Leading News Portal in Telugu

Central Congo Floods: సెంట్రల్‌ కాంగోలో భారీ వరదలు.. 22 మంది మృతి! పలువురు గల్లంతు


Central Congo Floods: సెంట్రల్‌ కాంగోలో భారీ వరదలు.. 22 మంది మృతి! పలువురు గల్లంతు

Central Congo Floods Kills 22 People: సెంట్రల్‌ కాంగోలో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల దాటికి కసాయి సెంట్రల్ ప్రావిన్స్‌లో 22 మంది మృతి చెందినట్లు స్థానిక అధికారి ఒకరు మంగళవారం తెలిపారు. కసాయి సెంట్రల్ ప్రావిన్స్‌లోని కనంగా జిల్లాలో గంటల తరబడి కురిసిన వర్షాలకు అనేక ఇళ్లు, నిర్మాణాలు ధ్వంసమయ్యాయని.. ప్రాణాలతో బయటపడిన వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరం చేసినట్లు ప్రావిన్స్ గవర్నర్ జాన్ కబేయా తెలిపారు.

గోడ కూలిపోవడం వల్ల బికుకులో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది చనిపోయారు. భారీ వర్షాలకు అనేక చోట్ల కొండచరియలు విరిగిపడి ఇళ్లు, చర్చ్‌లు, రోడ్లు ధ్వంసమయ్యాయి. వరదల్లో పలువురు గల్లంతయ్యారు. 20 మందికి పైగా ఆచుకీ తెలియడం లేదట. ముఖ్యంగా కనంగా ప్రాంతంలో వరదల ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. జాతీయ ప్రభుత్వం నుంచి తక్షణ చర్యను కోరామని ప్రావిన్స్ గవర్నర్ జాన్ కబేయా తెలిపారు. భారీ స్థాయిలో ఆస్తి నష్టం సంభవించినట్లు చెప్పారు.

భారీ వర్షాల కారణంగా కాంగోలోని కొన్ని ప్రాంతాలలో వరదలు తరచుగా సంభవిస్తాయి. గత మేలో తూర్పు కాంగోలోని సౌత్ కివు ప్రావిన్స్‌లో కుండపోత వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 400 మందికి పైగా మరణించారు. ఇక డిసెంబర్‌ తొలి వారంలో కాంగోలోని బుకావు ప్రాంతంలో భారీ వర్షాల వల్ల 14 మంది మృతి చెందారు. తాజాగా 20 మందికి పైగా మరణించారు.