Leading News Portal in Telugu

వినోద్ కు ఈడీ నోటీసులు.. బీజేపీ, బీఆర్ఎస్ రహస్య మైత్రికి నిదర్శనమేనా? | bjp brs secret friendship continue| ed| notice| vinod| kvita| ktr| congress


posted on Dec 31, 2023 11:46AM

బీజేపీ  బీఆర్ఎస్ బంధం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అనంతరం కూడా కొనసాగుతోందా? లోక్ సభ ఎన్నికలకు కూడా కాంగ్రెస్ లక్ష్యంగా ఆ రెండు పార్టీలూ కలిసే పని చేస్తున్నాయా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హిందుత్వ ఎజెండా ఎత్తుకోవడం, రాహుల్ గాంధీపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హిందూ వ్యతిరేకి అంటూ విమర్శలు చేయడం చూస్తుంటే.. లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీలు తమ రహస్య మైత్రిని కొనసాగిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇక బీజేపీ అధిష్ఠానం కూడా ఎన్నికలలో అంచనాల మేరకు రాణించలేకపోవడానికి    బీఆర్ఎస్ తో రహస్య బంధం ఉందని ప్రజలు నమ్మడమే కారణమని తెలిసినా.. ఆ బంధాన్ని కొనసాగించడానికే నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. 

అందుకే ఢిల్లీ మద్యం కుంభకోణంలో పీకల్లోతు ఇరుక్కున్న బీఆర్ఎస్ అధినేత తనయ, ఎమ్మెల్సీ కవితను కాకుండా.. కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేసుకుని కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులకు పాల్పడుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  కేంద్రంలోని మోడీ సర్కార్ తన ప్రత్యర్థులను, ప్రత్యర్థి పార్టీ నేతలను వేధించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను ఇష్టారీతిగా ఉపయోగిస్తున్నదన్న విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. సరిగ్గా ఎన్నికల ముందు విపక్ష పార్టీలను ఇబ్బందులలోకి నెట్టే లక్ష్యంతోనే కేంద్ర దర్యాప్తు సంస్థలు పని చేస్తున్నాయన్న ఆరోపణలకు కూడా ఉన్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆప్ సీనియర్ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అరెస్టు చేసిన ఈడీ, కవిత విషయంలో మాత్రం ఆ పని చేయలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించిన సంగతి తెలిసిందే. సరే అది పక్కన పెడితే ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల ముంగిట.. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ లక్ష్యంగా ఈడీ, ఐటీలు దాడులు సోదాలు నిర్వహిస్తుండడానికి బీజేపీ, బీఆర్ఎస్ రహస్య మైత్రే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

తాజాగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్ సి ఏ) మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ నేత వినోద్ ను విచారించిన ఈడీ ఆయనక నోటీసులు జారీ చేసింది.    ఉప్పల్ స్టేడియం నిర్మాణంలో 20 కోట్ల రూపాయల  అవకతవకలపై దర్యాప్తు లో భాగంగా శనివారం (డిసెంబర్ 30)  తెల్లవారు జామున హెచ్ సి ఏ మాజీ అధ్యక్షుడు వినోద్  ను ఈడీ అధికారులు విచారించారు.

 మాజీ క్రికెటర్లు అర్షద్, అయూబ్, శివలాల్ యాదవ్ లను కూడా ఈడీ  ప్రశ్నించింది. హెచ్ సి ఏ మాజీ  అధ్యక్షుడు, చెన్నూర్ మాజీ  ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు   నోటీసులు జారి చేసింది. జనవరి మొదటి వారంలో హాజరు కావాలని  పేర్కొంది.

 వాస్తవానికి హెచ్ సీఏ అధ్యక్షుడిగా వినోద్ ఉన్న కాలంలో జరిగిన ఉప్పల్ స్టేడియం నిర్మాణంలో అవినీతి కేసు నేటిది కాదు. కానీ సరిగ్గా లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈడీ కాంగ్రెస్ నేతకు నోటీసులు జారీ చేయడం వెనుక బీజేపీ ఉందన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.  

ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు  చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థిగా   వివేక్ వెంకటస్వామికి టికెట్ ఖరారైన వెంటనే ఆయన నివాసంపై  ఐటీ దాడులు జరగడాన్ని పరిశీలకులు ప్రస్తావిస్తున్నారు.  ఓటమి భయంతోనే అధికార బీఆర్ఎస్ తో కుమ్మక్కై బీజేపీ ఈ దాడులు చేయిస్తోందని అప్పట్లోనే కాంగ్రెస్ ఆరోఫణలు చేసిన విషయం తెలిసిందే. సరిగ్గా ఎన్నికల సమయంలోనే బీజేపీ వ్యతిరేకులపై కేంద్ర దర్యాప్తు సంస్థల దృష్టి పెట్టడం రాజకీయ వేధింపులు వినా మరోటి కాదని అంటున్నారు.