Leading News Portal in Telugu

President Muizzu: మాల్డీవులు ప్రెసిడెంట్ పై అవిశ్వాస తీర్మానం..!


President Muizzu: మాల్డీవులు ప్రెసిడెంట్ పై అవిశ్వాస తీర్మానం..!

Maldives-India Row: ప్రధాని నరేంద్ర మోడీపై, భారత పౌరులపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు ఇప్పుడు మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజుకు తీరని కష్టాలను తెచ్చిపెట్టింది. దీన్ని సద్వినియోగం చేసుకున్న ప్రతిపక్షాలు ఇప్పుడు అధ్యక్షుడు ముయిజ్జును అధికారం నుంచి తప్పించే పనిలో పడ్డాయి. మాల్దీవుల్లోని పార్లమెంటరీ మైనారిటీ నాయకుడు అలీ అజీమ్ అధ్యక్షుడు ముయిజుపై అవిశ్వాస తీర్మానానికి పిలుపునిచ్చారు. ప్రెసిడెంట్ ముయిజ్జును అధికారం నుంచి తొలగించాలని అతను విజ్ఞప్తి చేశాడు. దేశ విదేశాంగ విధానం యొక్క స్థిరత్వాన్ని కొనసాగించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అలీ అజీమ్ పేర్కొన్నారు.


ఇక, సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెడుతూ.. వెంటనే మాల్దీవుల్ అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూను అధికారం నుంచి తొలగించడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలన్నారు.. అలాగే, మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ (MDP) అవిశ్వాస తీర్మానం ప్రవేశా పెట్టాలని ఆయన కోరారు. పొరుగు దేశాలతో సంబంధాలను దెబ్బ తీసేలా ముయిజ్జూ పని చేస్తున్నారని పార్లమెంటరీ మైనార్టీ నాయకుడు అలీ అజీమ్ వెల్లడించారు.

అయితే, ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్‌లో పర్యటించిన తర్వాత పలువురు మాల్దీవుల మంత్రులు సోషల్ మీడియాలో అవమానకర వ్యాఖ్యలు చేయడంతో వివాదం చెలరేగింది. ప్రధాని మోడీపై చేసిన వ్యాఖ్యలకు గానూ ముగ్గురు డిప్యూటీ మంత్రులను మాల్దీవుల ప్రభుత్వం ఆదివారం సస్పెండ్ చేసింది. మాల్దీవుల మీడియా కథనాల ప్రకారం.. యువజన మంత్రిత్వ శాఖలోని డిప్యూటీ మంత్రులు మల్షా షరీఫ్, మరియం షియునాతో పాటు అబ్దుల్లా మహ్జూమ్ మాజిద్‌లను సస్పెండ్ చేసింది. కాగా, సోమవారం భారత్‌లోని మాల్దీవుల రాయబారిని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పిలిపించి, వారి వ్యాఖ్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.