తూర్పు వైసీపీలో ముసలం.. జ్యోతుల చంటిబాబుతో వలసలు షురూ!? | jaggampet ycp mla jyothula chantibabu meet| pawan| sitting| ruling| party| disacord
posted on Dec 30, 2023 9:14AM
సిట్టింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల మార్పు వైసీపీలో వలసల పర్వానికి తెరలేపిందా? అంటే జరుగుతున్నపరిణామాలను బట్టి ఔననే చెప్పాల్సి వస్తోంది. ఇప్పటికే పార్టీలో అసమ్మతి బహిర్గతమై.. అసంతృప్తి తారస్థాయికి చేరి.. తిరుగుబాటుకు రంగం సిద్ధమైందన్న వార్తల నేపథ్యంలో జగన్ అండ్ కో ఎమ్మెల్యేలను బుజ్జగించి సముదాయించడానికి చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదనే చెప్పాలి. కొందరైతే తాడేపల్లి ప్యాలస్ పిలుపు అందుకున్నా ఏవో కారణాలు చెప్పి ముఖం చాటేస్తున్నారు. మరి కొందరైతే వచ్చే ఎన్నికలలో తాము పోటీకి దూరంగా ఉంటామని తేల్చి చెప్పేస్తున్నారు. మరి కొందరు అయిష్టంగానే అధిష్ఠానం మాటను ఔదాల్చుతున్నారు.
ఏది ఏమైనా ఎన్నికల ముందు వైసీపీలో ఆల్ ఈజ్ నాట్ వెల్ వాతావరణం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఇప్పటికే తన నియోజకవర్గ మార్పుపై బాహాటంగానే అసమ్మతి వ్యక్తం చేసిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తాజాగా జనసేనాని పవన్ కల్యాణ్ కు టచ్ లోకి వెళ్లారు. కాకినాడ పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ తో ఆయన శుక్రవారం (డిసెంబర్ 29) రాత్రి భేటీ అయ్యారు.
పవన్ కల్యాణ్ మూడు రోజుల పర్యటన కోసం కాకినాడ చేరుకున్న సంగతి తెలసిందే. పవన్ కల్యాణ్ బస వద్దకు జ్యోతుల చంటిబాబు శుక్రవారం (డిసెంబర్ 28) రాత్రి పదిన్నర గంటల సమయంలో చేరుకున్నారు. ఆయనతో పాటు దాదాపు గంట పాటు చర్చించినట్లు తెలిసింది.
ఈ సందర్భంగా వారిరువురి మధ్యా అధికార వైసీపీ సిట్టింగులను స్థానాలు మార్చడంపై చర్చ జరిగినట్లు తెలిసింది. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చిట్టి బాబును కూడా నియోజకవర్గం నుంచి మార్చేయడానికి జగన్ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. జగన్ నిర్ణయం పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన చిట్టిబాబు తన కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి మరీ అధిష్ఠానాన్ని ధిక్కరించారు. జగన్ తీరుపై తీవ్ర నిరసన తెలిపారు.
ఇప్పటికే జ్యోతుల చంటిబాబు వర్గీయులు పలువురు వైకాపాకు రాజీనామా చేశారు జ్యోతుల చంటి బాబు సైతం జగన్ తీరును నిరసిస్తూ త్వరలో తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు ఇటీవలే ప్రకటించిన సగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జ్యోతుల చంటిబాబు పవన్ కల్యాణ్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.