Leading News Portal in Telugu

ప్రజాపాలన, ప్రత్యర్థులకు మన్నన.. సీఎం రేవంత్ పై ప్రశంసలు | praise on revanth| democratic| sprit| respect| opponents| peoples| friendly


posted on Dec 29, 2023 2:00PM

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి, రేవంత్ రెడ్డి సీఎంగా పదవీ బాధ్యతలు తీసుకుని నిండా నెలరోజులు కాలేదు. అయినా అప్పుడే ఆయనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం కాన్వాయ్ కారణంగా సాధారణ ప్రయాణీకులకు ఇబ్బంది కలగకూడాదన్న ఆదేశాలు ఇవ్వడం ఆయన నిరాడంబరతను తేటతెల్లం చేస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో దాదాపు తొమ్మిదేళ్ల తరువాత ఇప్పుడు ప్రజాస్వామ్య పోకడలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. రాజకీయ విలువలకు రేవంత్ సర్కార్ మళ్లీ వలువలు తొడిగిందన్న అభిప్రాయం ప్రజాస్వామ్య వాదులలో వ్యక్తం అవుతోంది. సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచే తమది ప్రజా ప్రభుత్వం అని రుజువు చేసేందుకు కంకణం కట్టుకున్నారా అన్నట్లుగా ఆయన అడుగులు ఉన్నాయి. ప్రగతి భవన్ ముందు ఇనుప కంచెలు తొలగించడం నుంచీ, సచివాలయంలోని ప్రవేశంపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయడం ద్వారా రేవంత్ ప్రజల మన్ననలు పొందే విధంగా వ్యవహరించారు.  అదే సమయంలో ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యాంరటీల వాగ్దానం అమలు దిశగా వేగంగా కదులుతున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, బీమా పదిలక్షలకు పెంపు వంటి హామీలను అధికారపగ్గాలు అందుకున్న వెంటనే అమలు చేయడంతో పాటు మిగిలిన ఆరు హామీల అమలు దిశగా వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే పాలనపైనే కాకుండా పార్టీపైన కూడా రేవంత్ పూర్తి స్థాయి పట్టు సాధించినట్లే కనిపిస్తున్నది. తెలంగాణ ముఖ్యమంత్రి పీఠం కోసం రేవంత్ తో చివరి క్షణం వరకూ పోటీ పడిన మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదే విధంగా తనకు కాంగ్రెస్ అధిష్ఠానం టీపీసీసీ పగ్గాలు అప్పగించిన క్షణం నుంచి ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, రేవంత్ కు వ్యతిరేకంగా పని చేయడమే ఎజెండాగా వ్యవహరించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డిలను కేబినెట్ లోకి తీసుకోవడమే కాకుండా ప్రధానమైన శాఖలను అప్పగించి.. వారిలో తన పట్ల వ్యతిరేకతను తగ్గించుకున్నారు.

అదే  విధంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తనను కనీసం అభినందించని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గాయపడి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతుంటే రేవంత్ మర్యాదపూర్వకంగా ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.  రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధానిని కనీసం కలుసుకోవడానికి కూడా ఇష్టపడని, ప్రొటోకాల్ ను, మర్యాదనూ కూడా పక్కన పెట్టేసిన ముఖ్యమంత్రిని చూసిన తెలంగాణ ప్రజ.. గెలిచిన తరువాత హస్తిన వెళ్లి మరీ ప్రధానిని మర్యాదపూర్వకంగా కలిసి, రాష్ట్రానికి రావలసిన నిధులు అందించి రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని కోరిన సీఎం రేవంత్ ను అభినందిస్తున్నారు. రాష్ట్రం, కేంద్రం మధ్య సంబంధాలు మెరుగుపడితేనే అభివృద్ధి పరుగులు పెడుతుందని అంటున్నారు. 

 అన్నిటికీ మించి అసెంబ్లీ సమావేశాలంటే విపక్షాలను సభ నుంచి బయటకు పంపేసి.. ప్రజాస్వామ్యం కాదు, ఏక పార్టీ స్వామ్యం అన్నట్లుగా ఇన్నాళ్లుగా నడిచిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనం అన్నట్లుగా నిర్వహించారు.  రాష్ట్ర ముఖ్యమంత్రిగా పాలనా వ్యవహారాలలో వ్యక్తిగత, రాజకీయ విభేదాలను తావివ్వని సత్సాంప్రదానికి రేవంత్ తిరిగి ప్రాణ ప్రతిష్ఠ చేశారు.   తమ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడబోదని, గత ప్రభుత్వంలో జరిగిన పొర పాట్లను సరిచేసుకుంటూనే మెరుగైన పాలనను ప్రజలకు చేరువ చేస్తామని ప్రకటించిన విధంగానే కార్యాచరణ అమలుకు చర్యలు చేపట్టారు. 

అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పదం కావడంతో పాటు, అనేక ఇబ్బందులు, ఇక్కట్లకు కారణమైన గత ప్రభుత్వ జిల్లాల పునర్వ్యవస్థీకరణపై దృష్టి సారించి లోటుపాట్లను సవరించి అవసరమైతే జిల్లాల పునర్వ్యవస్థీకరణలో అవసరమైన మార్పులు చేర్పులూ చేయాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది.  కొత్త జిల్లాల ఏర్పాటు హేతురహితంగా, మాజీ ముఖ్యమంత్రి ఇష్టానుసారంగా జరిగిదని రేవంత్ ప్రభుత్వం భావిస్తోంది.  ఈ నేపథ్యంలోనే  జిల్లాల సరిహద్దుల మార్పులు, చేర్పుల విషయంలో అధ్యయనం చేసేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేసేందుకు రేవంత్ సర్కార్ సమాయత్తమౌతోందని అధికార వర్గాల సమాచారం.  

ప్రస్తుతం అమల్లో ఉన్న 33 జిల్లాల విషయంలోమార్పులు, చేర్పులన్నీ ప్రజాభిప్రాయం మేరకే జరపాలని ప్రభుత్వం భావిస్తోందనీ, ఇందు కోసం ప్రతిపాదిత మార్పులు, చేర్పులపై ప్రజాభిప్రాయ సేకరణకు రేవంత్ సర్కార్సమాయత్తమౌతోందని తెలుస్తోంది.  ఈ ప్రజాభిప్రాయ సేకరణ కోసం  ఓ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు చర్చ అధికారవర్గాలు చెబుతున్నాయి.  ప్రజాభిప్రాయం మేరకు జిల్లాల సరిహద్దుల మార్పులూ చేర్పులూ చేపట్టాలని రేవంత్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.