వైసీపీలో ఒకరి తర్వాత ఒకరు.. జగన్ పై తిరుగుబాటు! | one by one in ycp| revolt on jagan| rk| kapu| malladi| many| more| sittings| change
posted on Jan 6, 2024 9:51AM
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి టికెట్ల కసరత్తు మొదటికే మోసం తెస్తోందా? అంటే సొంత పార్టీ నుంచే అవునన్న సమాధానం వస్తోంది. సిట్టింగుల మార్పు, తొలగింపు అంటూ ఆయన చేస్తున్న చర్యలు పార్టీ ఉనికిని, అస్థిత్వాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఒక్కరొక్కరుగా పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. అలా చెప్పి మౌనంగా వెళ్లి పోవడం లేదు. జగన్ దగా చేశారనీ, ఆయన పార్టీ కో దండం, ఆయనకు పది దండాలు అంటూ శాపనార్థాలు పెట్టి మరీ వెడుతున్నారు. అలా వెళుతున్నవారు మామూలు నేతలకు కాదు. హార్డ్ కోర్ జగన్ భక్తులు, విధేయులు. జగన్ కు నమ్మిన బంట్లుగా ఇంత కాలం ఉన్న వారు ఒక్కరొక్కరుగా పార్టీని వీడి వెడుతున్నారంటే రానున్న రోజులలో ఇంకెంత మంది ఆ బాట పట్టనున్నారో అన్న అనుమానాలు రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతున్నాయి.
ముఖ్యంగా టికెట్ దక్కకపోవడం, స్థానాన్ని మార్చడం కంటే.. ఆ క్రమంలో జగన్ తమ పట్ల అనుసరించిన వైఖరి, ఇచ్చిన ట్రీట్ మెంట్, చేసిన అవమానం భరించలేకే జగన్ కు నిన్నటి వరకూ భజన చేసిన నేతలు ఇప్పుడు తిరుగుబావుటా ఎగుర వేస్తున్నారు. తాజాగా రాయదుర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి జగన్ పై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. జగన్ గొంతు కోశారనీ, దగా చేశారనీ మండి పడ్డారు. జగన్ కో దండం అంటూ తన అసహనాన్ని, ఆవేదనను, ఆక్రోశాన్నీ, ఆగ్రహాన్నీ వ్యక్తం చేశారు. తనకు టికెట్ లేదనడానికి జగన్ ఎవరని నిలదీశారు. వైసీపీ, జగన్ అండ అవసరం లేదనీ, ఇండిపెండెంట్ గానైనా గెలిచే సత్తా తనకు ఉందనీ పోటీ చేసి గెలిచి చూపిస్తాననీ సవాల్ చేశారు.
తాను రాయదుర్గం నుంచి, తన భార్య కల్యాణ దుర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తామని, ఒక వేళ మరే పార్టీ అయినా సీటిస్తే ఆ పార్టీ టికెట్ పై పోటీ చేస్తామని చెప్పారు. ఇండిపెండెంట్ గానైనా గెలిచే సత్తా, సమర్ధత, ప్రజా మద్దతు తమకు ఉన్నాయన్నారు. తాను రాయదుర్గం నుంచి.. తన బార్య కల్యాణదుర్గం నుంచి పోటీ చేస్తుందని ఆయన ప్రకటించారు. ఏదైనా పార్టీలో టిక్కెట్ ఇస్తే ఆ పార్టీల నుంచి పోటీ చేస్తానని చెబుతున్నారు.
కాపు రామచంద్రారెడ్డి.. ఏదో గాలి వాటం నేత కాదు. జగన్ కు అత్యంత ఆప్తుడు, వ్యాపార భాగస్వామి అయిన గాలి జనార్ధన్ రెడ్డికి ఈ కాపు రామచంద్రారెడ్డి వ్యాపార భాగస్వామి. అయితే అది ఒకప్పుడు. ఇటీవలి కాలంలో కాపు రామచంద్రారెడ్డికి గాలి జనార్ధన్ రెడ్డితో విభేదాలు, వివాదాలు తలెత్తాయి. ఆ ప్రభావమే ఇప్పుడు జనగ్ కాపు రామచంద్రారెడ్డికి రిక్తహస్తం చూపారని పార్టీ శ్రేణులలో ఓ చర్చ జోరుగా సాగుతున్నది. అదీ కాక కాపు రామచంద్రారెడ్డి అల్లుడు ప్రభుత్వ పని కాంట్రాక్టులు చేస్తూ బిల్లులు రాక తీవ్రంగా నష్టపోయారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుడు కూడా కాపు రామచంద్రారెడ్డి జగన్ ను పల్లెత్తు మాట అనలేదు. అన్ని విధాలుగా, చివరికి ప్రభుత్వ నిర్వాకం వల్ల సొంత అల్లుడు ఆత్మహత్య చేసుకున్నా కాపు రామచంద్రారెడ్డి జగన్ విధేయతను వీడలేదు. అటువంటి తనను జగన్ ఇంత దారుణంగా మోసం చేయడంతో తట్టుకోలేక బ్రేక్ అయ్యారు. తన తడాఖా చూపిస్తానంటూ జగన్ కే సవాల్ విసిరారు.
జగన్ కు అత్యంత విధేయుల తిరుగుబాటు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో మొదలైంది. జగన్ టికెట్ల కసరత్తుతో చినుకుగా మొదలైన తిరుగుబాటు పర్వం గాలివానగా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. చివరకు మంత్రులు కూడా తమ సీట్ల మార్పు విషయంలో అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా జగన్ పైనే సొంత పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తుంటే.. జగన్ సరే, పార్టీలోని ఎవరూ కూడా వారించడం కానీ ప్రతి విమర్శలు కానీ చేయడం లేదంటే.. పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్ధం చేసుకోవచ్చ. పార్టీలోని ప్రతి ఒక్కరూ అభద్రతా భావంతో ఉన్నారు. నిన్న ఆళ్ల, నేడు కాపు.. రేపు నేనేనేమో అన్న భావన పార్టీలోని అందరిలో వ్యక్తం అవుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.