Leading News Portal in Telugu

మంగళగిరి వైసీపీ కార్యాలయంలో షర్మిల ఫొటోలు.. ఆర్కే తన రూటెటో చెప్పేశారుగా?! | jagan photos removed in mangalagiri ycp office| rk| sharmila| congress| several| mlas


posted on Dec 30, 2023 10:16AM

తాడేపల్లి ప్యాలెస్ కు కూతవేటు దూరంలో ఉన్న మంగళగిరిలో వైసీపీ పరిస్థితి పూర్తిగా అగమ్యగోచరంగా మారిపోయింది. పార్టీ కార్యాలయంలో కాగడా పెట్టి వెతికినా ఒక్కటంటే ఒక్కటి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ ఫొటో కనిపించడం లేదు. సిట్టింగులను మార్చాలన్న నిర్ణయంతో విభేదించి పార్టీకీ, ఎమ్మెల్యే సభ్యత్వానికీ రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మంగళగిరి వైసీపీ కార్యాలయంలో ఉన్న సీఎం జగన్మోహనరెడ్డి ఫొటోలను పూర్తిగా తొలగించేశారు. ఇప్పుడు ఆ కార్యాలయంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన కుమార్తె షర్మిల ఫొటోలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఏపీ రాజకీయాలలో షర్మిల కీలక పాత్ర పోషించనున్నారన్న వార్తల నేపథ్యంలో ఈ పరిణామం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. షర్మిల తన వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసి, ఆ పార్టీ ఏపీ పగ్గాలు చేపట్టనున్నారని కాంగ్రెస్ వర్గాలే చెబుతున్నాయి. అదే జరిగితే వైసీపీ నుంచి పెద్ద సంఖ్యలో అసమ్మతి, అసంతృప్తి నేతలు హస్తం గూటికి చేరే అవకాశాలున్నాయని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ విశ్లేషణలకు బలం చేకూర్చే విధంగా మంగళగిరి వైసీపీ కార్యాలయంలో జగన్ ఫొటోల తొలగింపు కార్యక్రమం జరిగింది.  

2019 ఎన్నికలలో  తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాజకీయ ప్రత్యర్థి, వైసీపీ కీల‌క నేత, మంగ‌ళ‌గిరి శాస‌న స‌భ్యుడు ఆళ్ల రామ‌కృష్ణారెడ్డికి అప్పటి ఎన్నికల ప్రచార సమయంలోనే జగన్ గెలిస్తే మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. అయితే ఆ హామీని నిలబెట్టుకోలేదు. తొలి కేబినెట్ లోనే కాదు, ఆ తరువాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలోనూ ఆర్కేకు జగన్ మొండి చేయే చూపారు. అయినా ఓర్చుకుని ఆర్కే జగన్ కోసం నిలబడ్డారు.   వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కంటే ఆళ్ల రామకృష్ణారెడ్డే  అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంపై ఎక్కువగా పోరాడారు. నూతన రాజధానికి అతి దగ్గరలో ఉండే ఆర్కే.. అదే స్థాయిలో  తెలుగుదేశం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంలో చాలా యాక్టివ్ గా ఉండేవారు. ఇంకా చెప్పాలంటే జగన్ కోసం సుదీర్ఘ రాజకీయ భవిష్యత్ ఉన్న ఆర్కే సూటిగా చంద్రబాబుతోనే తలపడ్డారు. హైకోర్టు, సుప్రీంకోర్టుల చుట్టూ తిరిగి తెలుగుదేశం నేతలు, అమరావతిపై కూడా వ్యక్తిగతంగా కేసులు వేశారు. అలాంటి నేత వైసీపీకి, ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేశారంటే జగన్ ఆయనను ఎంతగా పక్కన పెట్టేసి ఉంటారో అర్ధం చేసుకోవచ్చు.

 అయితే ఆర్కే రాజీనామా వెనక‌ చాలా  కార‌ణాలు ఉన్నాయని అంటున్నారు. వీటిని ఆర్కే పైకి చెప్ప‌క‌ పోయినా వైసీపీలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయన్నది అందరికీ అర్ధమైపోయింది.  వాస్తవానికి ఆర్కేను పక్కన పెట్టేయడానికే  టీడీపీ నుంచి వ‌చ్చిన గంజి చిరంజీవికి జగన్ ప్రాధాన్యత పెంచుతూ వచ్చారు.  ముందుగా చిరంజీవిని వైసీపీ చేనేత విభాగం అధ్యక్షుడిగా, తరువాత ఆప్కో చైర్మన్ గా నియమించారు. దీంతో  మంగళగిరిలో గంజి చిరంజీవి ఒక  అధికార కేంద్రంగా మారిపోయారు.  ఆ తర్వాత గత ఎన్నికల్లో తన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన వేమారెడ్డిని  తాడేపల్లి నగర పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. దీంతో వేమారెడ్డి మంగళగిరిలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి దానిని చిరంజీవితో ప్రారంభింపచేశారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కూడా మరో వర్గాన్ని ఏర్పాటు చేసుకొని నియోజకవర్గంలో గ్రూపు కట్టారు. అన్నీ తెలిసినా చూస్తూ ఉండడం తప్ప ఆర్కే ఏమీ చేయలేకపోయారు.  చివరికి చిరంజీవినే  మంగళగిరి నియోజకవర్గ ఇన్ చార్జిగా ప్రకటించడంలో ఆర్కే ఇక రాజీనామా తప్ప మరో మార్గం లేదన్న నిర్ణయానికి వచ్చేశారు. రాజీనామా చేసేశారు.

ఇక ఇప్పుడు ఆయన అడుగులు ఎటు అన్నదానికి మంగళగిరిలో తన ఆధ్వర్యంలో ఉన్న వైసీపీ కార్యాలయంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ ఫొటోలు తీసేయడమే కాకుండా, వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటోలతో పాటు.. నేడో, రేపో రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు చేపట్టనున్నట్లుగా ప్రచారం జరుగుతున్న వైఎస్ షర్మిల ఫొటోలు కూడా పెట్టడం ద్వారా తేటతెల్లం చేశారు. షర్మిల ఏపీ కాంగ్రెస్ లో కీలకంగా వ్యవహరించనున్నారన్న వార్తల నేపథ్యంలో తాను షర్మిల వెంట నడవడానికి నిర్ణయించుకున్నట్లు ఆర్కే తన చర్య ద్వారా స్పష్టం చేశారు. షర్మిల కాంగ్రెస్ గూటికి చేరగానే ఆర్కే బాటలో పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులు కూడా నడిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషించిన సంగతి తెలిసిందే.   

కాగా వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికీ, ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేసిన  తర్వాత ఇన్నాళ్లకు ఆళ్ల తొలిసారిగా గళం విప్పారు. పార్టీలో తనను పొమ్మన లేకపొగబెట్టారని కుండబద్దలు కొట్టారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి ఏపీ రాజకీయాలలో కీలకంగా వ్యవహరిస్తే తానూ ఆమె వెంటే నడుస్తానని మంగళగిరిలో విలేకరుల సమావేశం పెట్టి మరీ వెల్లడించారు. తాను జగన్ ను నమ్ముకుని వైసీపీ కోసం ఎంతో చేశారననీ, సర్వం పోగొట్టుకున్నాననీ ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ కుటుంబానికి చెందిన వ్యక్తిగా షర్మిల ఏపీ రాజకీయాలలోకి వస్తే తాను ఆమె వెంటే ఉంటానని చెప్పారు.  తన రాజీనామా ఆమోదించడం, ఆమోదించకపోవడం అన్నది వాళ్లిష్టం అన్న ఆళ్ల తాను  స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా ఇచ్చానన్నారు.