Leading News Portal in Telugu

David Warner: టెస్ట్ క్రికెట్కు వార్నర్ గుడ్ బై… కంటతడి పెట్టిన డేవిడ్ భాయ్


David Warner: టెస్ట్ క్రికెట్కు వార్నర్ గుడ్ బై… కంటతడి పెట్టిన డేవిడ్ భాయ్

ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ టెస్టు కెరీర్ శనివారం (జనవరి 6)తో ముగిసింది. ఇటీవలే టెస్ట్ లకు, వన్డేలకు రిటైర్మెంట్ ఇచ్చిన వార్నర్.. తన కెరీర్ లో నేడు చివరి టెస్ట్ ఆడాడు. ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్థాన్ మధ్య మూడో టెస్టు జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో పాకిస్థాన్‌ను 3-0తో వైట్‌వాష్ చేసింది. అంతేకాకుండా.. వార్నర్ కు ఆసీస్ జట్టు గెలుపుతో మంచి గిఫ్ట్ ఇచ్చింది.


అయితే ఈ మ్యాచ్ తర్వాత వార్నర్ భావోద్వేగానికి లోనయ్యాడు. మీడియాతో మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నాడు. అనంతరం మాట్లాడుతూ.. గెలుపుతో కెరీర్ ముగించాలనుకున్న తన కల నిజమైందని అన్నాడు. అంతేకాకుండా కొందరు దిగ్గజ క్రికెటర్లతో కలిసి ఆస్ట్రేలియా జట్టు తరఫున ఆడే అవకాశం లభించడం తన అదృష్టమని వార్నర్ తెలిపాడు. గత రెండేళ్లుగా ఆస్ట్రేలియా జట్టు గొప్పగా ఆడుతుందని వార్నర్ పేర్కొన్నాడు. తాము ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నాము, యాషెస్ సిరీస్‌ని డ్రా చేసుకున్నాము. వన్డే ప్రపంచ కప్ 2023ని చేజిక్కించుకున్నాము. ఇప్పుడు సిడ్నీకి వచ్చి 3-0తో గెలవడం గొప్ప విజయం. ఈ విజయాల్లో తాను కూడా భాగం కావడం పట్ల గర్విస్తున్నానని వార్నర్ పేర్కొన్నాడు.

37 ఏళ్ల వార్నర్ తన సుదీర్ఘ టెస్టు కెరీర్ లో 112 మ్యాచ్ లు ఆడి 44.59 సగటుతో 8,786 పరుగులు సాధించాడు. అందులో 26 సెంచరీలు, 37 అర్ధసెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో వార్నర్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 335 పరుగులు. ఎడమచేతివాటం వార్నర్ 2011 డిసెంబరు 1న న్యూజిలాండ్ తో మ్యాచ్ ద్వారా తన టెస్టు కెరీర్ ప్రారంభించాడు.