posted on Dec 30, 2023 3:14PM
ఈటల రాజేందర్ తెలంగాణ రాజకీయాలలో పరిచయం అక్కర్లేని పేరు. వామపక్ష భావజాలం ఉన్న ఈటల తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) లో చేరి కేసీఆర్ తో కలిసి నడిచారు. రాష్ట్ర విభజన తరువాత ఏర్పడిన తొలి ప్రభుత్వంలో ఈటల కేసీఆర్ కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు. బీఆర్ఎస్ (అప్పడు టీఆర్ఎస్) వరుసగా రెండో సారి గెలిచిన తరువాత ఈటలను కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా దూరం పెట్టారు. అయితే ఆ తరువాత కేబినెట్ లోకి తీసుకుని ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు కూడా అప్పగించారు.
అయితే పార్టీ అధినేతో విభేదాలు మాత్రం ముదిరిపోయాయి. చివరకు ఆయన బీఆర్ఎస్ (టీఆర్ఎస్) నుంచి బయటకు వచ్చి బీజేపీ గూటికి చేరారు. అయితే ఈటల బీజేపీలో చేరడంపై ఆయన గురించి తెలిసిన వారంతో అప్పట్లో విస్తుపోయారు. ఈటల బీజేపీలో ఇమడటం సాధ్యం కాదన్న అనుమానాలు అప్పట్లో బలంగా వ్యక్తం అయ్యాయి. అయితే ఆయన బీజేపీలో కొనసాగారు. ఇమిడారు. సర్దుకుపోయారు. పోరాడారు. మొత్తంగా బీజేపీలో అత్యంత కీలక నేతగా ఎదిగారు. కానీ ఈటల బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి బీజేపీ తీర్ధం పుచ్చున్న నాటి నుంచీ కూడా వామపక్ష బావజాలం ఉన్న ఆయన బీజేపీలో ఎలా ఇముడుతారన్న సందేహాలే వ్యక్తం అయ్యాయి. అందుకు తగ్గట్టుగానే బీజేపీలో ఈటల పలు మార్లు ఉక్కపోతకు గురయ్యారు. రాజీనామా చేసి బయటకు వచ్చేస్తున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆయన బీజేపీలో కొనసాగారు. ఆ పార్టీ చేరికల కమిటీకి నేతృత్వం వహించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో స్టార్ క్యాంపెయినర్ గా కూడా వ్యవహరించారు.
అన్నిటికీ మించి బీజేపీ హై కమాండ్ ఆయన కోరినట్లుగా గజ్వేల్ లో కేసీఆర్ కు ప్రత్యర్థిగా పోటీ చేసే అవకాశం ఇచ్చింది. అదే సమయంలో ఆయన సొంత నియోజకవర్గం నుంచి కూడా సేఫ్ సైడ్ గా పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చింది. సాధారణంగా బీజేపీలో ఒకే వ్యక్తికి రెండు స్థానాల నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వడం చాలా అరుదు. అయితే ఈటల రెండు స్థానాల నుంచీ పరాజయం పాలు కావడంతో పార్టీలో ఆయన హవా తగ్గిందని అంటున్నారు.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో పరాజయంపాలైన ఆయన కేసీఆర్ ను ఢీ కొనే సందర్భంలో సొంత నియోజకవర్గంపై ఫోకస్ పెట్టలేకపోయాననీ అందుకే రెండు చోట్లా పరాజయం ఎదురైందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలనీ, అది కూడా బీజేపీకి కొంత బలం ఉన్న మల్కాజ్ గిరి స్థానం నుంచి పోటీ చేస్తాననీ, పార్టీ టికెట్ ఇవ్వాలనీ అంటున్నారు. అయితే ఇందుకు బీజేపీ హై కమాండ్ సుముఖంగా స్పందించలేదని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం పాలైన పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కు కరీంగన్ స్థాన నుంచి పోటీ చేసేందుకు ఇప్పటికే హై కమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందనీ, అయితే ఈటల విషయంలో మాత్రం నిర్ణయం తీసుకోలేదనీ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
తొలి నుంచీ ఈటలకు బీజేపీలోని ఒక బలమైన వర్గం వ్యతిరేకంగా పని చేస్తున్నది. అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసిన రెండు స్థానాల నుంచీ పరాజయం పాలైన తరువాత ఈటలకు ఆ వర్గం సెగ మరింత ఎక్కువైంది. ఆ వర్గమే అధిష్ఠానం వద్ద ఈటలకు లోక్ సభ టికెట్ విషయంపై గట్టిగా అభ్యంతరం చెబుతోంది. ఇక ఈటల విషయానికి వస్తే ఆయన లోక్ సభకు పోటీ చేసి గెలిస్తేనే రాజకీయంగా నిలదొక్కుకోగలుగుతారు. బీజేపీ టికెట్ ఇవ్వకపోయినా, ఒక వేళ ఇచ్చినా పోటీ చేసి ఓడిపోయినా ఈటల రాజకీయ భవిష్యత్ కు ఫుల్ స్టాప్ పడినట్టే.
అందుకే ఈటల ఈ సారి ఒకింత సేఫ్ స్థానమైన మల్కాజ్ గిరి నుంచి పోటీ చేయాలని గట్టిగా భావిస్తున్నారు. ఒక వేళ పార్టీ నిరాకరిస్తే బీజేపీ నుంచి బయటకు రావడానికి కూడా ఆయన వెనుకాడే పరిస్థితి లేదు. అందుకే ఈటల బీజేపీ వీడి కాంగ్రెస్ గూటికి చేరు అవకాశాలున్నాయని అంటున్నారు. ఈటల ఈ వార్తలను కొట్టిపారేసినప్పటికీ ఆ దిశగా ప్రచారం మాత్రం కొనసాగుతూనే ఉంది. మరి ఈటల విషయంలో బీజేపీ హై కమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.