Leading News Portal in Telugu

వైసీపీ ఎత్తులు.. వినాయక్ ఇంటికి దారేది? | ycp building pressure on cine director vvvinayak| party| join


posted on Jan 7, 2024 7:15PM

ఏపీలో వైసీపీకి తొలి నుండి సినిమా రంగంతో పాటు ఇతర రంగాల్లో ప్రముఖులైన స్టార్ క్యాంపెయినర్లు లేరు. దీంతో వైసీపీ సినిమా ఇండస్ట్రీలో ఫేడ్ అవుట్ అయిన హీరోయిన్లకు, కమెడియన్లను, యాంకర్లకు గాలమేసి కాలం గడుపుకుంటూ వస్తోంది.  అయితే, జగన్ ప్రభుత్వం వచ్చాక వారికి చేకూర్చిన లబ్ది ఏదీ లేకపోవడంతో ఇప్పుడు వారు కూడా వైసీపీతో ఆంటీ ముట్టనట్లే ఉంటున్నారు. ఇంకా చెప్పాలంటే గత ఎన్నికలకు ముందు వారిని ఎంత వాడుకోవాలో అంతా వాడేసుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక వాళ్ళను పట్టించుకున్న పాపాన పోలేదు.  థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ లాంటి వారికి పదవి ఇచ్చినట్లే ఇచ్చి అవమానకర రీతిలో వెళ్ల గొట్టేశారు. ఇక కమెడియన్ అలీ లాంటి వారి ఆశలు అడియాశలు అవుతూనే ఉన్నాయి. మాజీ హీరోయిన్లు రోజా లాంటి వారు ఉన్నా.. వారి స్థానాలలో వారికి టికెట్ ఇచ్చినా వృధానే అని వైసీపీ పెద్దలు డిసైడ్ అయిపోయారు. దీంతో ఇప్పుడు ఎలాగయినా కాస్త గ్లామర్ టచ్ ఉన్న క్యాంపెయినర్ల కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.

 అలాగే వైసీపీకి ఇప్పుడు కాపు సామజిక వర్గ ఓటర్లను ఆకర్శించే వారు కూడా కావాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేనతో కాపు సామాజికవర్గాన్ని ఆకర్షిస్తుండగా.. వైసీపీ ఎలాగైనా కాపు ప్రముఖులను ఆకర్షించడమే టార్గెట్ చేసుకొని పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే ముందుగా కోస్తాంధ్ర నుండి వంగవీటి మోహన్ రంగా తనయుడు రాధాకృష్ణపై తమ వైపు తెచ్చుకునేందుకు ప్రయత్నించారు. వైసీపీలోకి వస్తే విజయవాడ సెంట్రల్ స్థానాన్ని కేటాయిస్తామని ఆఫర్ ఇచ్చినట్లు కూడా తెలిసింది. ఆ మధ్యన మిధున్ రెడ్డి రాధాకృష్ణతో చర్చలు జరిపినట్లు రాజకీయ వర్గాల సమాచారం. అయితే  రాధాకృష్ణ వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపలేదు.  దీంతో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి ఇన్చార్జిగా వెల్లంపల్లి శ్రీనివాస్ ను నియమించారు.   యంగ్ క్రికెటర్ అంబటి రాయుడును వైసీపీలోకి చేర్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో గుంటూరు ఎంపీ స్థానం నుంచి రాయుడును పోటీ చేయించి.. రాష్ట్రమంతా తనతో ప్రచారం చేయించాలని భావించారు. కానీ రాయుడు పార్టీ చేరినంత సమయం కూడా ఆ పార్టీలో ఇమడలేక బయటకు వెళ్లిపోయారు.

 మంచి క్రికెటర్ అయిన రాయుడు కనీసం క్రిజ్ లోకి కూడా రాకుండానే డకౌట్ అయిపోయారు. ఇక గోదావరి జిల్లాల విషయానికి వస్తే ఇక్కడ కాపు ఉద్యమ మాజీ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిక దాదాపు ఖరారు అయ్యింది. ఆయన కుమారుడుతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం కూడా జరుగుతోంది. ముద్రగడ చేరికతో కాపు సామాజిక వర్గాన్ని ఎంతోకొంత పవన్ వైపు వెళ్లకుండా నియంత్రించవచ్చని ఆశపడుతున్నారు. అయితే ఆయన పూర్తి స్థాయిలో కాపు సామాజిక వర్గాన్ని ఆకర్షించలేరన్న అనుమానంతో   సినీ గ్లామర్ ఉన్న కాపు సామాజికవర్గ ప్రముఖుల కోసం వైసీపీ జల్లెడ పడుతున్నది. ఆ క్రమంలోనే సినీ దర్శకుడు వీవీ వినాయక్ కు గాలం వేస్తోంది. . పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వినాయక్ కుటుంబం తొలి నుండి ఆ జిల్లాలో కాంగ్రెస్ లో కీలకంగా ఉండగా.. ప్రస్తుతం వారు వైసీపీలో ఉన్నారు. వినాయక్ సోదరుడు స్థానికంగా వైసీపీ కోసం పనిచేస్తున్నారు కూడా . అయితే ఈసారి వినాయక్ ను డైరెక్ట్ గా రంగంలోకి దింపాలని వైసీపీ పెద్దలు ఆశపడుతున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ముద్రగడతో, పశ్చిమ గోదావరి జిల్లాలో వినాయక్ తో ప్రచారం చేయించాలని వైసీపీ ప్రయత్నాలు చేస్తున్నది.

 నిజానికి గత ఎన్నికల్లోనే నిడదవోలు అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ తరఫున వినాయక్ పోటీ చేయాలని ఒత్తిడి తెచ్చారు. కానీ, ఆయన మాత్రం  ముందుకు రాలేదు. ఇప్పుడు మరోసారి ఏలూరు నుంచి కానీ, రాజమండ్రి నుంచి కానీ పార్లమెంటు స్థానానికి కచ్చితంగా పోటీ చేయాలని ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తున్నది. అయితే వినాయక్ స్వతహాగా చిరంజీవి అభిమాని.. మెగా కాంపౌండ్ కు దగ్గరగా ఉండే వ్యక్తి.  నందమూరి కుటుంబంతో కూడా మంచి అనుబంధం ఉంది. రాజకీయంగా ఆయన కుటుంబం వైసీపీలో ఉన్నా.. ఇండస్ట్రీలో ఆయనకున్న స్నేహాలు, పరిచయాల వలన ఆయన వైసీపీ నుండి పోటీచేసి జనసేనకు వ్యతిరేకంగా వెళ్లే పరిస్థితి ఉండదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  వైసీపీ నేతలు మాత్రం వినాయక్ ఇంటికి దారేది అంటూ వెతుక్కుంటూ వారి ఫ్యామిలీని కాకాపట్టే పనిలో ఉన్నట్లు తెలుస్తున్నది. మరి వినాయక్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.