Leading News Portal in Telugu

Breaking News: మోడీపై అవమానకర వ్యాఖ్యలు చేసిన మాల్దీవుల మంత్రులను సస్పెండ్ చేసిన ప్రభుత్వం


Breaking News: మోడీపై అవమానకర వ్యాఖ్యలు చేసిన మాల్దీవుల మంత్రులను సస్పెండ్ చేసిన ప్రభుత్వం

Breaking News: ప్రధాని నరేంద్రమోడీపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన మాల్దీవుల మంత్రులను అక్కడి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇటీవల లక్షద్వీప్‌ని ప్రధాని మోడీ సందర్శించారు. ఈ పర్యటనపై మాల్దీవుల ప్రభుత్వంలోని పలువురు మంత్రులు, నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతదేశానికి, ప్రధాని నరేంద్రమోడీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రులను మాల్దీవుల ప్రభుత్వం ఈ రోజు సస్పెండ్ చేసింది. స్థానిక మీడియా ప్రకారం, మంత్రులు మరియం షియునా, మల్షా మరియు హసన్ జిహాన్‌లను సస్పెండ్ చేశారు.


ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో భారతీయులు ‘బాయ్‌కాట్ మాల్దీవులు’ అనే హాష్‌ట్యాగ్‌ని ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు. మరోవైపు ఆ దేశానికి వెళ్లాలని షెడ్యూల్ ప్లాన్ చేసుకున్న ఇండియన్స్ ఇప్పుడు వాటిని క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ప్రధాని మోడీకి మద్దతుగా అక్షయ్ కుమార్, కంగనా రనౌత్, సల్మాన్ ఖాన్, జాన్ అబ్రహం, సచిన్ టెండూల్కర్ వంటి వారు లక్షదీవుల టూరిజానికి మద్దతు తెలుపుతున్నారు.

అంతకుముందు, ప్రధానిపై వ్యాఖ్యలు చేసిన విషయాన్ని భారత్, మాల్దీవుల ప్రభుత్వం వద్ద లేవనెత్తింది. దీనిపై స్పందించిన అక్కడి మహ్మద్ మయిజ్జూ ప్రభుత్వం ఈ వ్యాఖ్యలు వారి వ్యక్తిగతమని దీంతో ప్రభుత్వానికి సంబంధం లేదని ఓ ప్రకటనలో తెలియజేసింది. అనుచిత వ్యాఖ్యలు చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే మంత్రుల సస్పెన్షన్ జరిగినట్లు తెలుస్తోంది.

ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల లక్షదీవులకు వెళ్లారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అంతే కాకుండా అక్కడి పర్యాటకాన్ని ప్రమోట్ చేశారు. మాల్దీవుల లాగే బీచ్ టూరిజానికి లక్షదీవులు వేదికగా ఉన్నాయి. దీంతో ప్రధాని ఇలా చేయడంపై మాల్దీవుల్లోని ప్రభుత్వంలోని నేతలు తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు. ప్రతీ ఏడాది ఇండియా నుంచే ఎక్కువ మంది టూరిస్టులు మాల్దీవులకు వెళ్తుంటారు. ఈ దేశానికి ప్రధాన ఆదాయం టూరిజమే.

ఇదిలా ఉంటే మంత్రి మరియం షియునా ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. భారత ప్రధనిని విదూషకుడు, తోలుబొమ్మ అంటూ వ్యాఖ్యానించారు. ఈమె పోస్టుపై తీవ్ర వ్యతిరేకత రావడంతో తర్వాత దీనిని డిలీట్ చేసింది. ఆ దేశానికి చెందిన రాజకీయ నేత జహిద్ రమీజ్ ప్రధాని లక్షద్వీప్ టూర్‌ని ప్రస్తావిస్తూ.. ‘‘డబ్బు సంపాదించడానికి శ్రీలంక వంటి చిన్న ఆర్థిక వ్యవస్థల్ని భారత్ కాపీ కొడుతుందని’’ ఆరోపించారు. భారత్ ఆలోచన భ్రమ కలిగిస్తోందని, వారు మేము అందించే సేవల్ని ఎలా అందిస్తారు.. వారి గదుల్లో వాసన వస్తుంది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా మహ్మద్ మయిజ్జు ప్రభుత్వం ఏ దేశానికి కీలుబొమ్మ కాదని, అది చైనా అయినా, భారత దేశం అయినా అని అన్నారు.