లోక్ సభ ఎన్నికలకు ముందే ఆ హామీల అమలు.. రేవంత్ సర్కార్ కసరత్తు | three promises impliment before election schedule| gruhalakshmi| mahalakshmi| cheyuta| pension| hike| revanth
posted on Jan 6, 2024 10:40AM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆరు గ్యారంటీలలో రెండింటిని ఇప్పటికే అమలు చేసిన రేవంత్ సర్కార్.. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కు ముందే మరో మూడు గ్యారంటీలను అమలు చేయాలని యోచిస్తున్నది. ఇందుకోసం ఇప్పటికే కసరత్తు ప్రారంభించేసింది. అధకారంలోకి వచ్చిన వంద రోజుల్లోగా ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన రోజుల వ్యవధిలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిమితిని పదిలక్షలకు పెంపు హామీలను అమలు చేసేసింది. ఇప్పుడు మరో మూడు హామీలపై దృష్టి పెట్టింది.
గృహలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి ఇంటికీ 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500కే గ్యాస్ సిలిండర్, అలాగే చేయూత కింద పింఛన్లను రూ.4 వేలకు పెంపు హామీలను అమలు చేయడానికి రెడీ అవుతోంది. వచ్చే నెలలో లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఆ లోపుగానే ఈ హామీలను అమలు చేయాలని పట్టుదలతో ఉంది. ఇందు కోసం కసరత్తు ప్రారంభించేసింది. వీటిలో రెండు వందల యూనిట్ల వరకూ ఫ్రీ కరెంట్, 500 రూపాయలకే గ్యాస్ సిలెండర్ అమలుకు మార్గదర్శకాల రూపకల్పనలో నిమగ్నమైంది. ఇక చేయూత పించన్ పథకం ఇప్పటికే అమలులో ఉంది, దానికి మార్గదర్శకాలు కూడా ఉన్నాయి. వాటిలో అవసరమైన మార్పులు, సవరణలు చేయడంతో పాటు నాలుగు వేల రూపాయలకు పెంచడంపై కసరత్తు ప్రారంభించేసింది. ఇప్పటికే ఈ విషయంలో ఆయా శాఖల అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు సమీక్ష కూడా నిర్వహించారు.
ఈ పథకాల అమలుకు అవసరమైన బడ్జెట్, ప్రభుత్వంపై పడే భారం తదితర అంశాలపై చర్చించారు. అధికారం చేపట్టీ చేపట్టగానే రెండు హామీలను అమలు చేసిన సర్కార్ లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేలోగా మరో మూడింటిని కూడా అమలులోకి తీసుకువచ్చి.. ఆ విషయాన్ని ఎన్నికలలో విస్తృతంగా ప్రచారం చేసుకుని లబ్ధి పొందాలని భావిస్తోంది. కేవలం ఎన్నికల లబ్థి కోసమే కాకుండా.. తమది పని చేసే ప్రభుత్వమనీ, హామీల అమలులో చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వమనీ చాటుకోవడానికి రేవంత్ సర్కార్ కృత నిశ్చయంతో ఉంది.