జగన్ ధైర్యంపై షర్మిల చావుదెబ్బ! | sharmila direct attack on jagan confidence| sittings| courage| congress
posted on Jan 8, 2024 9:02AM
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ రాజకీయహీట్ పీక్స్ కు వెడుతోంది. ఏడాది మారి ఎన్నికల ఏడాదిలో అడుగు పెట్టగానే వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరడంతో రాష్ట్ర రాజకీయాలలో కీలక మలుపు చోటు చేసుకున్నట్లైంది. నిజానికి షర్మిల తెలంగాణలో పార్టీ ప్రారంభించిన సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లైతే ఇంత ఎఫెక్ట్ కనిపించేది లేదు. కానీ సరిగ్గా ఎన్నికలకు ముందు షర్మిల కాంగ్రెస్ లో చేరడం, అదీ ఏపీలో రాజకీయం మొదలు పెట్టనుండడం ఆసక్తిని పెంచింది. కా రణం.. షర్మిల కాంగ్రెస్ లో చేరిక కచ్చితంగా తన అన్న జగన్ మోహన్ రెడ్డి నష్టం చేసేదే కావడం. నిజానికి ఈసారి తనకు ఓటమి తప్పదని జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడో నిర్ణయించుకున్నారు. రకరకాల మార్గాల ద్వారా సర్వేలు చేయించుకున్న జగన్.. ఓటమి తథ్యమనే తెలడంతో నష్ట నివారణకు ఉన్న ఏ అవకాశాన్నీ వదలకుండా తన ప్రయత్నాలు తాను సాగించారు. ముందుగా టీడీపీతో పవన్ కళ్యాణ్ కలిస్తే తనకు నష్టమని భావించిన జగన్.. ఆ పొత్తు పొడవకుండా విచ్ఛిన్నం చేయడానికి చేయగలిగినంతా చేశారు. కానీ ఆ పప్పులేం ఉకడకపోవడంతో కనీసం తమ అభ్యర్థులను మార్చేసి వైసీపీ క్యాడర్ లో అసంతృప్తి తగ్గించాలని ఆశపడ్డారు.
తెలుగుదేశంతో జనసేన పొత్తులో భాగంగా ఇప్పటికే చాలా సీట్ల సర్దుబాటు విషయంలో ఆ పార్టీలు దాదాపుగా ఒక అవగాహనకు వచ్చేశాయి. సీనియర్లు, జూనియర్లు, కొత్తవారు, పాతవారు, సామజిక కోణం ఇలా అన్నీ లెక్కలేసుకొని రెండు పార్టీలూ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ఆరంభించేశాయి కూడా. దీంతో ఈ రెండు పార్టీలలో ఉన్న అభ్యర్థులనే అడ్జెస్ట్ చేసుకొని పోటీకి దిగాల్సిన పరిస్థితి ఉంది. దీంతో ఇతర పార్టీల నుండి వచ్చే వారికి ఇక్కడ స్కోప్ లేకుండా పోయింది. టికెట్ దక్కదని తెలిసి కూడా వైసీపీ నుంచి ఆ పార్టీలలోకి వెళ్లినా కూడా పెద్దగా ఉపయోగం ఉండదని భావించిన జగన్ మోహన్ రెడ్డి ఆ ధైర్యంతో నే వైసీపీలో సిట్టింగులను మార్చేసేందుకు సిద్ధమయ్యారు.తెలుగుదేశం,జనసేనలో తన పార్టీ నుంచి గోడదూకే వారికి చోటు ఉండదన్న ఒకే ఒక ధైర్యంతో జగన్ సిట్టింగుల మార్పు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సీటు ఇవ్వకపోయినా చాలామంది ఎమ్మెల్యేలు గత్యంతరం లేక పార్టీ గెలుపు కోసం కృషి చేస్తారని జగన్ బావించారు. కానీ జగన్ ధైర్యంపై, ఆశలపై షర్మిల చావుదెబ్బ కొట్టారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. ఏ ధైర్యంతో జగన్ సిట్టింగుల మార్పుకు శ్రీకారం చుట్టారో ఆ ధైర్యాన్ని షర్మిల తన ఎంట్రీతో దెబ్బ తీశారు.
వైసీపీలో అసంతృప్తులకు తెలుగుదేశం, జనసేనలో చోటులేకపోయినా.. షర్మిల రెడ్ కార్పెట్ వేసి కాంగ్రెస్ లోకి వెల్కమ్ చెప్పడం గ్యారంటీ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. షర్మిల ఇలా కాంగ్రెస్ కండువా కప్పుకోగానే అలా వైసీపీకి చెందిన ఇద్దరు సీనియర్ నేతలతో ఫోన్ సంభాషించినట్లు వార్తలొచ్చాయి. ముందు ముందు వైసీపీ అసంతృప్త నేతలందరితో కాంగ్రెస్ పార్టీ షర్మిల ద్వారా టచ్ లోకి వెళ్లడం గ్యారంటీగా కనిపిస్తుంది. ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డికి నమ్మిన బంటు లాంటి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిలతో నడక ప్రారంభించారు. షర్మిల చేతుల మీదగా కాంగ్రెస్ కండువా కప్పుకొనే తొలి ఎమ్మెల్యే తానేనని ప్రకటించేశారు. కాగా, ఇప్పటి వరకూ సిట్టింగులను మారుస్తూ జగన్ విడుదల చేసిన రెండు జాబితాలలో సీటు మారి, అసలు సీటే దక్కని అసంతృప్త నేతలలో పలువురు జగన్ కు బైబై చెప్పేందుకు సిద్ధమవుతుండగా.. వారందరినీ కాంగ్రెస్ గాలమేసి పట్టుకొనేందుకు రెడీ అవుతోంది. టికెట్ లేకపోయినా వైసీపీ గెలుపు కోసం పనిచేస్తామంటూ గంభీర ప్రకటనలు చేసిన ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ వైపు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
వైసీపీలో ఎలాగు టికెట్ దక్కలేదు.. ఒకవేళ టికెట్ ఇచ్చినా అది తమకి కొత్త నియోజకవర్గం కనుక అక్కడ జగన్ మోహన్ రెడ్డిని చూసి ఓటేసే పరిస్థితి లేదు అని భావిస్తున్న వైసీపీ సిట్టింగులందరికీ ఇప్పుడు షర్మిల అండా దండగా కనిపిస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ లో చేరి ఓడినా పోరుగున తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీదే అధికారం కనుక కనీసం వ్యాపారం చేసుకొని బ్రతికేయొచ్చు. ఎలాగూ వైసీపీకి అధికారం దక్కే పరిస్థితి లేదని తెలిసినపుడు ఇప్పుడు ఎవరి గెలుపు కోసమో పనిచేసి ఐదేళ్ల పాటు ప్రతిపక్షంగానే మిగిలిపోవడం కన్నా.. గెలిచినా ఓడినా కాస్త గౌరవంగా ఉండే కాంగ్రెస్ పార్టీయే బెటర్ అని వైసీపీలో అసంతృప్త ఎమ్మెల్యేలు భావిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తంగా ఎంతో దైర్యంగా సిట్టింగుల మార్పు అంటూ జగన్ తన చివరి అస్త్రాన్ని ప్రయోగించినా.. చెల్లెలు షర్మిల వచ్చి ఆ ధైర్యాన్ని కూడా దెబ్బతీసేసిందని, ఇప్పుడు జగన్ ఓటమి కోసం ఎదురు చూడటం తప్ప మరో గత్యంతరం లేని పరిస్థితుల్లో పడ్డారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.