
Bangladesh: బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ప్రతిపక్షాల ఎన్నికల బహిష్కరణ నడుము 40 శాతం ఓటింగ్ నమోదైంది. ప్రస్తుతం అధికారులు కౌంటింగ్ ప్రారంభించారు. ప్రధాన మంత్రి షేక్ హసీనా వరసగా నాలుగోసారి అధికారంలోకి రావడం దాదాపుగా ఖాయమైంది. ప్రధాన ప్రతిపక్షమై బీఎన్పీ దాని మిత్రపక్షాలు పోలీటో పాల్గొనలేదు. ఆదివారం జరిగిన ఓటింగ్లో ఓటేసేందుకు చాలా తక్కువ మంది వచ్చారు. 2018 సార్వత్రిక ఎన్నికల్లో 80 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది.
కొన్ని చెదురుముదురు ఘటనలు మినహా 300 నియోజకవర్గాలకు గానూ..299 స్థానాల్లో ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింది. జైలుశిక్ష అనుభవిస్తు్న్న మాజీ ప్రధాని ఖలిదా జియాకి చెందిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) ఎన్నికలను బహిష్కరించడంతో ప్రజలు ఓటేసేందుకు తక్కువగా వచ్చారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య జరుగుతున్న 12వ సాధారణ ఎన్నికలను భారత్కు చెందిన ముగ్గురు సహా 100 మందికి పైగా విదేశీ పరిశీలకులు పర్యవేక్షించారు. శాంతిభద్రతలను కాపాడేందుకు ఎన్నికల వేళ బంగ్లా ఆర్మీ మోహరించింది.
76 ఏళ్ల షేక్ హసీనా 2009 నుంచి అధికారంలో ఉన్నారు. ఆమె పార్టీ అవామీ లీగ్ 2018 ఎన్నికల్లో కూడా విజయం సాధించింది. హసీనా భారత్కి అనుకూలంగా ఉన్నారు. బీఎన్పీ-జమాతే కూటమి ఇస్లామిక్ శక్తులకు మద్దతుగా ఉందనే వాదన ఉంది.
బంగ్లదేశ్ జాతిపితగా చెప్పబడే షేక్ ముజిబుర్ రెహ్మన్ కుమార్తెనే షేక్ హసీనా. 1975లో సైనిక తిరుగబాటు సమయంలో షేక్ ముజిబుర్తో పాటు తల్లి, సోదరులను హత్య చేశారు. షేక్ హసీనా, ఆమె సోదరి రెహానా విదేశాల్లో ఉండటంతో బతికిపోయారు. వీరికి భారత్ ఆశ్రయం ఇచ్చింది. ఇందుకు ఆమె భారత్కి పలుమార్లు థాంక్స్ చెప్పారు. తాజాగా ఆమె మాట్లాడుతూ.. భారత్ వంటి నమ్మకమైన మిత్రుడు ఉండటం బంగ్లాదేశ్ అదృష్టమని అన్నారు.