సిట్టింగుల మార్పు పంచాయతీలన్నీ తాడేపల్లి ప్యాలస్ కే.. వైసీపీలో పతాక స్థాయికి సంక్షోభం! | crisis peak in ycp| sittings| change| tadepalli| palace| mlas
posted on Dec 30, 2023 11:10AM
అధికార వైసీపీలో సంక్షోభం మొదలైంది. రాష్ట్రంలో ఎన్నికల హీట్ పెరగడంతోనే వైసీపీలో ఆందోళన స్టార్ట్ అయ్యింది. ఓటమి భయంతో వైసీసీ అధినేత పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల మార్పు చేపట్టారు. అయితే జగన్ నిర్ణయం పార్టీలో కాక రేపుతోంది. సీనియర్లు జూనియర్లు అని లేకుండా జగన్ మొండి నిర్ణయాలతో పార్టీలో ఇప్పుడు సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి.
ఇప్పటికే 11 మందిని మార్చేశారు. ఇప్పుడు రెండో విడత మార్పులకు సంప్రదింపులు, కసరత్తులు పూర్తయ్యాయి. దీంతో స్థానాల మార్పుకు ససేమీరా అంటున్న కొందరు ఎమ్మెల్యేలు, అసలు ఈసారి సీట్లు దక్కని ఎమ్మెల్యేలు ధిక్కార స్వరం గట్టిగానే వినిపిస్తున్నారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలను ఏ మాత్రం పట్టించుకోకుండా జగన్ రెండో జాబితా ప్రకటనకు సిద్ధమయ్యారు. శనివారం (డిసెంబర్ 30) ఈ రెండో విడత మార్పులును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి శుక్రవారమే (డిసెంబర్ 29) ఇందుకు సంబంధిత అధికారిక ప్రకటన వెలువడుతుందని అంతా భావించారు. తాడేపల్లి జగన్ ప్యాలెస్ లో వైసీపీ ఎమ్మెల్యేల హడావుడి కూడా కనిపించింది. కానీ కారణాలేంటో తెలియదు కానీ సదరు ప్రకటన విడుదల కాలేదు. రెండో జాబితాలో మార్పులూ చేర్పులూ ఇవేనంటూ ఓ జాబితా సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతుంది.
వైసీపీ అభ్యర్థుల మార్పు జాబితాలో 35మంది అభ్యర్థులు ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ వర్గాల ద్వారా అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం దాదాపు ఖరారు అయిన ఎమ్మెల్యేల పేర్లు ఇలా ఉన్నాయి. విశాఖ నార్త్ నుండి కేకే రాజు, మాడుగుల నుండి బూడి ముత్యాల నాయుడు, రాజమండ్రి సిటీ నుంచి ఎంపీ మార్గాని భరత్, నర్సీపట్నం నుండి పెట్ల ఉమాశంకర్ గణేష్, తుని దాడిశెట్టి రాజా, జగ్గంపేట తోట నరసింహం, పెద్దాపురం దావులూరి దొరబాబు, పత్తిపాడు వరుపులు సుబ్బారావు. పిఠాపురం వంగా గీత, ముమ్మిడివరం పొన్నాడ సతీష్, భీమవరం గ్రంధి శ్రీనివాస్, మంగళగిరి గంజి చిరంజీవి, తణుకు కారుమూరి నాగేశ్వరరావు, నూజివీడు మేక వెంకట ప్రతాప్ అప్పారావు, కైకలూరు దూలం నాగేశ్వరరావు, తంబళ్లపల్లి పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, విజయవాడ ఈస్ట్ దేవినేని అవినాష్, మచిలీపట్నం పేర్ని కిట్టు, గన్నవరం వల్లభనేని వంశీ, గుడివాడ కొడాలి వెంకటేశ్వర రావు(నాని), తెనాలి అన్న బత్తుని శివకుమార్, వినుకొండ బొల్లా బ్రహ్మనాయుడు, గురజాల కాసు మహేష్ రెడ్డి లేదా జంగా కృష్ణమూర్తి, మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కోవూరు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి లేదా రంజిత్ రెడ్డి, సర్వేపల్లి కాకాని గోవర్ధన్ రెడ్డి, కందుకూరు మహీధర్ రెడ్డి, ఆత్మకూరు మేకపాటి విక్రం రెడ్డి, ఉదయగిరి మేకపాటి రాజగోపాల్ రెడ్డి, తిరుపతి భూమన అభినయ రెడ్డి, చంద్రగిరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, వెంకటగిరి నేదురుపల్లి రామ్ కుమార్ రెడ్డి, సత్యవేడు నారాయణస్వామి లేదా కోనేటి ఆదిమూలం, పుంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కుప్పం కె. ఆర్. జె భరత్, జమ్మలమడుగు వైయస్ అవినాష్ రెడ్డి లేదా సుధీర్ రెడ్డి, ప్రొద్దుటూరు ఆర్ శివ ప్రసాద్ రెడ్డి, పులివెందుల వైయస్ జగన్మోహన్ రెడ్డి, డోన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పాణ్యం కాటసాని రాంభూపాల్ రెడ్డి లేదా ఆయన కుమారుడు, మంత్రాలయం వై బాలనాగిరెడ్డి, ఆదోని వై సాయి ప్రసాద్ రెడ్డి, రాప్తాడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, తాడిపత్రి కేతిరెడ్డి పెద్దారెడ్డి, పెనుగొండ కె.వి ఉషశ్రీ చరణ్, ధర్మవరం కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.
కాగా నియోజకవర్గ మార్పునకు ఇష్టపడని ఎమ్మెల్యేలు, సీట్లు దక్కని ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తిలో ఉండగా.. వీరిని బుజ్జగించే పనిని రీజినల్ కోఆర్డినేటర్లకు అధిష్టానం అప్పగించింది. అయితే, రీజనల్ కోఆర్డినేటర్లు ఈ బుజ్జగింపులు తమ వల్ల కాదంటూ చేతులు ఎత్తేస్తున్నారు. దీంతో అన్ని పంచాయతీలు తాడేపల్లి ప్యాలెస్ కే చేరుతున్నాయి. వీటిని పరిష్కరించలేక జగన్ తల పట్టుకుంటున్నట్లు చెబుతున్నారు. మరోవైపు జగన్ మాటలకు కూడా మెత్తబడని ఎమ్మెల్యేలు అధిష్టానంపై తిరుగుబాటుకి సిద్ధమవుతున్నారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నారాంబాబు, పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పార్థసారథి అధిష్టానంపై అసహనం వ్యక్తం చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే వెళ్లిపోయేవారు తమ వారు కాదని, గెలవని అభ్యర్థులకు టికెట్లు ఇచ్చి పార్టీకి నష్టం కలిగించలేమని అంటూ జగన్ అసంతృప్తులను మరింత రెచ్చగొడుతున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు కొత్త ఇంచార్జిల ఓటమి కోసమే పనిచేస్తామని అసంతృప్త ఎమ్మెల్యేలు రివర్స్ అవుతున్నారు. దీంతో వైసీపీలో సంక్షోభం ముదిరి పాకాన పడినట్లైంది. ఇది ఎన్నికల సమయానికి మరింత తీవ్రమై పార్టీ పుట్టి ముంచే సూచనలు కనిపిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.