బసవరామ తారకం క్యాన్సర్ హాస్పిటల్ సీఈవోగా డాక్టర్ కూరపాటి | doctor kurapati as basavarama tarakam cancer hospital ceo| nandamuri| balakrishan| chairman
posted on Dec 26, 2023 2:44PM
బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ నూతన ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) గా డాక్టర్ కూరపాటి కృష్ణయ్యను నియమించినట్లు ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది. నాలుగు దశాబ్దాల పాటువైద్య రంగంలో ఎంతో అనుభవజ్ఞడుగా పేరెన్నికగలిగిన ఆర్థోపెడిక్ సర్జన్ అయిన డా. కూరపాటి కృష్ణయ్య గతంలో మెడిసిటీ హాస్పిటల్ సీఈవోగా పని చేశారు. సుదీర్ఘ అనుభవజ్ఞుడైన డా కృష్ణయ్య నియామకం అత్యున్నత శ్రేణి వైద్య సేవలు, క్యాన్సర్ పై పోరాటంలో పరిశోధనలకు నెలవుగా నిలిచిన బసవరామ తారకం క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ చరిత్రలో మరో మైలు రాయి కానుంది.
టోటల్ జాయింట్ రీప్లేస్మెంట్, ప్రైమరీ అండ్ రివిజన్ కాంప్లెక్స్ ట్రామా , ఇంటర్ లాకింగ్ నెయిలింగ్ లాంటి అత్యాధునిక శస్త్ర చికిత్సలలో ఎంతో గుర్తింపు పొందిన వైద్యుడు డాక్టర్ కూరపాటి కృష్ణయ్య, విలువలతో కూడిన వైద్య విధానాలకు కట్టుబడిన వ్యక్తిగా ఆరోగ్య సేవలలో కరుణ, జాలి, దయలకు ఖచ్చితమైన స్థానం ఉండాలని భావిస్తారు. డాక్టర్ కూరపాటి కృష్ణయ్య బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ విలువలలో ఖచ్చితంగా ఇమిడిపోయే వ్యక్తి అనడంలో సందేహం లేదు.
నూతన సీఈవో గా భాద్యతలు స్వీకరించిన డాక్టర్ కూరపాటి కృష్ణయ్య ను బసవరామ తారకం క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ చైర్మన్ స్వాగతించారు. ఈ సందర్భంగా ఆరోగ్య సేవల విభాగంలో అత్యున్నత శ్రేణి నాణ్యతా ప్రామాణాలను స్థాపించడంలో ఆయన ట్రాక్ రికార్డ్ ను గుర్తు చేసుకొన్నారు. గతంలో మల్టీ స్పెషాలటీ హాస్పిటల్ సేవలకు పేరు గడించిన మెడిసిటీ హాస్పిటల్ సీఈవోగా వైద్య సేవలతో పాటూ విద్యా సంబంధమైన అంశాలను మేళవిస్తూ ఎంతో విజయవంతంగా సాగిన ప్రయాణాన్ని ప్రశంసించారు.
వైద్య రంగంలో డాక్టర్ కూరపాటి కృష్ణయ్య పయనం పూర్తి అంకితభావంతో శ్రేష్టతతో సాగిందని ప్రస్తుతించారు. ఖచ్చితత్వంతో కూడిన స్పెషలిస్ట్ సర్జన్ గా డాక్టర్ కూరపాటి కృష్ణయ్య ఆర్థోపెడిక్స్ విభాగంలో అత్యున్నత శ్రేణి ప్రమాణాలను స్థాపించడమే కాకుండా ఆంధ్ర ప్రదేశ్ లో అత్యాధునిక శస్త్ర చికిత్స విధానాలను అవలంబించడంలో మార్గదర్శకత్వం వహించారని బాలకృష్ణ ఈ సందర్భంగా చెప్పారు.