
Benjamin Netanyahu: ఇజ్రాయిల్ తన అన్ని లక్ష్యాలను సాధించే వరకు యుద్ధాన్ని ఆపబోదని మరోసారి ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. హమాస్ నాశనం అయ్యేంత వరకు గాజా యుద్ధం ఆగేది లేదని ప్రకటించారు. మూడు నెలల క్రితం హమాస్ మాపై దారుణమైన దాడికి పాల్పడ్డారు, హమాస్ నిర్మూలించాలని, బందీలను తిరిగి తీసుకురావాలని, గాజా నుంచి ఇజ్రాయిల్‌పై మరోసారి దాడులు ఎదురుకావద్దని తాను ఇజ్రాయిల్ ఆర్మీని ఆదేశించినట్లు ప్రధాని నెతన్యాహూ చెప్పారు. హమాస్‌ని ఎప్పటికీ ఉపేక్షించేది లేదని, దక్షిణం-ఉత్తరం రెండింటిలో భద్రత పునరుద్ధరించే వరకు పోరాడుతామని ఆయన అన్నారు. సంపూర్ణ విజయం సాధించే వరకు ముందుకు సాగుతామని చెప్పారు.
అక్టోబర్ 7న హమాస్ గాజా నుంచి ఇజ్రాయిల్ పైకి రాకెట్లతో దాడులు చేసింది. ఆ తర్వాత ఇజ్రాయిల్ కిబ్బుట్జ్‌లోకి ప్రవేశించి పిల్లలు, పెద్దలను అత్యంత కిరాతకంగా హతమార్చింది. అంతే కాకుండా మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారు. ఈ దాడిలో మొత్తం 1200 మంది చనిపోయారు. 240 మందిని అపహరించి గాజాలోకి తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజాపై విరుచుకుపడుతోంది. గాజాతో పాటు వెస్ట్ బ్యాంక్‌లోని హమాస్ స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటికే 20 వేలకు పైగా పాలస్తీనియన్లు మరణించారు.