సిట్టింగుల మార్పుతో తెలుగుదేశం విజయానికి జగన్ రాచబాట?! | jagan hasty decessions| sittings| change| way| tdp
posted on Dec 31, 2023 12:18PM
సహజంగా ఎన్నికలనగానే ముందుగా గుర్తొచ్చేది సీట్లు.. టికెట్లు. టికెట్ ఎవరికి ఇస్తారు? ఏ పార్టీ నుండి ఏ అభ్యర్థి పోటీలో ఉన్నారు? ఏయే నియోజకవర్గంలో ఎవరెవరు ప్రత్యర్థులు అనేది కీలకం. అయితే ఇందులో దాదాపుగా అధికారంలో ఉన్న పార్టీకే అభ్యర్థుల ఎంపిక నుంచీ.. గెలుపు గుర్రాలను ఎంచుకునే విషయంలో మంచి అవకాశం ఉంటుంది. అధికారం చేతిలో ఉంటుంది కనుక.. పరిస్థితులను అనుకూలంగా మలచుకొనే అవకాశం, వెసులుబాటు ఉంటుంది. ప్రతిపక్షాలు ప్ర అభ్యర్థుల ఎంపిక విషయంలో ముందుగానే నిర్ణయాలు తీసుకుని ప్రజల మధ్యకి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ సాగుతారు. కానీ అధికార పార్టీ మాత్రం ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువయ్యేందుకు ముందుగా ప్రయత్నిస్తుంది. చివరిలో అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల కదనరంగంలోకి దిగుతుంది. కానీ, ఏపీలో మాత్రం జగన్ ప్రభుత్వ విధానంలాగే.. ఎన్నికలకు సమాయత్తమౌతున్న విధానం కూడా రివర్స్ లోనే ఉంది. తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్లుగా ఇక్కడ సీఎం జగన్ మోహన్ రెడ్డి తన ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రజలకు చేసిన మేళ్లు, సంక్షేమం, అభివృద్ధి వంటి వాటి విషయంలో చెప్పుకునేందుకు ఏమీ లేకపోవడంతో.. ముందుగా అభ్యర్థుల ఎంపిక పై దృష్టి పెట్టారు. భారీ స్థాయిలో సిట్టింగుల మార్పునకు శ్రీకారం చుట్టారు. అధికారికంగా ఓ 11 మంది సిట్టింగులను మార్చేశారు. ఇంకా చాలా చాలా మందిని మార్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఆ మార్పులను ప్రకటించే ధైర్యం చేయలేకపోతున్నారు. పార్టీలో ఒక్కసారిగా ఉవ్వెత్తున ఉప్పెనలా లేచిన అసంతృప్తితో.. అసమ్మతిని చల్లార్చే ప్రయత్నాలను పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లకు అప్పగించేసి తాడేపల్లి ప్యాలెస్ కు పరిమితమైపోయారు. అసమ్మతి వ్యక్తం చేస్తున్న వారిని కనీసం కలవడానికి కూడా ముందుకు రాలేని పరిస్థితిలో ఉన్నారు. మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు డొక్క వరప్రసాద్ వంటి వారే బహిరంగంగా జగన్ ను ఓ సారి కలిసి మాట్లాడే అవకాశం ఇవ్వండి అని వేడుకుంటున్నారంటే వైసీపీ పరిస్థితి, జగన్ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్ధమౌతుంది. ఒక వేళ జగన్ మొండిగా సిట్టింగుల మార్పుతో ముందుకు వెళ్లినా కొత్త అభ్యర్థులను కార్యకర్తలు అంగీకరించే పరిస్థితి పార్టీలో లేదు. అందుకే ముందుగా ఇన్ చార్జీల మార్పు పేరిట వారిని నియోజకవర్గాలకు పంపి, రేపు వారినే ఇక్కడ అభ్యర్థులుగా ప్రకటించేందుకు ప్లాన్ వేశారు.
ఇలా చేయడం ద్వారా తన లోని ఓటమి భయాన్ని బయటపడకుండా, గెలుపు ధీమా సంకేతాలు ఇచ్చేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. కానీ సిట్టింగుల మార్పు వ్యూహంతో వైసీపీలో గెలుపు ధీమా సంగతేమో కానీ.. తెలుగుదేశంకు ఇది మేలు చేసేలా ఉంది. జగన్ ఇలా ముందే అభ్యర్థులను ప్రకటించడం తెలుగుదేశం, జనసేన కూటమికి కలిసి వచ్చిన అవకాశంగా మారుతోంది. చంద్రబాబు లాంటి రాజకీయ మేధావికి జగన్ తీసుకున్న ఈ నిర్ణయం తమ అభ్యర్థుల ఎంపికకు సమయం ఇవ్వడమే కాకుండా పర్ఫెక్ట్ టార్గెట్ ఫిక్స్ చేసుకొనేందుకు మంచి అవకాశంగా కూడా మారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి ఎవరో ముందుగానే తెలియడం వల్ల ఆ నియోజకవర్గంలో సమస్యలు, రాజకీయ-సామాజిక పరిస్థితులు వంటివి అంచనా వేసుకొని తమ పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసుకునే సావకాశం కలుగుతుందంటున్నారు. వైసీపీ అభ్యర్థి ఎవరో తేలిపోవడంతో టీడీపీ-జనసేన కూటమికి అభ్యర్థుల ఎంపిక మరింత సౌలభ్యంగా మారుతుంది. ఇంకా చెప్పాలంటే శత్రువును ఎలా దెబ్బకొట్టాలో కావాల్సినంత సమయం తీసుకొని పక్కా స్కెచ్ వేసి బరిలోకి దిగే వీలు కలుగుతుంది. ప్రత్యర్థి బలం బలహీనత ముందే తెలియడంతో టీడీపీ, జనసేనకు ఎదుర్కోవడం మరింత సునాయాసమైపోతుందని విశ్లేషిస్తున్నారు. దీంతో ఇప్పటికే గెలుపు ఆశలు అడుగంటిపోయిన వైసీపీకి జగన్ నిర్ణయం మరింత నష్టం చేకూరుస్తుందని చెబుతున్నారు.
మొత్తం 175 నియోజకవర్గాల్లో జగన్ మార్పులు, చేర్పుల దిశగా దూకుడుగా అంతకు మించి మొండిగా కూడా ఉన్నారు. ఐ ప్యాక్ టీం చెప్పిందో.. లేక సొంత సర్వే సంస్థలు చెప్పాయో.. ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా చేస్తున్నారో కానీ దాదాపు 90 మంది సిట్టింగులను మార్చేయాలని జగన్ నిర్ణయించుకున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ తరఫున బరిలో నిలిచేవారి సత్తా ఎంత? వారి ఆర్థిక పరిస్థితి ఏంటి? కుల, మత, సామాజిక పరిస్థితులు వంటి కీలక విషయాల ఆధారంగా, కాస్త ఆలస్యమైనా టీడీపీ-జనసేన అభ్యర్థులను ప్రకటించనున్నారు. అందుకే టీడీపీ, జనసేనలో అభ్యర్థుల కసరత్తు కోసం ఎలాంటి తొందరా కనిపించడం లేదు. ఎలాగూ వైసీపీ అభ్యర్థులు ఎవరో రానున్న రోజులలో తేలిపోతుంది కనుక అప్పుడు అన్ని విషయాలనూ పరిగణనలోనికి తీసుకుని గెలుపు గుర్రాలను నిలబెట్టేందుకు టీడీపీ, జనసేన వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నాయి. మొత్తం మీద జగన్ తొందరపాటు, ఓటమి భయంతో పడుతున్న తడబాటు ఏపీలో ఆ పార్టీ పుట్టి ముంచి, తెలుగుదేశం విజయానికి రాచబాట వేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.