చిరంజీవి సీఎం అవ్వాలనుకుంటే పెద్ద విషయం కాదు.. శివాజీ | chiranjeevi cm not a big matter| shivaji| politics| say| people
posted on Dec 31, 2023 10:56AM
శివాజీ.. హీరోగా, సహాయనటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఎన్నో మంచి సినిమాల్లో వివిధ పాత్రలు పోషించి తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను ఏర్పరుచుకున్నారు. ఆ తర్వాత రాజకీయ రంగంలో ప్రవేశించి వివిధ సమస్యలపై పోరాటం చేశారు. ప్రజల పక్షాన ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంతేకాదు, ఇటీవల బిగ్‌బాస్ సీజన్ 7లో పార్టిసిపేట్ చేసి మరింత పాపులారిటీ తెచ్చుకున్నారు.
తాజాగా తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలు అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘పదేళ్ళు ప్రజల సమస్యలపై ఒంటరిగా పోరాటం చేశాను. ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రశ్నిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేశాను. ప్రస్తుతం నేను ఏ రాజకీయ పార్టీలోనూ లేను. ఒకప్పుడు బిజెపిలో చేరాను. ప్రజలకు బిజెపి ఇవ్వాల్సింది ఇవ్వలేదు. అందుకే ఆ పార్టీ నుంచి బయటికి వచ్చాను. నాకూ ఓ కుటుంబం ఉంది. ఎన్నాళ్లని ఈ ఒంటరి పోరాటం చేయలను. ఇప్పుడు రాజకీయాలన్నీ కులం, మతం ప్రాతిపదికగా నడుస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవిగారి ఫ్యామిలీకి తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. వారు సీఎం అవ్వాలనుకుంటే పెద్ద కష్టమైన విషయం కాదు. ఎక్కడో చిన్న లోపం ఉంది. దాన్ని సరిచేసుకుంటే సరిపోతుంది’ అన్నారు.