Leading News Portal in Telugu

IND Vs SA: దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్.. భారత జట్టులో అతడు ఉంటే కథ వేరేలా ఉండేది!


IND Vs SA: దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్.. భారత జట్టులో అతడు ఉంటే కథ వేరేలా ఉండేది!

Sunil Gavaskar Says Ajinkya Rahane is Good Batter in overseas: సెంచూరియన్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత బ్యాటర్లు దక్షిణాఫ్రికా పేసర్ల ముందు తలొంచారు. రబాడ, బర్గర్‌ నిప్పులు చేరగడంతో భారత టాపర్డర్‌ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టగా.. మిడిలార్డర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ మాత్రం క్రీజులో నిలబడ్డాడు. పేసర్లకు స్వర్గధామం లాంటి పిచ్‌పై.. ప్రతికూల పరిస్థితుల్లో రాహుల్‌ ఒక్కడే నిలబడ్డాడు. పోరాటం ఫలితంగా తొలి రోజు ఆటముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది.

తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాటింగ్ చూసిన మాజీ ఆటగాడు సునీల్‌ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి కష్టతరమైన పరిస్థితులలో సీనియర్ బ్యాటర్ అజింక్యా రహానే జట్టులో ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. ‘ఐదేళ్ల క్రితం జోహన్నెస్‌బర్గ్ టెస్టులో పిచ్ గురించి పెద్ద చర్చ జరిగింది. అప్పుడు నేను అక్కడ ఉన్నాను. దక్షిణాఫ్రికా బౌలర్లు నిప్పులు చేరిగారు. బౌన్సీ పిచ్‌లపై బ్యాటింగ్‌ చేయడం అంత సులువు కాదు. కానీ అజింక్యా రహానే మాత్రం అద్బుతంగా ఆడాడు. మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమైన రహానే.. మూడో టెస్టులోకి 48 పరుగులతో జట్టును గెలిపించాడు’ అని సన్నీ అన్నాడు.

‘ప్రస్తుత భారత జట్టులో అజింక్యా రహానే ఉండాల్సింది. ఎందుకంటే విదేశీ పరిస్థితుల్లో రహానేకు ఎంతో అనుభవం ఉంది. అతడు ఈ టెస్టులో కూడా ఉండి కథ పూర్తి భిన్నంగా ఉండేది. ఓవర్సీస్‌లో జింక్స్ చాలా మంచి ఆటగాడు. బహుశా అతను ఈ రోజు అక్కడ (సెంచూరియన్‌ టెస్ట్) ఉండి ఉంటే.. కథ పూర్తి భిన్నంగా ఉండేది’ అని స్టార్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీల్‌ గవాస్కర్ చెప్పుకొచ్చాడు. రహానే చివరగా భారత్ తరుపున గత జూలైలో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ ఆడాడు. ఈ సిరీస్‌లోని రెండు టెస్టుల్లో కేవలం 11 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడిపై వేటు పడింది.