛైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డిని వచ్చే ఎన్నికలలో రంగంలోకి దింపాలని జగన్ నిర్ణయించారని అంటున్నారు. ఈ విషయం దాదాపు ఫైనల్ అయిపోయిందని చెబుతున్నారు. నగరిలో రోజాకు ఎదురుగాలి వీస్తున్నదనీ, ప్రజలలో వ్యతిరేకతే కాకుండా రోజా అభ్యర్థిత్వాన్ని పార్టీ కార్యకర్తలే వ్యతిరేకిస్తున్నారన్న నివేదికల ఆధారంగా ఆమెకు బదులుగా రెడ్డివారి చక్రపాణి రెడ్డిని నగరి నుంచి బరిలోకి దింపాలని జగన్ భావిస్తున్నారని చెబుతున్నారు. సిట్టింగులను మార్చేసి ప్రజా వ్యతిరేకతను తగ్గించుకోవాలని జగన్ భావిస్తున్నారు. ఆ దిశగా ఇప్పటికే 11 మందిని మార్చేశారు. ముందు ముందు మరింత మందిని మారుస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జగన్ నిర్ణయాలతో పార్టీలో అసంతృప్తి భగ్గుమంటున్నా ఖాతరు చేయడం లేదు. తదుపరి మార్పుల్లో మంత్రి రోజా స్థానం కూడా గాయబ్ కావడం ఖాయమని చెబుతున్నారు. నగరి నుంచి ఆమె ను మార్చడమే కాదు.. ఆమెకు ఈ సారి ఎక్కడ నుంచీ పోటీ చేసే అవకాశం లేదని కూడా అంటున్నారు. అయితే పార్టీలో సముచిత హోదా కల్పించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిందేమిటంటే.. మంత్రి రోజాకు తనకు టికెట్ నిరాకరించడం కంటే.. నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా రాజీకీయాలు చేసిన రెడ్డివారి చక్రపాణి రెడ్డికి టికెట్ ఇవ్వడంమే ఎక్కువగా బాధకలిగిస్తోందని అంటున్నారు. అయితే చక్రపాణి రెడ్డికి చిత్తూరు జిల్లాకే చెందిన మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి మద్దతు ఉండటంతో రోజా మాట చెల్లుబాటు కావడం లేదని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఇప్పుడు రోజాను తప్పించి ఆమె స్థానంలో చక్రపాణి రెడ్డిని బరిలోకి దింపాలన్న జగన్ నిర్ణయంపై రోజా ఎలా స్పందిస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి తిరుగుబాటు చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన రోజా.. జగన్ నిర్ణయం వెలువరించిన తరువాత మౌనంగా ఉండే అవకాశాలైతే లేవని ఆమె నైజం తెలిసిన వారు అంటున్నారు. నిజంగానే నగరి నుంచి పోటీకి రోజాకు జగన్ టికెట్ నిరాకరించినా, ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె మౌనంగా భరించడం తప్ప మరో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉన్నారని కొందరు అంటున్నారు. ఆమెకు తెలుగుదేశం కానీ, జనసేన కానీ రెడ్ కార్పెట్ పరిచి వెల్ కమ్ చెప్పే అవకాశాలు లేవనీ, జగన్ పొమ్మన లేక పొగపెట్టినా ఆమె వైసీపీ చూరు పట్టుకువేళాడాల్సిందే తప్ప రాజకీయంగా ఆమెకు మరో దారి లేదని అంటున్నారు.
నిజానికి రోజా రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైంది. ఆమె వాగ్ధాటి ఆమె పార్టీలో వేగంగా ఎదగడానికి దోహదపడింది. పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఆమెకు తెలుగుదేశం పార్టీ అవకాశం ఇచ్చింది. అయితే తెలుగుదేశం తరఫున రెండు సార్లు ఆమె అసెంబ్లీకి పోటీ చేసినా విజయం సాధించలేకపోయారు. పార్టీలోనే తన వ్యతిరేకులు (గాలిముద్దుకృష్ణమ) తన ఓటమి కోసం పని చేశారన్న అసంతృప్తితో ఆమె రగిలిపోయారు. 2009లోనే ఆమె తెలుగుదేశం వీడి కాంగ్రెస్ గూటికి వెళ్లాలన్న ప్రయత్నాలు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ కూడా ఆమెను కాంగ్రెస్ లో చేరేందుకు సానుకూలంగా స్పందించారు. అయితే ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో ఆమె హస్తం గూటికి చేరలేదు.
అయితే తరువాత ఆమె జగన్ పార్టీ వైసీపీలో చేరారు. 2014లో నగరి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే వైసీపీ ఆ ఎన్నికలలో పరాజయం పాలు కావడంతో ఆమె విపక్ష ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఉన్నారు. ఆ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు పెను వివాదానికి దారి తీశాయి. దాదాపు ఏడాది పాటు ఆమె సభ నుంచి సస్పెండ్ అయ్యారు. దీనిపై ఆమె కోర్టుకు వెళ్లినా ఆమెకు ఊరట లభించలేదు. సరే 2019లో తిరిగి నగరి నుంచి విజయం సాధించిన రోజాకు జగన్ మలి విడత కేబినెట్ లో స్థానం కల్పించారు. మంత్రిగా కూడా రోజా తన విమర్శలు, వ్యాఖ్యలతో వివాదాలకు కేంద్ర బిందువుగానే ఉన్నారు. ఇప్పుడు వైసీపీ ఆమెకు టికెట్ నిరాకరిస్తే ఆమె స్పందన ఎమిటన్నది ఆసక్తికరంగా మారింది.