ఏపీ కాంగ్రెస్ పగ్గాలు షర్మిలకు!.. ముహూర్తం ఎప్పుడంటే? | sharmila as ap congress chief| dk| thakre| ycp| target| elections
posted on Dec 26, 2023 3:00PM
మొన్న కర్ణాటక, నిన్న తెలంగాణలో అనుకున్న ఫలితాలు సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేడు ఏపీపై కన్నేసింది. ఇప్పటికిప్పుడు అధికారంలోకి వచ్చేంత కాకపోయినా దక్షణాదిలో మరో రాష్ట్రంలో తన స్థాయి ఏంటో నిరూపించుకోవాలి. కాంగ్రెస్ ఇక్కడ తుడిచిపెట్టుకుపోవడంలో రెండు అంశాలు కీలక పాత్ర పోషించాయి. ఒకటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఏపీ నష్టపోయిందన్నది ఏపీ ప్రజలలో బలంగా నాటుకుపోయింది.
అయితే పదేళ్లు గిర్రున తిరగడంతో ఇప్పుడు ఆ భావనలో కొంత మార్పు వచ్చింది. కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే మళ్ళీ తమకి న్యాయం చేస్తారనే భావన పెరిగింది. దీంతో కాంగ్రెస్ లో ఆశ మొదలైంది. ఏపీ కాంగ్రెస్ శిథిలావస్థకు రెండో కారణం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. కాంగ్రెస్ ను కొట్టే జగన్ తన పార్టీని నిలుపుకున్నారు. ఇద్దరు ముగ్గురు మినహా వైసీపీ సీనియర్ నేతలంతా కాంగ్రెస్ నుండి వచ్చిన వారే. కనుక ఇప్పుడు ఏపీలో జగన్ ను దెబ్బతీస్తేనే కాంగ్రెస్ కు స్కోప్ దక్కేది. ఇందుకోసమే కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు ప్రణాళికలు రచించుకున్నట్లు తెలుస్తున్నది. ఆ ప్రణాళికల అమలుకు శ్రీకారం చుట్టినట్లు కనిపిస్తోంది.
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఏపీలోకి అడుగుపెట్టే సమయం దగ్గర్లోనే ఉన్నాయనే సంకేతాలు వస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల సమయంలోనే షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంపై చర్చలు పూర్తయ్యాయి. కానీ తెలంగాణలో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అప్పటికి వ్యూహాత్మకంగా అది వాయిదా వేశారు. ఇప్పుడు టార్గెట్ ఏపీ సమయం ఆసన్నమైంది. దీంతో షర్మిల రాజకీయ ప్రయాణం అప్పుడు ఎక్కడ ఆగిందో ఇప్పుడు అక్కడ నుండి మొదలు పెట్టేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. త్వరలోనే షర్మిల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఏపీకి మకాం మర్చనున్నట్లు తెలుస్తుంది. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి కేసి వేణుగోపాల్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్ లు ప్రత్యేక చొరవ చూపిస్తున్నట్లు తెలిస్తోంది. షర్మిల ఇప్పటికే డీకే శివకుమార్ ను పలు దఫాలుగా కలిసి చర్చలు జరపగా.. ఆ చర్చల్లో కేసి వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు. ఇప్పుడు ఈ ఇద్దరే దగ్గరుండి షర్మిలకు ఏపీ పగ్గాలు అప్పగించనున్నట్లు తెలుస్తుంది.
బుధవారం (డిసెంబర్ 27) కాంగ్రెస్ హైకమాండ్ ఏఐసీసీలో ఏపీ కాంగ్రెస్ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణు గోపాల్ పాల్గొననున్నారు. ఈ సమావేశానికి తప్పక హాజరు కావాలని ఏపీ పీసీసీ చీఫ్ రుద్రరాజు, కొత్త ఇన్‌చార్జి మాణిక్ రావు థాక్రే సహా పార్టీ రాష్ట్ర ముఖ్య నేతలకు ఇప్పటికే ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. ఈ సమావేశంలో వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలపై కీలకంగా చర్చ జరగనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల నియామకంపై అధిష్టానం పెద్దలు రాష్ట్ర నేతలకు ఈ సమావేశంలోనే సమాచారం ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది. అంతే కాదు ఈ నూతన సంవత్సరం రోజునే అంటే వచ్చే ఏడాది జనవరి 1న షర్మిలకు ఏపీ పార్టీ పగ్గాలను అప్పగిస్తున్నట్లు అధికారిక ప్రకటన చేయనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు నిర్ధారిస్తున్నాయి.
నిజానికి షర్మిల మళ్ళీ ఏపీ రాజకీయాలకు రావడంపై తొలుత పెద్దగా సుముఖత వ్యక్తం చేయలేదు. కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం కావాలని భావించారు. తన పార్టీని కాంగ్రెస్ లోకి విలీనం ప్రతిపాదన వచ్చిన సమయంలో కూడా షర్మిల అదే భావన వెలిబుచ్చారు. తెలంగాణ ఎన్నికలలో ఆమె ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఒక నియోజకవర్గంలో పోటీ చేయడం, లేదా రాజ్యసభకు అన్నట్లు ప్రచారం జరిగింది. కానీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఆమె సేవలను ఏపీలో వాడుకోవాలని నిర్ణయించుకుంది. ఏపీలోనే షర్మిలకు భవిష్యత్ ఉందని నచ్చజెప్పింది. దాంతో అంగీకారం తెలిపారు ఇప్పుడు తెలంగాణలో కూడా అధికారం కాంగ్రెస్ సొంతం కావడంతో ఏపీ కాంగ్రెస్ చీఫ్ అంటే ఖచ్చితంగా స్థాయి పెరుగుతుంది. దీంతో షర్మిల ఇప్పుడు మనస్పూర్తిగా ఏపీకి నాయకత్వం వహించేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఆమె ఏపీ రాజకీయాలలోకి రాబోతుండడంతోనే తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు క్రిస్మస్ కానుకలు పంపి సంకేతాలు ఇచ్చినట్లు పరిశీలకులు పేర్కొంటున్నారు.