రాహుల్ ను ఆమోదిస్తేనే కూటమి మనుగడ? | opposition alliance existence depend on rahul| leadership| accept| intact
posted on Jan 6, 2024 9:05AM
కొత్త ఏడాది ఆరంభంతోనే ఎన్నికల హడావుడి మొదలైంది. ఫిబ్రవరిలో షెడ్యూల్, మార్చి, ఏప్రిల్ లో ఎన్నికలు జరుగుతాయన్న అంచనాతో అన్ని పార్టీలూ సమాయత్తం అవుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు వేడి మొదలైంది. ఈ ఎన్నికల్లో కూడా తాము విజయం సాధించడం ఖాయమని, వరుసగా మూడవసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టబోతున్నామని బీజేపీ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. స్వయంగా మోడీ కూడా తానే మరోసారి ప్రధానిని అని చెప్పుకుంటున్నారు. అయితే బీజేపీని గద్దెదింపే లక్ష్యంతో జట్టు కట్టిన విపక్ష కూటమి ఇండియాలో మాత్రం ఎలాంటి సందడీ కనిపించడంలేదు. ఇండియా శిబిరంలో విజయంపై ధీమా కానీ, విజయం సాధించాలన్న పట్టుదల కానీ ఇసుమంతైనా కనిపించడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా గత ఏడాది చివరిలో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత కూటమిలో ఒక విధమైన నైరాశ్యం కనిపిస్తోంది. కూటమి ఐక్యతే ప్రశ్నార్థకమౌతుందా అన్న అనుమానాలు కూడా కూటమి భాగస్వామ్య పక్షాలలో వ్యక్తం అవుతున్నాయి. సీట్ల పంపకం, , ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థి ఎవరు అనే ప్రశ్నలను తప్పించుకోవడానికి ఈ కూటమిలోని భాగస్వామ్య పార్టీలన్నీ నానా తిప్పలూ పడుతున్నాయి. ఆ ప్రశ్నలకు ఎదుర్కొనేందుకు భయపడే కూటమి పక్షాలు ముఖం చాటుస్తున్నాయా అన్న అనుమానాలూ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
విపక్ష కూటమి నాయకుడిగా ఎవరిని ఎంపిక చేసుకుంటాయి? అసలు ఆ దిశగా కూటమి భాగస్వామ్య పక్షాలలో ఏమైనా చర్చ జరిగిందా? జరుగుతోందా? అన్న ప్రశ్నలకే సమాధానం లేని పరిస్థితి. దీంతో ప్రజలలో ఈ కూటమి పట్ల విశ్వాసం వ్యక్తం కావడం లేదు. కావడానికి కూటమిలోని పార్టీలన్నీ వాటి వాటి స్థాయిల్లో బలమైన ప్రజా బలం ఉన్న పార్టీలే అనడంలో సందేహం లేదు. సీట్ల పంపిణీ వీషయంలో కూటమిలో సిగపట్టు ఉండే అవకాశం లేదు. ఏ పార్టీ బలాన్ని బట్టి ఆ పార్టీ వాటికి పట్టున్న రాష్ట్రాలలో సింహభాగం సీట్లను కోరుకుంటుంది. ఆ విధంగా సర్దుబాటు చేసుకోవడంలో పెద్ద ఇబ్బందులేమీ ఉండవు. అయితే కూటమికి నాయకత్వం వహించే పార్టీ ఏది? నాయకుడు ఎవరు అన్న విషయంలోనే పీటముడి పడుతోంది. స్వప్రయోజనాలు ఏమాత్రం లేని అందరికీ ఆమోదయోగ్యుడైన నాయకుడిని ఎన్నుకోవాలనే అన్ని కూటమి భాగస్వామ్య పార్టీలు చెబుతున్నాయి. అయితే ఆ నాయకుడు ఎవరు అన్న విషయంలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కూటమిలోని భాగస్వామ్య పార్టీలన్నిటికీ ఆమోదయోగ్యుడైన నాయకుడిని ఎన్నుకోవడం వద్ద చర్చలు, ఆలోచనలు ఆగిపోతున్నాయి. 28 పార్టీల ఇండియా కూటమిలో కూటమికి నాయకత్వం వహించే నేత ఎవరన్న విషయంలో అన్ని పార్టీలూ ఒకటే మంత్రం పఠిస్తున్నాయి. అదే మౌన మంత్రం. ఆ విషయంపై 28 పార్టీలలో ఏ పార్టీ కూడా నోరుమెదపడం లేదు. గత ఏడాది డిసెంబర్ 19వ తేదీన ప్రతిపక్ష కూటమి కీలక సమావేశంలో అనూహ్యంగా తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పేరును కూటమి నేతగా ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనకు ముందు వారిరువురూ కూడా ఎవరినీ సంప్రదించలేదు. ఆఖరికి వారు ప్రతిపాదించిన మల్లిఖార్జున్ ఖర్గేతో కూడా వారు మాట్లాడలేదు.
దీంతో కూటమి నేతగా ఖర్గే పేరు ఎంత హఠాత్తుగా తెరమీదకు వచ్చిందో అంతే హఠాత్తుగా వెనక్కు వెళ్లి పోయింది. కానీ ఆ ప్రతిపాదన కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి తేనెతుట్టెను కదిపింది. మమత కేజ్రీవాల్ ఖర్గే పేరు ప్రతిపాదించడం వెనుక ముఖ్య ఉద్దేశం కూటమి నేతగా రాహుల్ ను తాము ఎంత మాత్రం ఆమోదించేది లేదని కూటమి భాగస్వామ్య పక్షాలకు, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ కు తెలియజేయడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కూటమిలోని ప్రధాన భాగస్వామ్య పక్షాల అధినేతలు ఇద్దరు చేసిన ప్రతిపాదనను తోసిపుచ్చుతూ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఒక్కరొక్కరుగా గళం విప్పడం ప్రారంభించారు. అయితే ఆ ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ అధికారికంగా నిరాకరించే అవకాశాలు అంతంత మాత్రమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దళిత నేత అయిన ఖర్గే అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తే దళితులు పార్టీకి దూరం అవుతారన్న భయం, అనుమానం, ఆందోళన కాంగ్రెస్ లో వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఖర్గేకు సన్నిహితుడైన కర్నాటక సీఎం సిద్దరామయ్య తాము రాహుల్ గాంధీయే ప్రధాని అభ్యర్థిగా ఉండాలని కోరుకుంటున్నట్టు ప్రకటించారు. ఆ విధంగా మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ చేసిన ప్రతిపాదనను తాము ఆమోదించలేమని స్పష్టం చేశారు. సొంత పార్టీ వారే ఆమోదించని వ్యక్తికి కూటమి నాయకత్వం వహించడం అన్నది జరగని పని. ఇక అన్నిటికీ మించి గాంధీ నెహ్రూ కుటుంబానికి అత్యంత విధేయుడిగా గుర్తింపు తప్ప ఖర్గేకు దళిత వర్గాలలో పెద్దగా పట్టున్న దాఖలాలు లేవు. ఆయన వెంట దళితులు ర్యాలీ అయ్యే అవకాశలూ లేవు. ఈ నేపథ్యంలోనే మమత, కేజ్రీవాల్ ల ప్రతిపాదన స్వయంగా ఖర్గేను కూడా ఇబ్బందిలోకి నెట్టింది. అందుకే ఆయన విపక్షాల మధ్య ఐక్యతకే తొలి ప్రాధాన్యత, నాయకుడు ఎవరు? ప్రధాని అభ్యర్థి ఎవరన్నది ఎన్నికల తరువాత చర్చించుకోవాలసిన అంశం అని చెప్పారు. అలా చెప్పడం ద్వారా ఖర్గే తాను ప్రధాని రేసులో ఉండననీ, లేననీ స్పష్టం చేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలోనే రాహుల్ గాంధీ మరో పాదయాత్ర ప్రారంభించారు. తద్వారా కూటమి నాయకుడిగా సర్వామోదం కోసం ఆయన ప్రయత్నాలు ఆరంభించారని పరిశీలకులు విశ్లేషించారు. భారత న్యాయయాత్ర పేర ఆయన 14 రాష్ట్రాలను కలుపుతూ 6వేల 200 కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారు. ఈ యాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ తమ పార్టీకే కాదు, కూటమికి కూడా రాహుల్ గాంధీయే ప్రధాన ప్రచార సారథి, ఆయనే ప్రధాని అభ్యర్థి అని ప్రజలకు, అదే సమయంలో కూటమి భాగస్వామ్య పక్షాలకు తేటతెల్లం చేయనున్నారు. మరి ఈ యాత్ర అనంతరం కూటమి భాగస్వామ్య పక్షాలకు ఆమోదయోగ్యమైన నేతగా రాహుల్ ఆవిర్బవిస్తారా? కూటమి భాగస్వామ్య పక్షాలు రాహుల్ నాయకత్వాన్ని ఆమోదించకపోతే.. కాంగ్రెస్ అడుగులు, ఆలోచనలు ఓంటరి పోరు దిశగా సాగుతాయా? అన్నది వేచి చూడాల్సిందే.