Leading News Portal in Telugu

ఆయేషా హత్య కేసు.. దర్యాప్తు వివరాలు అందజేయండి.. సీబీఐకి ఏపీ హైకోర్టు ఆదేశాలు


posted on Dec 27, 2023 10:33AM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసు విచారణపై ఏపీ హైకోర్టు జోక్యం చేసుకుంది. ఆయేషా హత్య కేసులో  జరిగిన దర్యాఫ్తు వివరాలను కోర్టుకు అందజేయాలని సీబీఐ అధికారులను హైకోర్టు ఆదేశించింది.  ఆయేషా హత్య జరిగి ఐదేళ్లు దాటినా కేసు దర్యాఫ్తులో పురోగతి లేదంటూ ఆయేషా తల్లిదండ్రులు హైకోర్టు తలుపు తట్టారు. కోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని  పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను పరిశీలించిన హైకోర్టు.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ అధికారులను ఆదేశించింది.  2007 డిసెంబర్ 27 న ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేటు హాస్టల్ లో బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా అనుమానాస్పద రీతిలో మరణించింది. ఈ ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

తమ కుమార్తె హత్య కేసును మళ్లీ విచారించాలని 2018 లో ఉమ్మడి హైకోర్టు తీర్పిచ్చిన విషయాన్ని ఆయేషా తల్లిదండ్రులు శంషాద్‌ బేగం, సయ్యద్‌ ఇక్బాల్‌ బాషా తమ పిటిషన్ లో ప్రస్తావించారు. విజయవాడ మహిళా సెషన్స్‌ కోర్టులో ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను ధ్వంసం చేసింది ఎవరో తేల్చాలని అప్పట్లో కోర్టు ఆదేశించిన విషయాన్ని గుర్తుచేశారు. దర్యాఫ్తును సీబీఐ సాగదీస్తోందని ఆరోపిస్తూ.. దర్యాఫ్తును పూర్తిచేసేందుకు గడువు నిర్ణయించాలని కోరారు. ఈ పిటిషన్ ను పరిశీలించిన హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలంటూ హైదరాబాద్, విశాఖపట్నం సీబీఐ అధికారులకు, కేంద్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. పిటిషన్ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.