posted on Dec 27, 2023 2:09PM
రేపటి నుంచి ప్రజాపాలన దరఖాస్తులు తీసుకుంటామని, ఆ దరఖాస్తుల వివరాల ఆధారంగా కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం తెలిపారు. డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని వెల్లడించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు పని చేయాలని మంత్రి సూచించారు. రెవెన్యూ.. పోలీసు అధికారులను కూడా తాను విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. అధికారులు… ప్రజలకు ఇరవై నాలుగు గంటలూ అందుబాటులో ఉండాలని హితవు పలికారు.
రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాపాలన దరఖాస్తుల విడుదల అనంతరం ఆయన మాట్లాడారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ లేకుండా పరీక్షల ప్రక్రియ జరగదని స్పష్టం చేశారు. టీఎస్పీఎస్సీ సభ్యులు ఇప్పటికే రాజీనామాలను సమర్పించారని… గవర్నర్ నిర్ణయం అనంతరం కొత్త బోర్డును ఏర్పాటు చేసి చైర్మన్, సభ్యులను నియమిస్తామన్నారు. ఆ తర్వాత నియామకాలు చేపడతామని హామీ ఇచ్చారు. రైతుబంధుకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి పరిమితిని విధించలేదని తెలిపారు.
ఈనెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించి ఆరు గ్యారంటీల అమలకు దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం జరిగిన సమావేశంలో కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఆరు గ్యారంటీల అమలుకు రేషన్ కార్డు ప్రామాణికం కానుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సమయం తక్కువగా ఉన్నందున కొత్త రేషన్ కార్డుల జారీ పక్రియ కదరదు. అందువల్ల పాత రేషన్ కార్డులు ఉన్న లబ్ధిదారుల నుంచి తొలుత దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది.
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. చాలా ఏళ్లుగా రేషన్ కార్డులు మంజూరు చేయకపోవటంతో దాదాపు లక్ష కుటుంబాలు తెల్లరేషన్ కార్డుల కోసం వేచి చూస్తున్నారు. రేషన్ కార్డులు మంజూరు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పటంతో ఇప్పటికే సంబధిత పత్రాల కోసం మీసేవా, ఆధార్ కేంద్రాలకు క్యూ కడుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి మరికొంత సమయం పట్టేలా ఉంది.