Leading News Portal in Telugu

Alaska Airlines Boeing 737 MAX: 16 వేల అడుగుల ఎత్తులో ఊడిపోయిన విమానం డోర్..


Alaska Airlines Boeing 737 MAX: 16 వేల అడుగుల ఎత్తులో ఊడిపోయిన విమానం డోర్..

Alaska Airlines Boeing 737 MAX: అలస్కా ఎయిర్ లైన్స్‌కి చెందిన బోయింగ్ 737-9 MAX విమానం తృటిలో ఘోర ప్రమాదం నుంచి బయటపడింది. టేకాఫ్ అయిన కొద్ధి నిమిషాలకే గాలిలో ఉండగానే విమానం డోర్ తెరుచుకుంది. దీంతో విమానం ఒక్కసారిగా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంది. ప్రయాణికులు ఈ ఘటనను చిత్రీకరించారు. దీంట్లో మిడ్ క్యాబిన్ ఎగ్జిట్ డోర్ విమానం నుంచి పూర్తిగా విడిపోయినట్లు కనిపిస్తోంది.


పోర్ట్ లాండ్ నుంచి ఒంటారియా, కాలిఫోర్నియాకు వెళ్తున్న విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. టేకాఫ్ తర్వాత విమానం 16,325 అడుగుల ఎత్తుకు చేరుకుంది. ఆ సమయంలోనే డోర్ ఊడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో 171 మంది ప్రయాణికులతో పాటు 6 మంది సిబ్బంది విమానంలో ఉన్నారు.

ఒక్కసారిగా ఈ ప్రమాదం ఎదురుకావడంతో విమానం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. వెంటనే పోర్ట్ ల్యాండ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. ఈ ఘటనలో ఏం జరిగిందనే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు అలస్కా ఎయిర్‌లైన్స్ ప్రతినిధి ఎక్స్(ట్విట్టర్) ద్వారా వెల్లడించారు. యూఎస్ నేషనల్ ట్రాన్‌పోర్టేషన్ బోర్డ్(NTSB) ఘటనను పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది.

ప్రమాదానికి గురైన బోయింగ్ 737 MAX అక్టోబరు 1, 2023న అలాస్కా ఎయిర్‌లైన్స్‌కు డెలివరీ చేయబడింది. నవంబర్ 11, 2023 నుంచి కమర్షియల్ సర్వీసుల్ని అందిస్తోంది. అప్పటి నుంచి 145 సార్లు మాత్రమే ప్రయాణించినట్లు ఫ్లైట్‌రాడార్ 24 తెలిపింది. ఇప్పటికే బోయింగ్ సంస్థకు చెందిన 737-9 MAX విమానాల్లోని రడ్డర్‌లో లూస్ బోల్డ్ సమస్యలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో 737 మాక్స్ ఇలా ప్రమాదానికి గురవ్వడంతో బోయింగ్‌కి కొంత ఇబ్బందిగా మారింది.