Leading News Portal in Telugu

Israeli Army Fires: గాజా నుంచి తిరిగి వస్తున్న సహాయ కాన్వాయ్‌పై ఇజ్రాయెల్ ఆర్మీ కాల్పులు


Israeli Army Fires: గాజా నుంచి తిరిగి వస్తున్న సహాయ కాన్వాయ్‌పై ఇజ్రాయెల్ ఆర్మీ కాల్పులు

ఇజ్రాయెల్ ఆర్మీ తాజాగా మరోసారి గాజాపై కవ్వింపులకు పాల్పడింది. గాజా నుంచి తిరిగి వస్తున్న సహాయ కాన్వాయ్‌పై ఇజ్రాయెల్‌ సైనికులు కాల్పులు జరిపారు. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి సహాయ సంస్థ ఈ ఘటనను వెల్లడించింది. అయితే ఈ కాల్పుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని స్పష్టం చేసింది. కాగా గాజాపై ఇజ్రాయెల్‌ ఆర్మీ బాంబు దాడుల్లో ఇప్పటికే 20,000 మందికి పైగా పాలస్తీనా ప్రజలు మరణించగా.. వేల సంఖ్యలో గాయపడ్డారు. అయితే గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటనపై యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ డైరెక్టర్ టామ్ వైట్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

ఐక్యరాజ్యసమితి.. ఏజెన్సీ ద్వారా గాజాలోని పాలస్తీనా శరణార్థులకు సహాయ సామాగ్రిని అందజేస్తున్నారు. ఈ క్రమంలో ఉత్తర గాజా నుంచి తిరిగి వస్తున్న సహాయ కాన్వాయ్‌పై ఇజ్రాయెల్ సైనికులు కాల్పులు జరిపినట్లు ఆయన వెల్లడించారు.ఈ ఘటనలో సమయంలో కాన్వాయ్‌లో ఉన్న అంతర్జాతీయ కాన్వాయ్ నాయకుడు, ఆయన బృందం సురక్షితంగా బయటపడ్డారని, ఇజ్రాయెల్‌ ఆర్మీ కాల్పుల్లో ఒక వాహనానికి నష్టం జరిగిందన్నారు. మరోవైపు గాజాలో బందీగా ఉన్న ముగ్గురు సొంత పౌరులపై ఇజ్రాయెల్‌ సైనికులు కాల్పులు జరిపి చంపారు. ఇటీవల జరిగిన ఈ సంఘటనపై ఇజ్రాయెల్‌ బందీల కుటుంబాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. తమ వారిని విడిపించేందుకు హమాస్‌తో చర్చలు జరుపాలని డిమాండ్‌ చేస్తున్నారు.