posted on Jan 12, 2024 10:34AM
ప్రజా వ్యతిరేకతను మూట గట్టుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఒడ్డుకు చేరడం కష్టంగా ఉంది. ఆ పార్టీ నుంచి ఒక్కొక్కరూ పక్కపార్టీల వైపు చూస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని ప్రజలకు అర్థం అయినట్టు ఉంది. దీంతో వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో జంపింగ్ జపాంగ్ ల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. తాజాగా పిఠాపురం ఎమ్మెల్యే జగన్ కు షాక్ ఇవ్వబోతున్నారు. జనసేనలో చేరవచ్చని విశ్వసనీయ సమాచారం.
సర్వేల పేరిట సిట్టింగ్ లకు వైఎస్ ఆర్ కాంగ్రెస్ టికెట్లను నిరాకరిస్తోంది.ఈ నేపథ్యంలో దొరబాబుకు వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం టికెట్ నిరాకరించింది. దీంతో దొరబాబు త్వరలో పార్టీ మారుతారని ప్రచారం జరుగుతోంది. ఇదిలావుంటే శుక్రవారం (జనవరి 12) పెండెం దొరబాబు పుట్టినరోజు కావడం విశేషం. ఈ క్రమంలోనే పుట్టినరోజు వేడుకల పేరుతో అనుచరులతో దొరబాబు భారీ సమావేశం ఏర్పాటు చేశారు. వేడుకల కోసం ఏర్పాటు చేసిన స్వాగత ఫ్లెక్సీలు, జన్మదిన శుభాకాంక్షల కటౌట్‌లలో ఎక్కడా వైసీపీ జెండా కానీ.. జగన్ ఫోటో కానీ లేకుండా సిద్ధం చేయించినట్లు తెలుస్తోంది. ఈ రోజు రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం ప్రకటిస్తారా అనే దానిపై నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. దొరబాబుకు ఎమ్మెల్యే టికెటును నిరాకరించి ఆ స్థానంలో ఇన్‌చార్జిగా కాకినాడ ఎంపీ గీతను వైసీపీ అధిష్టానం ప్రకటించింది. వైసీపీలో మార్పులు, చేర్పులు ఆ పార్టీ నేతల్లో గుబులు రేపుతున్నాయి. టికెట్ దక్కని పలువురు నేతలు పార్టీకి ఇప్పటికే గుడ్ బై చెప్పారు. మరి కొందరు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. పెండెం దొరబాబు కూడా వైసీపీకి రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆయనకు పార్టీ నాయకత్వం టికెట్ ను నిరాకరించడమే దీనికి కారణం.