భ్రమల్లో జగన్.. బైబై అంటున్న జనం! | people say byebye jagan| Illusion| ap| cm| ycp| mlas| resign| anti| people
posted on Dec 27, 2023 9:44AM
ఏపీ సీఎం జగన్ ది ఒక విలక్షణ వ్యక్తితం. ప్రపంచం మొత్తం తన కనుసన్నలలోనే నడుస్తోందని గట్టిగా నమ్ముతారు. అలా నడవాలని కోరుకుంటారు. తాను చెప్పిందే వేదం అని భావిస్తారు. అందుకు భిన్నంగా ఏం జరిగినా తనకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారంటూ అయిన వారూ, ప్రత్యర్థులూ అన్న తేడా లేకుండా అందరినీ అనుమానిస్తారు. ఎవరినీ నమ్మరు, ఎవరిపైనా నమ్మకం లేదు. ఇప్పుడు ఏపీలో ఆయన చేస్తున్న పాలన అదే.
నాలుగున్నరేళ్లుగా ఏపీలో జగన్ పాలన అధ్వానంగా ఉంది. ఈ మాట వాళ్లూ వీళ్లూ అనడం కాదు. వైసీపీ నేతలూ, ఎమ్మెల్యేలే అంటున్నారు. పరిశీలకులూ అదే చెబుతున్నారు. నిజానికి ప్రభుత్వ విధానాలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తే అధికారంలో ఉన్న ఎవరైనా దానిని ఒక అవకాశంగా తీసుకుంటారు. సమీక్షలు నిర్వహించి.. విధానాల మార్పుపై సమాలోచనలు చేస్తారు. కోల్పోయిన ప్రజా మద్దతును ఎలా కూడగట్టుకోవాలన్న దానిపై దృష్టి పెడతారు. వర్తమానాన్ని సమీక్షించుకుని, భవిష్యత్ ప్రణాళికను రచించుకుంటారు. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే అంతా అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చుసుకున్నా,వెక్కెక్కి ఏడ్చినా ప్రయోజనం ఉండదు. కానీ జగన్ సరిగ్గా అదే చేస్తున్నారు. ఎందుకంటే జగన్ రూటే సెపరేటు కదా? ఆయన అసలు తన విధానాల సమీక్ష అన్నదే సహించరు. తానే చేసిందే రైటు అని తాను అనుకోవడమే కాదు. అందరూ అలాగే అనాలని భావిస్తారు. అలా అననివారిని శత్రువులుగా భావిస్తారు. ఎందుకంటే ఆయనది విలక్షణ వ్యక్తిత్వం కదా? అందుకే తన విధానాలను వ్యతిరేకిస్తున్న వారిపై వేధింపులకు పాల్పడుతున్నారు. కక్ష సాధింపు చర్యలకు తెగబడుతున్నారు. ఈ విషయంలో ఆయనకు తనా పరా బేధం కూడా లేదు.
సహజంగా, అధికారంలో ఉన్న పార్టీలకు, మరీ ముఖ్యంగా నేనే రాజు నేనే మంత్రి తరహాలో అధినాయకత్వం చెప్పు చేతల్లో నడిచే ప్రాంతీయ, పార్టీలలో అధినేత తప్పులను ఎత్తి చూపే సాహసం ఎవరూ చేయరు. అందుకే ప్రాంతీయ పార్టీలలో అధినేత నిర్ణయాలను ప్రస్తుతించడానికి, ప్రశంసించడానికీ పార్టీ నేతలు పోటీలు పడుతుంటారు. ఎంత ఎక్కువగా పొగిడితే అంతగా అధినేత అభిమానానికి పాత్రులౌతామన్న భావన వారిలో ఉంటుంది. జగన్ పార్టీలోనూ అందుకు భిన్నంగా ఏమీ ఉండదు. ఇంత కాలం అదే జరిగింది. అయితే అధినేతను పొగడటంతోనే సరిపెట్టకుండా, ప్రత్యర్థులను ఎంత ఎక్కువగా విమర్శిస్తే అంతగా వీరతాడులు పడతాయన్న భావన కూడా వైసీపీలో ఉంది. అందుకే భాషా సంస్కారం కూడా లేకుండా, అది అసెంబ్లీ అయినా, బహిరంగ సభ అయినా, మీడియా సమావేశమైనా అనుచిత వ్యాఖ్యలతో వైసీపీలోని కొందరు నేతలూ, మంత్రులూ చెలరేగిపోతూ ఉంటారు.
ఇప్పటి వరకూ వైసీపీలో జరిగింది అదే. కొందరు ఇంకా చేస్తున్నదీ అదే. కానీ ఇక పుట్టి మునగడం ఖాయం అన్న నిర్ణయానికి వచ్చిన తరువాత వైసీపీ నేతలలో ముఖ్యంగా ఎమ్మెల్యేలలో భయం పోయింది. మొహమాటం వదిలిపోయింది. తిరుగుబాటుకు సైతం సై అనే పరిస్థితి వచ్చింది. రాజీనామాల బాట పడుతున్న వారి సంఖ్య పెరిగింది. అలా రాజీనామా చేసిన వారిలో అధినేత జగన్ కు అత్యంత సన్నిహితులుగా ముద్ర పడిన ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి వారూ ఉన్నారు.
గడచిన నాలుగున్నరేళ్ల పాలనలో జగన్ సర్కార్ ఏం చేసింది అని వెనక్కి తిరిగి చూసుకుంటే, మెరుపులు కనిపించవు. కేవలం మరకలే కనిపిస్తాయి. కానీ దురదృష్టం ఏమంటే ముఖ్యమంత్రి జగన్ మాత్రం తన పాలన అంతా మెరుపులే.. మరకలు లేవు అంటారు. తన పార్టీ వారినీ అదే అనమంటారు. పైపెచ్చు ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు గుప్పిస్తారు. తాను గొప్పగా పాలన సాగిస్తుంటే.. ఓర్వలేక విమర్శిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తారు. కనీస మర్యాద కూడా ఇవ్వకుండా దూషణల పర్వానికి దిగుతారు. ఒక ముఖ్యమంత్రిగా ఉపయోగించకూడని భాష ఉపయోగిస్తారు. అదే సమయంలో మైమరచిపోయి ఆత్మస్థుతి చేసుకుంటారు.
రాష్ట్రం ఎదుర్కుంటున్న సమస్యలు గురించి కానీ, రాష్ట్ర ప్రజలు మనసా వాచా కోరుకునే, ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్ట్, తాను హామీ ఇచ్చిన మద్య నిషేధం వంటి వాటి ఊసెత్తరు. నాలుగున్నరేళ్ల తన పాలనలో రాష్ట్ర ప్రజల నెత్తిన పెరిగిన అప్పుల భారం గురించి నోరెత్తరు. అసలు సమస్యల ప్రస్తావనే ఉండదు. పరనింద తప్ప.
అయితే రాజదాని మొదలు. మద్యం పాలసీ వరకు ఇచ్చిన మాట తప్పి, మడమ తిప్పి నాలుగున్నరేళ్లలోనే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిన జగన్ పాలనకు ఒక్క ఛాన్స్ ఇచ్చి తప్పుచేశామని తలలు పట్టు కుంటున్న జనం , జగన్ రెడ్డి తమ తప్పులు తెలుసుకోకుండా, దిద్దుబాటు చర్యలు లేకుండా ఇంకొక ఛాన్స్ .. అంటే ..ఇక చాలు జగన్ అంటున్నారు. బై .. బై .. జగన్ అంటు న్నారు. అయితే జగన్ కు వాస్తవాలు తెలుసుకోవడం కంటే భ్రమల్లో ఊరేగడమే ఇష్టం. ఎన్నికల ముంగిట ఆయన అదే పని చేస్తున్నారు. ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చిన తరువాత కూడా ఆయన జనాన్నే నిందిస్తారు. ఐదేళ్ల పాటు బటన్లు నొక్కి సొమ్ములు పందేరం చేసినా నన్ను కాదంటారా అంటూ శాపనార్ధాలు పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదని పరిశీలకులు అంటున్నారు.