Leading News Portal in Telugu

తమ్మినేని అనుకున్నదొకటి.. అయినది మరొకటి.. జగన్ తో అంతే! | jagan kept aside| tammineni| amudalavalasa| ticket| bodepalli


posted on Jan 6, 2024 12:54PM

సీనియర్ రాజకీయ నాయకుడు తమ్మినేని సీతారాంకు ఇప్పుడు తత్వం బోధపడింది.  జగన్ ప్రాపకం కోసం విలువలకు వలువలు ఒదిలేని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును, ఆయన కుటుంబాన్ని విమర్శల పేర తిట్టడమే పనిగా పెట్టుకున్న తమ్మినేని సీతారాంకు జగన్ మొండి చేయి చూపారు.  రాజ్యాంగబద్దమైన పదవి ఔన్నత్యాన్ని కూడా కించపరిచి స్పీకర్ హోదాలో  ఇష్టారీతిగా అనుచిత వ్యాఖ్యలు చేసిన తమ్మినేని సీతారాంకు జగన్ చక్కటి బహుమానం ఇచ్చారు.  ఆముదాల వలస నియోజకవరం టికెట్ ను మాజీ ఎంపీ బొడ్డేపల్లి రాజగోపాల్ రావు కుటుంబం నుంచి బొడ్డేపల్లి పద్మజ కు ఇచ్చేశారు.  

నిజానికి తమ్మినేని సీతారాం ఈ సారి తాను పోటీ చేయనని తన కుమారుడికి చాన్సివ్వాలని చాలా కాలంగా జగన్ ను అడుగుతూ వస్తున్నారు. అయితే చూద్దాం చేద్దాం  దాటేసిన జగన్.. చివరికి తనదైన శైలిలో కనీస సమాచారం కూడా ఇవ్వకుండా  ఆముదాల వలస నుంచి తమ్మినేనిని, తమ్మినేని కుటుంబాన్ని పక్కన పెట్టేశారు. తమ్మినేని తన సీరియారిటీని గుర్తించి ఓ సారి మంత్రిని చేస్తే ఇక రాజకీయాల నుంచి తప్పుకుంటానని జగన్ ను కోరుతూ వస్తున్నారు.   మంత్రి వర్గ విస్తరణ జరిగినప్పుడు తనను స్పీకర్ గా తప్పించి మంత్రిని చేయాలని జగన్ ను కోరారు. అందుకోశం శక్తివంచన లేకుండా ప్రయత్నించారు.

అందుకు జగన్ నుంచి సానుకూల స్పందన వచ్చిందో ఏమో కానీ.. స్పీకర్ చెయిర్ లో కూర్చున్నాన్న స్ఫృహ కూడా కోల్పోయి ఆయన ఫక్తు వైసీపీ ఎమ్మెల్యేలా వ్యవహరించారు. ఒక సందర్భంలో  అచ్చెన్నాయుడుతో ..   మంత్రిని అయి కిందకు వచ్చి మీ సంగతి తేలుస్తానని సవాల్  చేశారు. అయితే జగన్ మాత్రం తమ్మినేనిని లైట్ తీసుకున్నారు. తమ్మినేనికి స్పీకర్ పదవి ఇవ్వడమే గొప్ప, అందుకు ఆయన చేయాల్సిన పని విపక్ష నేతనూ, విపక్ష పార్టీనీ తిట్లతో కంట్రోల్ చేయడమేనని భావించినట్లున్నారు. అందుకే తమ్మినేని అభ్యర్థనలను కనీసం పరిగణనలోనికి కూడా తీసుకోలేదు. ఇక ఇప్పుడు ఎన్నికల వేళ తమ్మినేనిని పూర్తిగా పక్కన పెట్టేశారు. దీంతో తమ్మినేని పొలిటికల్ కెరీర్ కు ఎండ్ కార్డ్ పడిపోయినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

పార్టీ గెలిస్తే ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చి మంత్రిని చేస్తామని తమ్మినేనికి జగన్ సజ్జల ద్వారా ఓ హామీ అయితే పారేసినట్లు చెబుతున్నారు. ఇలా తానిచ్చే  హామీలకు జగన్ ఏ పాటి విలువ ఇస్తారో వేరే చెప్పనవసరం లేదు.  ఇక తమ్మినేని సంగతే పాపం దారుణంగా మారిపోయింది. ఏదో ఆశించి, తన విలువను తగ్గించుకుని ప్రతిష్టను మంటగలుపుకుని మరీ జగన్ కోసం పని చే స్తే.. ఇప్పుడు బోడిమల్లయ్య సామెతగా ఆయన పరిస్థితి మారిపోయింది.