
Indian team really misses Mohammed Shami says Dinesh Karthik: సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో టీమిండియాపై దక్షిణాఫ్రికా పైచేయి సాధిస్తోంది. భారత్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 245 పరుగులకే ఆలౌట్ చేసిన ప్రొటీస్.. రెండో రోజు ఆట ముగిసేసరికి తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్స్ కోల్పోయి 256 రన్స్ చేసింది. ఓపెనర్ డీన్ ఎల్గర్ (140 నాటౌట్) సెంచరీతో చెలరేగగా.. డేవిడ్ బెడింగ్హామ్ (56) హాఫ్ సెంచరీ చేశాడు. భారత బౌలర్లలో పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ సిరాజ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. ప్రసిద్ద్ కృష్ణ ఒక్క వికెట్ పడగొట్టినా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఇక శార్ధూల్ ఠాకూర్ విఫలమయ్యాడు.
ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు సీనియర్ పేసర్ మహమ్మద్ షమీని మిస్ అయిందని, అతడు ఉంటే అద్భుతాలు చేసేవాడు అని అభిప్రాయపడ్డాడు. క్రిక్‌బజ్‌తో దినేష్ కార్తీక్ మాట్లాడుతూ… ‘మహమ్మద్ షమీ బౌలర్‌గా, పేస్ నాయకుడిగా ఎదిగాడు. అతను జస్ప్రీత్ బుమ్రాకు సరైన జోడి. ఈ పిచ్‌లో సీమ్‌తో అద్భుతాలు చేసేవాడు. షమీ ఖచ్చితంగా కొన్ని వికెట్లు పడగొట్టేవాడు. షమీని భారత జట్టు మిస్ అవుతోంది. అందులో ఎటువంటి సందేహం లేదు’ అని అన్నాడు. చీలమండ గాయం కారణంగా షమీ దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు.
జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ బాగా బౌలింగ్ చేసినప్పటికీ.. వారికి ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్ నుంచి తగినంత మద్దతు లభించలేదని దినేష్ కార్తీక్ పేర్కొన్నాడు. ‘శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ధ్ కృష్ణ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. వీరిద్దరు కేవలం 27 ఓవర్లలనే 118 పరుగులు ఇచ్చారు. సిరాజ్ వికెట్లు తీసినప్పటికీ.. కొంచెం ఎక్కువగానే పరుగులు ఇచ్చాడు. చివరి స్పెల్‌లో మాత్రం అద్భుతమైన బంతులను వేశాడు. అతడి బౌలింగ్ చూస్తే 1-2 వికెట్లు పడగొట్టగలడనే నమ్మకం కలిగింది. మూడో రోజు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి దక్షిణాఫ్రికాను ఆలౌట్ చేస్తే మ్యాచ్ మలుపు తిరగవచ్చు’ అని డీకే తెలిపాడు.